నష్టాలను వివరించిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంపై అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం ఆయన ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుపాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావం.. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం వివరించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీనష్టం వాటిల్లిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం ఏరియల్ వ్యూ
మరోవైపు.. మురసు తుపాను ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూలో పరిశీలించారు. అనంతరం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలకు వరద ప్రవాహాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. కారంచేడు నుంచి కొత్తపట్నం, చీరాల, చిలకలూరిపేట, పర్చూరు ముంపు ప్రాంతాల్ని త్వరితగతిన క్లియర్ చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన బుట్టాయగుడెం, వేలేరుపాడు, పోలవరం మండలం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు.


