- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటించాలి
- పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, వెబ్ క్యాస్టింగ్, అభ్యర్ధులకు భద్రత కల్పించాలి
- పోలింగ్ వేళ వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు ఆపాలి
- మున్సిపల్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాలు భద్రపరచాలి
- రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, వెబ్ క్యాస్టింగ్, అభ్యర్ధులకు, పోలింగ్ కేంద్రాలకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. అలాగే పోలింగ్ వేళ వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు అడ్డుకోవాలని విజ్ఢప్తి చేసింది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాల్ని నిబంధనల ప్రకారం భద్రపరచాలని కూడా కోరింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి వేర్వేరు లేఖలు రాశారు. వీటి కాపీల్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా పంపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అయినా సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్ఈసీని వైఎస్సార్సీపీ అభ్యర్ధించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో, పోలింగ్ ప్రాంగణం లోపల, చుట్టుపక్కల తగిన కవరేజీతో నిరంతర సీసీటీవీ నిఘా లేదా వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కోరింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో, ముఖ్యంగా అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, విశ్వసనీయ విద్యుత్ సరఫరా, బ్యాకప్ రికార్డింగ్ సదుపాయాలతో అంతరాయం లేని ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని తెలిపింది.
పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్, ఓటరుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని, ఎలాంటి బెదిరింపులు లేదా జోక్యం లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి స్వేచ్ఛగా ప్రవేశించేలా చూడాలని కోరింది. రాజకీయ కక్షతో అరెస్టులు, తప్పుడు కేసులు, అనవసరమైన బైండోవర్ చర్యలు, పోలీసుల బెదిరింపులను అరికట్టాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిపక్ష అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోకుండా చూడాలని కోరింది. అలాగే నవంబర్ 1న జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో నిఘా, భద్రతా ఏర్పాట్లలో జరిగిన వైఫల్యాలపై తక్షణ విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను గుర్తించి, తీసుకున్న చర్యలతో కూడిన నివేదిక సమర్పించాలని కోరింది.
ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధాలు అడ్డుకోవాలి
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, పోలీసుల బెదిరింపులను అరికట్టేందుకు తక్షణ జోక్యం చేసుకోవాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీసు యంత్రాంగం దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, అదే అప్రజాస్వామిక విధానాలు ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపింది. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని, వారిపై బైండోవర్ చర్యలు, ఇతర కేసులు నమోదు చేసి లక్ష్యంగా చేసుకుంటున్నారని, వీటిపై స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తే వదిలేస్తామని చెప్పి, ఇంకా నిర్బంధంలోనే ఉంచారన్నారు. కాబట్టి పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్ఈసీని కోరింది.
కడప జిల్లా వేల్పులలో అక్రమాల్ని అడ్డుకోవాలి
అలాగే ఎంపీటీసీ ఎన్నికల వేళ వైఎస్సార్ కడప జిల్లా, వేముల మండలంలోని పోలింగ్ కేంద్రాలు 156, 157లో ఎంపీపీ యూపీ పాఠశాల చుట్టూ రాళ్ల కుప్పలు పోయడం, వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు ఎల్.రామలింగారెడ్డికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని వైఎస్సార్సీపీ కోరింది. అలాగే రామలింగారెడ్డి ఎస్ఈసీకి చేసిన ఫిర్యాదు కాపీని కూడా ఈ లేఖకు జత చేశారు.
వేల్పులలోని ఎంపీపీ యూపీ పాఠశాల చుట్టూ పోగు చేసిన రాళ్లను వెంటనే తొలగించాలని, అలాగే ఆ ప్రాంతాన్ని సమగ్రంగా తనిఖీ చేసి, పంచనామా ద్వారా రికార్డు చేయాలని కోరింది. ఎన్నికలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అరికట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలు, బైండోవర్ చర్యలు చేపట్టాలని విజ్ఢప్తి చేసింది. అలాగే ఈ పోలింగ్ కేంద్రాల్ని అత్యంత సమస్యాత్మకమైనవిగా ప్రకటించి పోలింగ్ రోజు తగిన భద్రత కల్పించాలని కోరింది.
కాకినాడ జిల్లా తొండంగిలో పోలింగ్ కేంద్రాలకు రక్షణ కల్పించాలి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కాకినాడ జిల్లా, తొండంగి మండలంలో పోలింగ్ రోజున అధికార పార్టీకి చెందిన వ్యక్తులు బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి పోలింగ్ కేంద్రాలకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. పోలింగ్ సమయంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుని, రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని, గతంలో జరిగిన సంఘటన నేపథ్యంలో, మండలంలోని ఓటర్లు, తమ పార్టీ అభ్యర్థులు స్వేచ్ఛగా, నిర్బయంగా ఓట్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. తొండంగి మండలంలోని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా ప్రకటించి, తగిన పోలీసు బలగాలు/ప్రత్యేక సాయుధ బలగాలను మోహరించాలని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ లేదా వీడియో రికార్డింగ్, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలని, ఓటర్లు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారిని, ఎస్పీని ఆదేశించాలని ఎస్ఈసీని కోరింది.
మున్సిపల్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాలు భద్రపరచాలి
రాష్ట్రంలో నవంబర్ 1న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, నవంబర్ 3న నిర్వహించిన ఓట్ల లెక్కింపు సమయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తీవ్రమైన ఉల్లంఘనలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ మరోసారి ఎస్ఈసీ దృష్టికి తెచ్చింది. నామినేషన్ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని, ఆ ఫుటేజీని తప్పనిసరిగా భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు తగిన పోలీసు భద్రత కల్పించాలని కూడా ఆదేశాలు ఇచ్చిందని, అయినా తగు చర్యలు తీసుకోలేదని తెలిపింది. కాబట్టి కోర్టుల్లో తాము ఎన్నికల పిటిషన్లు వేసేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రానికి సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలు, వీడియో రికార్డింగ్‌లు, వెబ్‌కాస్టింగ్ రికార్డులను ఒరిజినల్ డిజిటల్ రికార్డులు, బ్యాకప్‌లతో సహా తక్షణమే భద్రపరచాలని కోరింది. ఆధారాలు మార్చకుండా, ధ్వంసం చేయకుండా లేదా తారుమారు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
కర్నూలు 23 వార్డులో రీకౌంటింగ్ నిర్వహించాలి
దీంతో పాటు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 23వ వార్డు ఫలితాల ప్రకటనలో వ్యత్యాసం నేపథ్యంలో ఓట్ల రీకౌంటింగ్, పునఃపరిశీలనకు ఆదేశించాలని ఎస్ఈసీని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లు నమోదు చేసిన బూత్‌ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాల ప్రకారం ఆయనకు 2,329 ఓట్లు వచ్చాయని, టీడీపీ అభ్యర్థి ఎస్.ఆనంద్ బాబుకు 2,270 ఓట్లు, సీపీఎం అభ్యర్థికి 942 ఓట్లు వచ్చాయని, మరో 224 ఓట్లు చెల్లనివిగా పరిగణించారని తెలిపింది. ఈ లెక్కల ప్రకారం తమ అభ్యర్థికి 59 ఓట్ల ఆధిక్యం ఉందని, అయితే, కౌంటింగ్ అధికారులు ఎస్.ఆనంద్ బాబును 35 ఓట్ల మెజారిటీతో విజేతగా ప్రకటించారని తెలిపింది. ఈ ఫలితం నమోదు చేసిన కౌంటింగ్ షీట్లతో సరిపోలడం లేదని, ఓట్ల లెక్కల నమోదు లేదా నివేదిక తయారీలో జరిగిన పొరపాటు వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపింది. కాబట్టి ఇక్కడ రీకౌటింగ్ నిర్వహించాలని కోరింది.


