రాజధానికి రాకపోకలు బంద్‌! | Transport to the capital has been completely disrupted for two days due to floods | Sakshi
Sakshi News home page

రాజధానికి రాకపోకలు బంద్‌!

Nov 5 2026 2:44 AM | Updated on Nov 5 2026 2:44 AM

Transport to the capital has been completely disrupted for two days due to floods

రాజధానిలో కకావికలమైన రహదారి

అమరావతిని చుట్టుముట్టిన కొండవీటి వాగు వరద

వేలాది ఎకరాల్లో పంటలు నీట మునక

పత్తి, మిర్చి, వరి, అపరాల పంటల రైతులకు భారీ నష్టం 

ప్రభుత్వ ముందస్తు చర్యలు లేక లాం వాగుపై వంద గ్రామాలకు నిలిచిన రాకపోకలు

లాం చప్టా వద్ద వంతెన కోసం శిలాఫలకం వేసిన కూటమి ప్రభుత్వం 

కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని నిర్మాణం 

నీరుకొండ రిజర్వాయర్‌లో వరద నీరు ముందుకు కదలని వైనం

తాడికొండ: కొండవీటి వాగుకు వరద పోటెత్తింది.  రాజధాని నగరం అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. రాజధానిని కొండవీటి వాగు, కోటేళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు, పేరమ్మ వాగుల నుంచి వచ్చిన వరద చుట్టుముట్టడంతో రెండు రోజులుగా రాజధానికి రాపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఏపీ రాజధానికి గుంటూరు నుంచి వెళ్లాల్సిన వారు తాడేపల్లి మీదుగా 35 కిలో మీటర్లు అదనంగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కొండవీటి వాగు వరద ఉధృతికి ఈ వాగు పరీవాహకప్రాంతంలోని వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.

వంద గ్రామాలకు నిలిచిన రాకపోకలు
లాం వాగు, పెదపరిమి కోటేళ్ల వాగుపై రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఇటు రాజధాని ప్రాంతం, అటు అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల వైపునకు వెళ్లాల్సిన వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే– లాం చప్టా వద్ద వంతెన నిర్మాణం అంటూ శిలాఫలకం వేసిన కూటమి ప్రభుత్వం ఇంత వరకు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

మూడు రోజులుగా తుఫాన్‌ నేపథ్యంలో తాడికొండ నుంచి పెదపరిమి, తుళ్లూరుకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేస్తున్నందున రాకపోకలు నిషేధించడమైనది అంటూ కంతేరు రోడ్డులోకి యారో మార్క్‌ పెట్టి వదిలేయగా ఆ రోడ్డులో కూడా ఎర్రవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.

నీట మునిగిన పొలాలు
నీరుకొండ, నిడమర్రు, తాడికొండ మధ్య పంట పొలాలు, లాం వద్ద వరద దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు నీట ము­నిగాయి. ప్రధానంగా  పత్తి, మిర్చి, వరి, అపరాల పంటల రైతులకు భారీ నష్టం ఏర్పడింది.  కొండవీటి వాగు సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వ ముందస్తు చర్యలు లేక రైతులకు ఏటా రూ. కోట్లలో పంట నష్టం ఏర్పడుతుంది. ఎగువన కొండవీటి వాగును వెడల్పు చేసి నీటి ప్రవాహం దిగువకు వచ్చేలా చూడాల్సిన ప్రభుత్వం వాగు పూర్తి ప్రక్షాళన గాలికొదిలి రాజధానిలో రిజర్వా­యర్‌ల పేరుతో రూ.వేల కోట్లు వెచ్చించి నీరుకొండ వద్ద 4 టీఎంసీలు, కృష్ణాయపాలెం 2 టీఎంసీలు, వడ్డమాను వద్ద 3 టీఎంసీలు నీటిని నిల్వ చేసేందుకు పనులు కొనసాగిస్తుండటం గమనార్హం. 

మురసు తుపాను భీభత్సం రాజధానిని ముంచుతుందని గ్రహించిన ప్రభుత్వం ఉన్నట్టుండి మంగళవారం అర్ధరాత్రి నీరుకొండ రిజర్వాయర్‌లో వరద ముంపు మళ్లించి చేతులు దులుపుకుంది. అయినప్పటికీ ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ముందుకు కదలక పోవడంతో రైతులు నిండా మునిగారు. రాజధాని పేరుతో రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాజధానికి వచ్చేందుకు కనీసం మంచి రోడ్డును కూడా నిర్మించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement