ఇలాగైతే ఇక ఎన్నికలెందుకు?
20 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కావాలట!
ఎస్‌ఈసీ ప్రకటనపై విస్తుపోతున్న ప్రజాస్వామ్యవాదులు
ఈ ఆకాంక్ష వెనుక టీడీపీ బరితెగింపునకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 20 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కావాలని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆకాంక్షించడం రాజకీయ, ప్రజాస్వామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థకు నేతృత్వం వహిస్తున్న సీనియర్ అధికారి ఏకగ్రీవాలపై ప్రత్యేకంగా ఆశాభావం వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎన్నికల కమిషనర్ బాధ్యత ఏకగ్రీవాలను ప్రోత్సహించడమా? లేక ప్రజలకు పోటీ చేసే, తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం కల్పించడమా? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే ప్రధాన వేదిక. గ్రామ స్థాయిలో సైతం ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలి.
పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తప్పు కాకపోయినా, ఏకగ్రీవాల శాతాన్ని ముందుగానే లక్ష్యంగా నిర్దేశించుకోవడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామాల్లో అభ్యర్థుల మధ్య పోటీ ఉండటం ప్రజాస్వామ్యానికి సహజ లక్షణం. అలాంటప్పుడు 20 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కావాలని ఆశించడం వెనుక ఆంతర్యమేమిటన్న చర్చ సాగుతోంది.
స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడమే మీ బాధ్యత
ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాల కోసం రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉంటుంది. ఏకగ్రీవాలు నిజంగా గ్రామస్తుల ఏకాభిప్రాయంతోనే జరుగుతున్నాయా? లేక రాజకీయ ప్రాబల్యం, అధికార ఒత్తిళ్ల ప్రభావంతో జరుగుతున్నాయా?
ఈ నేపథ్యంలో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం కల్పించడం, ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించడం ఎన్నికల కమిషన్ ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతను పక్కనపెట్టి ఏకగ్రీవాల శాతంపై ఆకాంక్షలు వ్యక్తం చేస్తే ఎన్నికల నిష్పాక్షికతపై సందేహాలు కలగడం సహజం. ఎన్నికలు నిర్వహించేది ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికా? లేక పోటీ లేకుండానే ఫలితాలు రావాలనుకోవడానికా? ఎస్‌ఈసీ తీరు చూస్తుంటే అధికార టీడీపీ శ్రేణులు బరితెగించి అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేసుకోండని ఉప్పందించడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: జనసేన రాక్షస భాషపై మౌనమెందుకు?


