ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం
బాలిక ఆరోగ్య పరిస్థితిపై ధర్మాసనం ఆరా
సాక్షి, అమరావతి : అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై విద్యుత్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిగిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. రంపంతో దాడి చేసిన ఘటనపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్‌ను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది సాల్మన్ రాజు వాదనలు వినిపించారు. బాలికపై దాడి చేసిన తరువాత నిందితుడిని పోలీసులు ధర్మవరం పోలీస్ స్టేషన్ వద్ద పట్టుకున్నట్లు మీడియా రిపోర్టుల ద్వారా తెలిసిందని చెప్పారు. అయితే, నిందితుడు ఆత్మకూరు అడవుల్లో తలదాచుకున్నాడని, అతన్ని పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాళ్లపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.
ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్‌తో పాటు వాదనలు వినిపిస్తున్న తనపైనా ఓ వర్గం మీడియా, సోషల్ మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచురిస్తున్నారని వివరించారు. మీడియా ట్రయల్ నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. దాడి ఘటనలో గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసింది. ఈ మొత్తం ఘటనపై పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.


