అరాచకాలపై ఫిర్యాదులు వచ్చాయి
అందుకే 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశాలిచ్చాం
అవసరమైన చోట్ల అదనపు బలగాలు కేటాయిస్తాం
15–20 శాతం పంచాయతీలు ఏకగ్రీవమవుతాయని ఆశిస్తున్నాం
23చోట్ల జరిగే మున్సిపోల్స్‌కు కలెక్టరేట్‌లో కూడా నామినేషన్లు వెయ్యొచ్చు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ
సాక్షి, తిరుపతి: గ్రామ పంచాయతీ, రెండో విడత పురపాలక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం 12 జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏడీజీ (లా అండ్ అర్డర్) మధుసూధన్‌రెడ్డి, ఐజీ రాజకుమారి, రాయలసీమ రేంజ్ ఐజీలు షిమోషీ, కోయ ప్రవీణ్, తిరుపతి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల ఎస్పీలు సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల ఎస్పీలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
19, 20న జెడ్పీ చైర్మన్ ఎన్నికలు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై పల్నాడు, రాయలసీమలో పెద్దఎత్తున ఫిర్యాదులందాయి. దీంతో పల్నాడు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మొత్తం 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటుచేశాం. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతీదశలో ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించాం. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారమున్న చోట్ల అదనపు బలగాలను కేటాయిస్తాం. ఈనెల 19న ఎంపీపీ, 20న జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తాం.
15–20 శాతం వరకు ఏకగ్రీవాలు?
పంచాయతీల ఏకగ్రీవానికి సంబంధించిన కొత్త జీఓ ఆధారంగా మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. సుమారు 15–20 శాతం దాకా పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, బలవంతపు చర్యలకు తావుండకూడదు. ఫిర్యాదులొస్తే సమీక్షిస్తాం. 23 చోట్ల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైతే జిల్లా కలెక్టరేట్‌లో సైతం నామినేషన్ల దాఖలుకు అవకాశమిస్తాం. సీసీ కెమెరాల ని«ఘాతో పాటు వీడియోగ్రఫీ ఏర్పాటుచేశాం. ఎన్నికల అవకతవకలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై సంబంధిత కలెక్టర్, ఎస్పీలను నివేదికలు అడిగాం. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
మొత్తం 1,182 ఫిర్యాదులు అందాయి
ఐజీ రాజకుమారి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 1,182 ఫిర్యాదులు అందాయన్నారు. వాటిలో అత్యధికంగా కడప జిల్లాలో 278, తిరుపతిలో 136, అన్నమయ్య జిల్లాలో 132 నమోదయ్యాయని చెప్పారు. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ సమయాల్లో అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, కిడ్నాప్, పత్రాలు చింపివేత వంటి ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


