రాజధానిలో జలమయమైన నీరుకొండ ప్రాంతం
భారీ మోటార్లతో నీటిని తోడాల్సిన దుస్థితి
ఎప్పుడు వాన కురిసినా ఇక్కడ ఇదే పరిస్థితి
రోడ్లు, ప్లాట్లు, నిర్మాణాల్లో భారీగా నిలిచిన నీరు
ప్రపంచస్థాయి రాజధాని జలమయం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు
సాక్షి, అమరావతి: ప్రపంచస్థాయి రాజధాని.. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. అత్యాధునిక రహదారులు.. భారీ భవనాలు.. ఇవీ అమరావతి గురించి పాలకులు చెబుతున్న గొప్పలు. కానీ దీనికి ‘వాటర్ సిటీ’ అని నెటిజన్లు పేరుపెట్టారు. ఎందుకంటే కొద్ది పాటి వర్షం కురిస్తే చాలు.. రాజధాని ప్రాంతమంతా జలమయమవుతోంది. రోడ్లు, ప్లాట్లు, నిర్మాణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. చివరకు మోటార్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని బయటకు తోడాల్సిన పరిస్థితి నెలకొంది.
మురసు తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు అమరావతిలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలను పోస్టు చేస్తూ నెటిజన్లు ‘అమరావతి నది’, అని, ‘అమరావతి వాటర్ సిటీ’ అని వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మిస్తామని చెబుతున్న పాలకులు కనీసం వర్షపు నీటిని కూడా బయటకు పంపలేకపోతున్నారంటూ విమర్శిస్తున్నారు.

పెద్ద తటాకాన్ని తలపిస్తున్న రాజధాని ప్రాంతం

నీట మునిగిన రాజధాని నిర్మాణ సామగ్రి
అమరావతి తట్టుకోగలదా?
అమరావతి ప్రాంతంలో కొండవీటివాగు, పాలవాగు, పేరమ్మవాగు, కోటేళ్లవాగు వంటి నాలుగు ప్రధాన వాగులు ఉన్నాయి. వరదనీటిని మళ్లించేందుకు రిజర్వాయర్లు, డైవర్షన్ ఛానళ్లు, పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వర్షాలు కురిసినప్పుడు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోతోంది. ఉండవల్లి వద్ద పంపింగ్ స్టేషన్ ద్వారా సెకనుకు సుమారు 180 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పెనుమాక రిజర్వాయర్ నుంచి కూడా నీటిని మళ్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని ఏర్పాట్లు ఉన్నా రాజధాని ప్రాంతంలో నీటి నిల్వలు ఎందుకు ఏర్పడుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలను తట్టుకునేలా రాజధాని ప్రాంతంలో వరదనీటి మళ్లింపు వ్యవస్థలు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వాటర్‌మ్యాన్..వాటర్ సిటీ
అమరావతి మొత్తం మునిగిపోవడం కళ్లెదుటే కనిపిస్తున్నా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. రాజధానిలో ప్రమాదకర పరిస్థితులు లేవని వివరణ ఇస్తోంది. కానీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో రోడ్లు, నిర్మాణ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంత మంది చెరువులు, నదులను తలపిస్తున్న ఆ నీటిలో చేపల వేట సాగిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ‘అమరావతి నది’ అంటూ వస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాటర్‌మెన్‌గా చెప్పుకుంటున్న ఆయన వాటర్ సిటీని నిర్మిస్తున్నారంటూ జనం విమర్శిస్తున్నారు.


