పంచాయతీల్లోనూ అరాచకమే! | Police threats and bindovers before nominations in Panchayat elections | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లోనూ అరాచకమే!

Nov 15 2026 5:03 AM | Updated on Nov 15 2026 5:04 AM

Police threats and bindovers before nominations in Panchayat elections

చంద్రబాబు డైరెక్షన్‌లో రెచ్చిపోతున్న పచ్చముఠాలు 

నామినేషన్లకు ముందే పోలీసుల బెదిరింపులు.. బైండోవర్లు

పోటీకి సిద్ధమైన వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా పచ్చమూకల దాడులు 

నామినేషన్‌ కేంద్రాల కుదింపునకు అధికార కూటమి కుట్ర  

మండలానికి ఒకేచోట కేంద్రం.. ప్రత్యర్థుల నామినేషన్లకు అడ్డుకట్ట వేసే యత్నం.. సర్పంచి పదవులకు బహిరంగ వేలాలు 

దుర్గాడలో రూ.1.20 కోట్లు, కొప్పులకొండలో రూ.29 లక్షలకు పదవుల బేరసారాలు.. ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే దాడులు 

ముకుందరాజుపేటలో వైఎస్సార్‌సీపీ నేతపై కత్తులు, కర్రలతో దాడి 

నామినేషన్‌ వేస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు  

పెళ్లకూరు మండలం అర్ధమాలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి 

పులివెందుల, నరసరావుపేట, వినుకొండలో పోలీసుల అరాచకాలు, అక్రమ నిర్బంధాలు  

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో పచ్చముఠాలు బరితెగిస్తున్నాయి. ఓటమి భయంతో ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థులను పోటీకి దూరం చేయడమే లక్ష్యంగా కుట్రలకు తెరతీశారు. నామినేషన్‌ వేస్తే చంపేస్తామంటూ బెదిరింపులు.. పోటీకి సిద్ధమైన వారిపై మూకుమ్మడి దాడులు.. సర్పంచి పదవులకు బహిరంగ వేలాలు.. ఏకగ్రీవాలకు అంగీకరించని వారిపై భౌతిక దాడులు.. మరోవైపు పోలీసుల బైండోవర్లు, అక్రమ నిర్బంధాలు, అధికారుల తనిఖీల పేరుతో వేధింపులు! ఇలా అడుగడుగునా అధికార బలాన్ని ప్రయోగిస్తూ పల్లెల్లో ఎన్నికల స్వేచ్ఛను కాలరాస్తున్నారు.

నామినేషన్‌ కేంద్రాల కుదింపు మొదలు ప్రత్యర్థులపై దాడుల వరకు అన్నింటా ప్రజాస్వామ్య హక్కులకు సంకెళ్లు వేస్తున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అను­సరించిన బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తున్నారు. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన ఎన్నికలను టీడీపీ నేతలు తమకు నచ్చిన వారిని ఏకగ్రీవంగా ప్రకటించుకునే ప్రక్రియగా మార్చేస్తున్నారు. ఓటుతో ప్రజాతీర్పు వెలువడాల్సిన పల్లెల్లో.. బెదిరింపులు, దౌర్జన్యాలు, వేలంపాటలతో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని రుద్దుతోంది!

నామినేషన్ల కేంద్రాల కుదింపునకు కుట్ర! 
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, శ్రీసత్యసాయి, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియను సైతం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. 

ఎన్నికల నిబంధనల ప్రకారం పెద్ద గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల్లోనే, చిన్న పంచాయతీల విషయంలో రెండు నుంచి నాలుగు పంచాయతీలకు ఒకచోట, వాటిలో పెద్ద గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల కేంద్రం ఏర్పాటు చేయాలి. కానీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తరహాలోనే తమకు నచ్చని అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు మండల కేంద్రాల్లోనే అన్ని పంచాయతీలకు కలిపి నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు సాగించారు. ఎక్కువ నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అన్ని చోట్లా పోలీసు బందోబస్తు కల్పించడం కష్టమంటూ పోలీసుల ద్వారా నివేదికలు తెప్పించి, కేంద్రాల సంఖ్యను తగ్గించాలన్నది ప్రభుత్వ పెద్దల వ్యూహంగా ఆరోపణలు వచ్చాయి. 

ఈ కుట్రను పసిగట్టిన కొందరు ఆశావహ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారమే నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనావళిని తప్పనిసరిగా పాటించాలని, దానికి అనుగుణంగానే గ్రామాల్లో నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో మండల కేంద్రంలో ఒకేచోట అన్ని పంచాయతీల నామినేషన్లు స్వీకరించాలన్న ప్రయత్నానికి బ్రేక్‌ పడింది.  అయినా, కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల తీరు మారడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాల్లో 8 నుంచి 10 పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ పంచాయతీలో నామినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు ఆర్డీవోలు, ఎంపీడీవోలపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

పదవికి బహిరంగ వేలం.. ఒప్పుకోవాలంటూ ఒత్తిళ్లు! 
గ్రామాల్లో సామాజిక, ఆర్థిక అసమానతలను ఆసరాగా చేసుకుని సర్పంచి పదవులను వేలం వేసే కొత్త తరహా రాజకీయాలకు అధికార పార్టీ నేతలు తెరతీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు అధికంగా ఉండి, ఆర్థికంగా బలమైన అగ్రవర్ణ సామాజికవర్గాల జనాభా తక్కువగా ఉన్న గ్రామాల్లో గుడి నిర్మాణం, అభివృద్ధి పేరుతో సర్పంచి పదవికి బహిరంగ వేలాలు నిర్వహిస్తున్నారు. వేలంలో పదవి దక్కించుకున్న వ్యక్తికే గ్రామమంతా మద్దతు ఇవ్వాలంటూ మిగిలిన సామాజికవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. 

గ్రామ కట్టుబాట్ల పేరుతో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామ పంచాయతీలో శివాలయం అభివృద్ధి పేరుతో సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. జనసేనకు చెందిన ఒక నేత శివాలయం నిర్మాణానికి రూ.1.20 కోట్లు విరాళంగా ఇస్తానంటూ సర్పంచి పదవికి వేలంలో పాల్గొన్నారు. ఈ నిర్ణయానికి గ్రామంలోని మిగిలిన సామాజికవర్గాలన్నీ కట్టుబడి ఉండాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. 

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలోనూ ఇదే తరహా వ్యవహారం చోటుచేసుకుంది. గ్రామ పెద్దలు నిర్వహించిన వేలంలో రూ.29 లక్షలకు సర్పంచి పదవిని టీడీపీ నేత దక్కించుకున్నట్టు సమాచారం. గ్రామంలో మరెవరూ నామినేషన్‌ దాఖలు చేయకూడదంటూ ఒత్తిళ్లు తెస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని మరో గ్రామ పంచాయతీలో సర్పంచి పదవికి రూ.15 లక్షలకు వేలం నిర్వహించారు. అయితే, గ్రామంలోని ఇతర సామాజికవర్గాలు అంగీకరించకపోవడంతో చివరి నిమిషంలో వేలాన్ని రద్దు చేసుకున్నారు.  

‘స్వచ్ఛంద’ జీవోతో బలవంతపు ఏకగ్రీవాలు! 
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయి. సర్పంచి పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలన్నింటికీ గ్రామ ప్రజలంతా స్వచ్ఛందంగా ఏకాభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ ప్రోత్సాహకాలను అడ్డుపెట్టుకుని బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం చట్టవిరుద్ధం. పోటీకి అర్హులైన అభ్యర్థుల నామినేషన్‌ హక్కును, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎవరూ అడ్డుకోకూడదు. కానీ, స్వచ్ఛంద ఏకగ్రీవాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ జీవోను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రోత్సాహకాల పేరుతో గ్రామాల్లో బలవంతపు ఏకగ్రీవాలకు తెరతీస్తున్నారు.

 రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతో గ్రామస్థాయి టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై ఒత్తిళ్లు తెస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్లు వేయొద్దని, పోటీ నుంచి తప్పుకోవాలని హెచ్చరిస్తూ గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. స్వచ్ఛందంగా జరగాల్సిన ఏకగ్రీవాలను బెదిరింపులతో సాధించుకోవడం, ప్రజల నిర్ణయాన్ని ముందే శాసించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన అధికార యంత్రాంగమే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడ అని వారు ప్రశ్నిస్తున్నారు. 

నామినేషన్‌ వేస్తే చంపేస్తామంటూ బెదిరింపులు! 
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం అర్ధమాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచి పదవి జనరల్‌ కేటగిరీకి కేటాయించడంతో పోటీకి సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త శీనయ్యపై టీడీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డాయి. 

              తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో దాడిలో గాయపడిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త శీనయ్య 

శ్రీకాళహస్తి నుంచి ఆటోలో రౌడీలను తీసుకొచ్చిన స్థానిక టీడీపీ నాయకులు తనపై దాడి చేయించి, టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్‌ వేస్తే చంపేస్తామని బెదిరించినట్లు శీనయ్య వాపోయారు. మరికొందరికీ ఫోన్‌ చేసి ఇదే తరహా హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు శీనయ్య పెళ్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ముందస్తు చర్యల పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిర్బంధం! 
మున్సిపల్, పంచాయతీ ఎన్నికల వేళ పోలీసుల ద్వారా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై నిర్బంధకాండకు తెరతీశారు. ముందస్తు చర్యల పేరుతో శనివారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆకాష్, మాజీ డీలర్‌ జిలానీతో పాటు క్రిస్టియన్‌పాలెం, పెద్దచెరువు, బరంపేట ప్రాంతాలకు చెందిన సుమారు 25 మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌లో నిర్బంధించి, పూచీకత్తుపై విడుదల చేశారు. ఆదివారం తిరిగి స్టేషన్‌కు హాజరుకాకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

పల్నాడు జిల్లా వినుకొండ మండలం కొప్పుకొండలో సర్పంచ్‌ అభ్యర్థిని కోలా అరుణ ఇంటిముందు పోలీసులు  

వినుకొండ మండలం కొప్పుకొండలోనూ సర్పంచి అభ్యర్థి కోలా అరుణ ఇంటి వద్దకు వెళ్లిన ఎస్‌ఐ నరేష్‌ బైండోవర్‌ కేసుల పేరుతో స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారు. నామినేషన్‌కు ఒకరోజు ముందు బైండోవర్‌ చర్యలేమిటని ప్రశ్నించిన అరుణ సీసీటీవీ ఫుటేజీతో ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో సీఐ ప్రభాకర్‌ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో చట్టప్రకారమే బైండోవర్‌ చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకోవచ్చని, పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు.

పులివెందులలో బైండోవర్లు, అక్రమ అరెస్టులతో భయోత్పాతం 
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ముందే వైఎస్సార్‌సీపీ నాయకులను కట్టడి చేసేందుకు పులివెందుల పోలీసులు రంగంలోకి దిగారు. అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా సింహాద్రిపురం, లింగాల మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను శనివారం అదుపులోకి తీసుకుని బెదిరింపులకు దిగారు. ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, పలువురిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన తీరునే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తున్నారు. 

అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీకి సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపైనే బైండోవర్‌ చర్యలు, నిర్బంధాలు ప్రయోగిస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు అభ్యర్థులందరూ నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చని, కట్టుదిట్టమైన భద్రత కల్పించామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసుల చర్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

సర్పంచి పోటీకి సిద్ధమైతే.. రైస్‌మిల్లు సీజ్‌!  
పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ కక్ష సాధింపులకు అధికార పార్టీ బరి తెగించి మరీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందుకు వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె ఉదంతం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న సాదక్‌వల్లి కుమారుడి కుటుంబానికి చెందిన రైస్‌మిల్లును మార్కెటింగ్‌ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. వేంపల్లెలో ఆరు రైస్‌మిల్లులు ఉండగా, కేవలం సాదక్‌వల్లి మిల్లుపైనే దాడులు చేసి సీజ్‌ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

        వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో రైస్‌ మిల్లును సీజ్‌ చేస్తున్న మార్కెట్‌ యార్డ్‌ శాఖ అధికారులు 

విజిలెన్స్‌ నివేదిక, రికార్డుల్లో లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతుండగా, రాజకీయ కక్షతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం ఆడించేందుకే మిల్లుకు తీసుకొచ్చామని, ఇప్పటికే కరువుతో ఇబ్బందులు పడుతున్న తమ ధాన్యాన్ని సీజ్‌ చేయడం అన్యాయమని వాపోయారు. ఆందోళనకు సిద్ధమైన రైతులను కేసులు నమోదు చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో ఉద్రిక్తత నెలకొంది.

వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో సర్పంచ్‌గా పోటీకి సిద్ధపడ్డారని సాదక్‌వల్లి కుటుంబానికి చెందినరైస్‌మిల్లు సీజ్‌ చేసిన నేపథ్యంలో సీఐని నిలదీస్తున్న రైతులు 

ఏకగ్రీవానికి ఒప్పుకోలేదని వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడి!  
పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవానికి అంగీకరించకుండా సర్పంచి పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి జరిగింది. అనకాపల్లి జిల్లా ముకుందరాజుపేటలో శనివారం గ్రామస్తుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత చొప్పా శ్రీను మాట్లాడుతూ గత రెండు పర్యాయాలుగా సర్పంచి పదవి ఏకగ్రీవమవుతోందని, పదేళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. సమావేశం నుంచి బయటకు వస్తుండగా టీడీపీ వర్గీయులు కత్తులు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అనకాపల్లి జిల్లా ముకుందరాజుపేటలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు 

ఈ ఘటనలో చొప్పా శ్రీను, చొప్పా తాతారావు, మేకల సత్యప్రసాద్, కొర్ని జోగారావు తదితరులు గాయపడ్డారు. తమను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ప్రాణహాని ఉందని, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను కోరారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ వర్గీయులే తమపై దాడి చేశారని టీడీపీకి చెందిన గింజాల లావణ్య ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన వారిపై దాడులు జరగడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement