నేటి నుంచి గ్రామ పంచాయతీ నామినేషన్లు
ఒక అభ్యర్థికి ఒకచోట నుంచే పోటీకి అర్హత
అన్ని ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి
వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను తదితర బకాయిలు ఉన్న వారు సర్పంచి/వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు అనర్హులని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులు నో–డ్యూస్ సర్టిఫికెట్ అందజేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా, బకాయిలు ఉంటే నామినేషన్ల పరిశీలన సమయంలో ప్రత్యర్థి ఫిర్యాదు చేయడానికి, నిబంధనల ప్రకారం అలాంటి వారు పోటీకి అనర్హులుగా అధికారులు పేర్కొనడానికి అవకాశం ఉంటుందని వెల్లడించడం గమనార్హం.
మరోవైపు అభ్యర్థి నామినేషన్ దాఖలు సమయంలో అందజేసే స్వీయ డిక్లరేషన్ ఫార్మేట్‌లో బకాయిల అంశం కూడా ఉండడం విశేషం. ఒకరు ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో పోటీ చేయడానికి వీలుండదని ఎన్నికల నిబంధనావళిలో పేర్కొన్నారు. అయితే, ఒకటి కంటే ఎక్కువ వార్డులకు ఎవరైనా నామినేషన్ దాఖలు చేసినా, ఏదో ఒక చోట నుంచే పోటీ చేయాలని స్పష్టం చేసింది. అయితే, ఎక్కువ చోట్ల నామినేషన్లు వేసి ఎక్కడా ఉపసంహరించుకోకుంటే అన్ని నామినేషన్లు చెల్లుబాటు కాకుండా పోతాయని పేర్కొంది.
అందజేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
» ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు తమ రిజర్వేషన్‌కు సంబంధించి తహసీల్దార్ హోదా కన్నా తక్కువ కాని అధికారి సమక్షంలో డిక్లరేషన్ పత్రం.
» అభ్యర్థి గత నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు స్వీయ డిక్లరేషన్‌ను నిర్ణీత ఫార్మెట్‌లో సమర్పించాలి.
» ఎన్నికల వ్యయంపై డిక్లరేషన్ ఫారం.
» ఎన్నికల డిపాజిట్ రశీదు.
నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు
తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న 3,967 గ్రామ పంచాయతీల్లో 3,967 సర్పంచి పదవులతో పాటు ఆయా పంచాయతీల్లోని మొత్తం 40,012 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. చిన్న గ్రామ పంచాయతీలలో 2–4 పంచాయతీలను ఒక క్లస్టరుగా ఏర్పాటు చేసి అందులో పెద్ద పంచాయతీల్లో నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 2011 గణాంకాల ప్రకారం పది వేలకు పైబడి జనాభా ఉండే గ్రామాల్లో ఎక్కడికక్కడే నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణకు ముందే పంచాయతీల కార్యాలయ నోటీసు బో ర్డులో ఎన్నికల నోటిఫికేషన్ కాపీ, ఓటర్ల జాబితాలను ఉంచాలని ఎస్‌ఈసీ ఆదేశాలిచ్చింది.


