సాక్షి, వైఎస్సార్ జిల్లా/కర్నూలు: ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, పార్టీ నాయకులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయి.
ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డిని డీఎస్పీ మురళీ నాయక్ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. పోలింగ్ ఏజెంట్లను బూత్‌ల్లోకి అనుమతించాలని అవినాష్ రెడ్డి పట్టుబట్టినప్పటికీ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బయటి వ్యక్తులు పెద్ద సంఖ్యలో మోహరించినా పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లాలోకి వందలాది మంది చొరబడ్డారు. పార్నపల్లి బూత్ వద్ద రాళ్లు, కర్రలతో తిరుగుతున్నారు. బూత్‌ల్లోకి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారు. పోలీసుల సమక్షంలోనే బయటి వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.
లింగాల మండలంలో దాడులు.. సాక్షి విలేకరికి గాయాలు
వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అదే విధంగా జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్రీదేవి, స్వతంత్ర అభ్యర్థి సురేఖపై కూడా దాడి జరిగినట్టు సమాచారం. మహిళా అభ్యర్థులపై దాడి చేయడమే కాకుండా, వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కునేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనల్లో అభ్యర్థులతో పాటు విలేకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
కర్నూలు మండలంలోనూ ఉద్రిక్తత..
మరోవైపు కర్నూలు జిల్లాలోనూ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. ఆర్కే దుద్యాల, ఎదురూరు, తొలిసాపురం, బసాపురం, ఆర్. కొంతపాడు, సుంకేసుల గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఏజెంట్లకు సంబంధించిన పత్రాలను చించివేశారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికలు.. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్


