సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అల్పపీడనం వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, సాయంత్రానికి దక్షిణ మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
బుధవారానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.


