ఇవాళ ఏపీలో పెద్ద డ్రామా నడిచింది!
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉదయం పెద్ద డ్రామా నడిచిందని.. జిల్లాల నుంచి పూర్తి సమాచారం రాకుండానే ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని ఎందుకు ప్రకటించిందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తాయని.. మంగళగిరి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ఎన్నికల విషయంలో కూటమి పార్టీల మధ్య ఏం జరుగుతుందో చెప్పాలి’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘మంగళగిరిలో ఎస్టీలకు వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా ఆలస్యం చేయటం అన్యాయం కాదా?. చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత ఆత్రం ఎందుకు?. నెలా రెండు నెలలు ఆగితే వచ్చే నష్టమేంటి?. అక్టోబర్ 16న సవరించిన ఓటర్ల జాబితా వస్తుంటే పాత జాబితాలతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటి?. ఓటర్ల జాబితాలో 44 లక్షల మృతులు, డబుల్ ఓట్లు, వలస వెళ్లినవారి పేర్లు ఉన్నాయని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. మరో 11 లక్షల కొత్త ఓట్లు చేర్చాల్సి ఉండగా పాత జాబితాలతో ఎన్నికలకు వెళ్లడం వెనుక ఉద్దేశమేంటి?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘చనిపోయినవారి పేర్లతో ఓట్లు వేయించాలనుకుంటున్నారా?. డబుల్ ఓట్లను కొనసాగించాలనుకుంటున్నారా?. దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది?. అక్టోబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చి పండుగ రోజుల్లో నామినేషన్లు వేయమనడం ఎంతవరకు సమంజసం?. హిందూ ధర్మం గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబుకు హిందువుల ప్రధాన పండుగలు కనిపించడం లేదా?. రూ.14 వేల కోట్ల నిధుల కోసమే ఎన్నికలంటున్న చంద్రబాబు, డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో కేంద్రంతో మాట్లాడి గడువు ఎందుకు పొందలేరు?. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?..ఒక వైపు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తూ, మరోవైపు నామినేషన్లకు తొందరపెట్టడం ఏం న్యాయం?. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బైండోవర్లు, రౌడీషీట్లు, పాత కేసులతో ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్పై ఎన్నికల కమిషన్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?. ప్రజల సమస్యలపై లేని ఆత్రం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల విషయంలోనే ఎందుకు వస్తోంది?. సవరించిన ఓటర్ల జాబితాతో, ప్రతిపక్షాలకు తగిన సమయం ఇచ్చి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది’’ అని శైలజానాథ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల