బాబు పాలనలో అన్నదాతకు పుట్టెడు శోకం | A series of disasters have caused huge losses to farmers | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో అన్నదాతకు పుట్టెడు శోకం

Nov 5 2026 3:26 AM | Updated on Nov 5 2026 3:26 AM

A series of disasters have caused huge losses to farmers

వెన్నువిరిచిన వరుస విపత్తులు

ఓ వైపు అనావృష్టి.. మరో వైపు అతివృష్టి

పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన ఖరీఫ్‌ పంటలు 

అర్నబ్‌ తుపానుకు 9.38 లక్షల ఎకరాల్లో పంటలు మునక

తాజాగా మురసు తుపాను దెబ్బకు కకావికలం

మురసు ఎఫెక్ట్‌.. 3 లక్షల ఎకరాల్లో పంటలు మునక

పెట్టుబడులు నీటిపాలు.. చేతికొచ్చే పంటలు నాశనం

కరువు కోరల్లో చిక్కి వాన చినుకు కోసం తహతహలాడిన నేలతల్లి గుండెలపై ఇప్పుడు వరుస ప్రకృతి విపత్తులు కన్నీళ్లు పారిస్తున్నాయి. పాడిపంటలతో కళకళలాడాల్సిన పల్లెలోగిళ్లు నేలవాలిన పైర్లు, ముంపుచేలతో విలవిల్లాడుతున్నాయి. పుట్టెడు శోకంతో అన్నదాతకు బాధల గరళాన్ని పంచుతున్నాయి. ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు నేలవిడిచి ‘సేద్యం’ చేయడంతో కర్షకుల ఆర్తనాదాలు అరణ్యరోదనలా మారాయి. కర్కశ పాలకుల తీరును నిస్సహాయంగా గర్హిస్తున్నాయి.

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస విపత్తులు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఓ వైపు కరువు.. మరో వైపు భారీ వర్షాలు.. వరుస తుపానులు సంభవిస్తుండడంతో రైతన్నలు విలవిల్లాడిపోతున్నారు. తొలుత వర్షాభావం.. ఆ తర్వాత అడపాదడపా కురిసిన భారీ వర్షాలు.. అనంతరం అర్నబ్‌ తుపాను, ఇప్పుడు తాజాగా మురసు తుపాను.. ఇలా ఒకదాని వెంట మరొకటి విపత్తులు రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. తొలుత వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూసిన రైతులు.. నేడు కురుస్తున్న కుండపోత వర్షాలను చూసి బెంబేలెత్తుతున్నారు. 

వర్షాభావంతో మొదలైన కష్టాలు
ఖరీఫ్‌ ఆరంభంలోనే వర్షాలు ముఖం చాటేయడంతో కరువు కోరలు చాచింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విత్తనాలు వేయడం ఆలస్యమైంది. విత్తిన పంటలు తేమలేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. బోర్లు, బావుల ద్వారా నీటిని తోడి పంటలను కాపాడుకునేందుకు అదనపు ఖర్చులు చేయాల్సి వచ్చింది. వర్షాలు వస్తాయో రావో అన్న అనిశ్చితితో కొందరు రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోగా, మరికొందరు అప్పులు చేసి పరిస్థితులకు ఎదురొడ్డి మరీ సాగును కొనసాగించారు. ఎలాగొలా పంటలను గట్టెక్కించారు. 

అయితే చివరి దశలో నెల రోజులుగా వెంటాడుతున్న ప్రకృతి విపత్తులు కర్షకులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు కొత్త సమస్యలు తెచి్చపెట్టాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోయింది. అధిక తేమ కారణంగా పంట ఎదుగుదల దెబ్బతినడం, వేరుకుళ్లు, తెగుళ్లు పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విత్తిన పంటలు దెబ్బతినడంతో తిరిగి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండోసారి పెట్టుబడి పెట్టిన రైతులకు అదనపు భారం తప్పలేదు.

మురసుకు 3లక్షల ఎకరాలకుపైగా...పంటలకు నష్టం 
అర్నబ్‌ తుపాను నష్టాల నుంచి బయటపడకముందే తాజాగా మురసు తుపాను రైతులను మరింత కుంగదీస్తోంది. వెన్ను, పొట్ట దశల్లో ఉన్న పైర్లలో నీరు నిలిచిపోవడంతో నేలకొరిగిన పనలు పూర్తిగా కుళ్లిపోతున్నాయి. మరోవైపు అధిక వర్షాలకు పత్తి కాయలు కుళ్లిపోవడం, పూత రాలిపోతున్నాయి. మొక్కజొన్నలో నీరు నిలవడం వల్ల వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. పప్పుధాన్యాలు, వేరుశనగ, కూరగాయల పంటలు కూడా అధిక తేమతో దెబ్బతినే అవకాశం ఉంది. అరటి తోటలు ఈదురుగాలులకు నేలకొరిగితే రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. గుంటూరు, బాపట్ల, కృష్టా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పంటలకు అపార నష్టం వాటిల్లింది. 

ఆయా జిల్లాల్లో దాదాపు 129 మండలాల పరిధిలోని 1257 గ్రామాల్లో 1,58,162 మంది రైతులకు చెందిన 3 లక్షల ఎకరాలు పూర్తిగా దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. 2.50 లక్షల ఎకరాలు వరి పంట కాగా, ఆ తర్వాత 30 వేల ఎకరాల్లో పత్తి, 11,540 ఎకరాల్లో మినుము, 2,250 ఎకరాల్లో కందులు, 1,512 ఎకరాల్లో మొక్కజొన్న, వెయ్యి ఎకరాల్లో జూట్, 500 ఎకరాల్లో వేరుశనగ, మరో 500 ఎకరాల్లో పొగాకు, 250 ఎకరాల్లో  జొన్నలతో పాటు ముందస్తు రబీ సీజన్‌ సాగు చేసిన పంటల్లో 1,577 ఎకరాల్లో శనగ పంట కూడా దెబ్బతింది. వాస్తవానికి అర్నబ్‌ తుపాను దెబ్బకు 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, మురసు ప్రభావానికి దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా పంటలు ముంపునకు గురైనట్టు చెబుతున్నారు.

అధికారికంగానే లక్షలాది ఎకరాల్లో పంటలు మునక 
భారీ వర్షాల నుంచి కోలుకోకముందే అర్నబ్‌ తుపాను రైతులపై విరుచుకుపడింది. రాష్ట్రంలో 9.38 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 6.21 లక్షల మంది రైతులపై అర్నబ్‌ తుపాను ప్రభావం పడినట్లు అంచనా వేసింది. అత్యధికంగా 8.60 లక్షల ఎకరాల్లో వరి పంట తుడుచు పెట్టుకుపోయింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలతో పాటు తీరప్రాంతాల్లో ఆక్వా సాగుపైనా తుపాను ప్రభావం పడింది. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పంటల్లో చేరిన ముంపునీరు దిగే పరిస్థితి లేదు. నేలకొరిగిన పంట చేలును ఒబ్బిడి చేసుకునే పరిస్థితి లేకుండానే ‘మురసు’ రూపంలో మరో ప్రకృతి విపత్తు రైతన్నలను ముంచేసింది. 

ఏరియల్‌ సర్వేలు.. సమీక్షలతోనే సరి
వరుస విపత్తుల వేళ రైతులకు సాంత్వన చేకూర్చేలా ఆర్ధిక చేయూతనివ్వాల్సిన వేళ ఏరియల్‌ సర్వేలు, సమీక్షలు, కేంద్రానికి నివేదికలతో సీఎం చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారు. పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం, 100 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ, రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాల మంజూరు ఊసెత్తకపోవడం పట్ల రైతులు మండి పడుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement