ఫిర్యాదు అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
డీజీపీ కార్యాలయానికి వెళ్తే సెలవుల సాకుతో ఎందుకు తప్పించుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మాత్రం అర్ధరాత్రి కూడా తప్పుడు కేసులా?
అసభ్య వ్యాఖ్యలపై చర్యలు లేకుంటే న్యాయపోరాటం చేస్తాం
వైఎస్సార్‌సీపీ నేతల స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా (ఎక్స్ స్పేస్) వేదికగా జనసేన కార్యకర్తలు చేసిన అత్యంత అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుల బృందం మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేసింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి 60 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, పార్టీ ప్యానలిస్టు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు పెన్ డ్రైవ్‌తో కూడిన ఆధారాలను అందజేసి, అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘జనసేన సైకోలు సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ రాక్షస భాష మాట్లాడారు.
దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. అదే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అయితే ఎటువంటి సంబంధం లేకపోయినా ఒకే కేసుపై రాష్ట్రమంతా ఊరూరా తిప్పి వేధిస్తున్నారు. స్వయానా డీజీపీని కలిసి ఆధారాలు ఇద్దామని వస్తే శనివారం హాలిడే అని, ఎవరూ అందుబాటులో ఉండరని చెబుతున్నారు.
ఇదేనా డీజీపీ ఆఫీసు పనితీరు? మేము పెన్ డ్రైవ్‌తో కూడిన ఆధారాలను అక్కడి అధికారులకు ఇచ్చి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నాం. చంద్రబాబు అండగా ఉన్నారని, అవసరమైతే భౌతికంగా లేకుండా చేస్తామని ఆ వీడియోల్లో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడవద్దని మా నాయకుడు వైఎస్ జగన్ ఆదేశిస్తే మేమంతా సంయమనం పాటించాం. మరి తన పార్టీ సైకోల వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని వెలంపల్లి హెచ్చరించారు.


