ఇంటర్‌ విద్యలో మళ్లీ రెగ్యులరైజేషన్‌ దందా! | Collections in the name of regularization of contract lecturer posts in intermediate education | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యలో మళ్లీ రెగ్యులరైజేషన్‌ దందా!

Nov 15 2026 5:44 AM | Updated on Nov 15 2026 5:44 AM

Collections in the name of regularization of contract lecturer posts in intermediate education

ఇంటర్మీడియెట్‌ విద్యలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ పోస్టుల క్రమబద్ధీకరణ పేరిట వసూళ్ల జాతర

ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు ఫిక్స్‌

గత ఏడాది రూ.100 కోట్లు వసూలుచేసిన ఓ మంత్రి పేషీ

విషయం బయటకు పొక్కడంతో రంగంలోకి మరో మంత్రి పేషీ

ఇప్పుడు ఏకంగా దందాకు తెరలేపిన ఇంటర్‌ విద్యాశాఖ ఉన్నతాధికారులు

ప్రభుత్వానికి క్రమబద్ధీకరణ ఆలోచన లేదని హైకోర్టుకు వివరణ 

అయినా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను మభ్యపెడుతున్న అధికారులు 

3,572 మంది కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్ల జీవితాలతో వ్యాపారం

హైకోర్టులో పిటిషన్లు వేయకుండా ముందే ఒప్పందం.. 11 మంది పార్ట్‌టైమ్‌ జేఎల్స్‌కు క్రమబద్ధీకరణ

సాక్షి, అమరావతి: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం దండుకున్న వారికి దండుకున్నంత అన్న చందంగా మారింది. చట్టబద్ధంగా పూర్తి కావాల్సిన ప్రక్రియను గత సాధారణ ఎన్నికల సమయంలో అడ్డుకున్న వారే రేటు కట్టి వసూళ్లకు తెరతీశారు. ఈ విషయం బయటకు రాగానే వెనక్కి తగ్గారు. తాజాగా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖలోని అధికారులే తాము పోస్టులు క్రమబద్ధీకరిస్తామని ప్రచారం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ప్రభుత్వానికి క్రమబద్ధీకరించే ఆలోచన లేదని న్యాయస్థానాలకు చెబుతూ.. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను మభ్యపెడుతున్న ప్రభుత్వం, అధికారులు 3,572 మంది కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్ల జీవితాలతో వ్యాపా­రం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా­యి. 

ఏపీలోని 2014 జూన్‌కి ముందు చేరిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో ప్రత్యేక చట్టం చేసింది. దీని ప్రకారం 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్ధీకరించేందుకు చట్టం చేసి జీవో–114 ద్వా­రా మార్గదర్శకాలు జారీ చేశారు. అంతేగాక, వివిధ శాఖల్లో పనిచేస్తున్న 3,320 మంది సర్వీసును సైతం క్రమబద్ధీకరించారు. కానీ, కూటమి ప్రభుత్వం వ­చ్చాక మిగిలిన వారికి అన్యాయం చేయడంతో పా­టు అవకాశం ఉన్న ప్రతిసారి ఈ అంశాన్ని వాడుకుని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మరో­పక్క హైకోర్టును సైతం తప్పుదారి పట్టించి, ప్రభుత్వానికి నష్టం జరిగేలా చేసి అర్హత లేని 11 మంది పార్ట్‌టైమ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ (జేఎల్స్‌)ను ఇటీవల క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులివ్వడం గమనార్హం. 

ఇప్పుడు ఇంటర్మీడియెట్‌ అధికారుల వంతు!
క్రమబద్ధీకరణకు అర్హత పొంది మిగిలిపోయిన 7 వేల మందిలో దాదాపు 4,600 మంది విద్యారంగానికి చెందిన వారు కాగా, ఇంటర్మీడియెట్‌ విద్యలోనే జూనియర్‌ లెక్చరర్లు 3,572 మంది ఉన్నారు. వీరంతా ఏడాదిన్నర కాలంగా తమకు న్యాయం చేయాలని మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రమబద్ధీకరణ కోసం వివరాలు సమర్పించాలని ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారులు గూగుల్‌ షీట్‌తో సహా ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి క్రమబద్ధీకరణ అంశంపై ఇప్పటికే హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై గత నెలలో ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఇప్పట్లో ప్రభుత్వానికి క్రమబద్ధీకరణ చేసే ఆలోచన లేదని చెప్పారు. 

ఇంటర్మీడియెట్‌ అధి­కారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లడంపై అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ శాఖలోని కొందరు అక్రమాలు చేయడం, తప్పుదారి పట్టించడంలో సిద్ధహస్తులైన అధికారులు తెరవెనుక వసూళ్ల దందా ప్రారంభించినట్టు విశ్వసనీయ సమాచారం. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు ధర నిర్ణయించి డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిసింది. గత ఏడాది ఏలూరు జిల్లాకు చెందిన మంత్రి తరఫున డబ్బు వసూలు చేసే బాధ్యతను శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ భుజానకెత్తుకోగా.. ఇప్పుడు ఆ బాధ్యతను ఇంటర్‌ విద్యామండలిలోని అధికారులు తీసుకోవడం గమనార్హం. 

తాజాగా 11 మంది పార్ట్‌టైం జేఎల్స్‌కు క్రమబద్ధీకరణ
ఓ వైపు రెగ్యులరైజేషన్‌ కోసం వేల మంది జేఎల్స్‌ ఎదురుచూస్తుంటే, ఇటీవల 11 మంది పార్ట్‌టైమ్‌ జూనియర్‌ లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశా­రు. వారిలో పలువురికి సర్వీసు బ్రేక్‌ ఉన్నప్పటికీ ఇ­ష్టానుసారంగా రెగ్యులరైజ్‌ చేసేశారు. సుదీర్ఘకాలంగా పని­చేస్తున్నందున తమను క్రమబద్ధీకరించాలని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఓ పార్ట్‌టైమ్‌ జేఎల్‌ 2020­లో హైకో­ర్టును ఆశ్రయించారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని ఇంటర్‌ విద్యాశాఖను ఆదేశించినా ఇంటర్‌ అధి­కారులు కౌంటర్‌ వేయలేదు. అలాగే, పదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న మరో 10 మంది పార్ట్‌టైమ్‌ జేఎల్స్‌­ను క్రమబద్ధీకరించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

వీరి­లో చాలామంది మధ్యలో సర్వీస్‌ బ్రేక్‌ ఉన్నా ఇటీవల క్రమబద్ధీకరించారు. ఓ పార్ట్‌టైమ్‌ జేఎల్‌ ఏకంగా 1,039 రోజులు సర్వీసులో లేరు. ఆ కాలంలో ఆయ­న స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసినట్టు తేలింది. మరో జేఎల్‌ 485 రోజులు, ఇంకొకరు 14 నెలలు ఉద్యోగంలోనే లేరు. అయినా వారిని క్రమబద్ధీకరించారు. కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు వీలుగా కౌంటర్‌ వేయకుండా ఉండేందుకు ముందే బేరసారాలు జరిగి, అధికారులకు పెద్దమొత్తంలో వసూలు చేసినట్టు ఇంటర్‌ విద్యాశాఖ ఉద్యోగుల్లో వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పార్ట్‌టైమ్‌ జేఎల్స్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసినప్పటికీ అధికారులు కావాలనే కౌంటర్లు దాఖలు చేయలేదనే విమర్శలున్నాయి.  

గత ఏడాది రూ.100 కోట్లు వసూళ్లు..
క్రమబద్ధీకరణకు అర్హత పొందిన 10,117 మందిలో గత ప్రభుత్వంలోనే వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో 3,320 మందిని రెగ్యులరైజ్‌ చేయగా, మరో 7 వేల మందిలో పాలిటెక్నిక్‌ లెక్చరర్లు 309 మంది, డిగ్రీ లెక్చరర్లు 680 మందితో పాటు అత్యధికంగా జూనియర్‌ లెక్చరర్లు 3,572 మంది ఉన్నారు. ఈ శాఖలో అత్యధిక మంది ఉండటం.. చట్టం చేసి మూడేళ్లు అవుతున్న నేపథ్యంలో గతేడాది ఆర్డర్‌ రావాలంటే ముందు తలో రూ.3 లక్షలు ఇవ్వాలని ఏలూరు జిల్లాకు చెందిన కీలక మంత్రి పేషీ వసూళ్లకు తెరలేపింది. 

పని ప్రారంభించేందుకు ఒక్కొక్కరూ తొలుత రూ.1.50 లక్షలు చెల్లించాలని, పని పూర్తయ్యాక మరో రూ.1.50 లక్షలు ఇవ్వాలని షరతు పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా క్రమబ­ద్ధీM­ý రణకు అర్హులైన 7 వేల మంది నుంచి రూ.­200 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందు సగం డబ్బులిస్తేనే ప్రక్రియ మొదలవుతుందని, డబ్బులివ్వని వారికి అవకాశం ఉండదని హెచ్చరికలు పంపిస్తున్నారు. దీంతో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సుమారు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి ఇచ్చినట్టు సమాచారం. విషయం తెలిసిన మరో మంత్రి పేషీ తమ శాఖలోని పనులు చక్కబెట్టడంపై అడ్డుపడటం, విషయం మీడియాకు పొక్కడంతో అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది. డబ్బులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో తలోకొంత ఇచ్చి సర్దిచెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement