కాపాడేందుకు వెళ్లి... | 10 SDRF personnel missing in Bethupalli lake | Sakshi
Sakshi News home page

కాపాడేందుకు వెళ్లి...

Nov 5 2026 2:08 AM | Updated on Nov 5 2026 2:08 AM

10 SDRF personnel missing in Bethupalli lake

చెరువు వద్ద వేచి ఉన్న స్థానికులు

బేతుపల్లి చెరువులో గల్లంతయిన 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, మత్స్యకారుడు  

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌.. నలుగురి గుర్తింపు 

మరో ఆరుగురి సిబ్బంది ఆచూకీపై ఉత్కంఠ

సత్తుపల్లి: మత్స్యకారులు వరదలో చిక్కుకోగా, రక్షించేందుకు రంగంలోకి వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోటు తిరగపడడంతో గల్లంతయ్యారు. వెంటనే ఖమ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర పర్యవేక్షణలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు మొదలుపెట్టారు. అయితే, బుధవారం రాత్రి నలుగురి సిబ్బంది ఆచూకీ గుర్తించారు. ఆతర్వాత మత్స్యకారులందరినీ ఒడ్డుకు చేర్చారు. మరో ఆరుగురి సిబ్బంది జాడ తెలియలేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు వరద చేరుతుండడంతో చేపలు కొట్టుకుపోకుండా వలలు కట్టేందుకు 8 మంది మత్స్యకారులు బుధవారం ఉదయం వెళ్లారు. వారు చెరువులోకి వెళ్లాక వరద మరింత పెరిగి అందులో చిక్కుకుపోయారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వెలుగుచూసింది.  

అటు నుంచి ఇటు 
భద్రాద్రి జిల్లా దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో పలువురు వరదలో చిక్కుకోగా చాతకొండ బెటాలియన్‌ నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెళ్లి రక్షించారు. అంతలోనే బేతుపల్లి చెరువులో మత్స్యకారులు చిక్కుకున్నారనే సమాచారం ఈ సిబ్బందికి హుటాహుటిన వారు ఇక్కడకు చేరుకున్నారు. ముందుగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లలో వెళ్లి రామనగరానికి చెందిన మత్స్యకారుడు బొందల రమేశ్, కాకర్లపల్లికి చెందిన మరో ఇద్దరు మత్స్యకారులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. 

ఆ తర్వాత మరో ఐదుగురి కోసం రెండు బోట్లలో సిబ్బంది, వారికి దారి చూపేందుకు రామానగరానికి చెందిన మత్స్యకారుడు బొమ్మకంటి రాజు బయలుదేరారు. దమ్మపేట మండలం నుంచి వరద బేతుపల్లికి చెరువు పోటెత్తి ప్రవాహం అంతకంతకూ పెరిగింది. ఈ క్రమంలోనే చెరువు నుంచి తమ్మిలేరు వాగుకు వెళ్లే వరద ఉధృతి కూడా పెరిగింది. దీంతో చెరువు అలుగు వద్ద బోట్లు తిరగబడ్డాయి. దీంతో వారు అలుగులో నుంచి తమ్మిలేరు వాగులో కొట్టుకుపోయారు.  

ఖమ్మం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించి.... 
బేతుపల్లి చెరువు వద్దకు చేరుకున్న కలెక్టర్‌ దివాకర, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఖమ్మంలో ఉన్న విజయవాడకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించారు. సిబ్బంది బోట్లలో బేతుపల్లి చెరువులోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి వరద మధ్యలో చెట్టును ఆధారంగా చేసుకొని ఉన్న నలుగురు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని గుర్తించారు. ఇదే సమయంలో మత్స్యకారుల వద్దకు సైతం చేరుకొని వారిని తీసుకొని ఒడ్డుకు వచ్చారు. గుర్తించిన నలుగురు సిబ్బందిని కూడా ఒడ్డుకు తీసుకురావాల్సి ఉండగా, మరో ఆరుగురు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది జాడ తెలియలేదు. దీంతో తిరిగి గాలింపు చర్యలు ప్రారంభించారు. 

ఎప్పటికప్పుడు సమీక్షించిన మంత్రి పొంగులేటి  
ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బోట్లు గల్లంతయిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆరా తీశారని, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఘటనపై మంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం
» అశ్వారావుపేటలో 27.7 సెం.మీ., పెనుబల్లిలో 22 సెం.మీ. వర్షం 
» పలుచోట్ల చెరువులకు గండి, రహదారులపై పోటెత్తిన వరద 
» పత్తి, వరి ఇతర పంటలకు తీరని నష్టం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను ‘మురసు’తుపాను ముట్టడించింది. మంగళవారం ఉదయం మొదలైన వర్షం రాత్రికి జోరందుకుంది. వర్ష ప్రభావం బుధవారం కూడా కొనసాగింది. భదాద్రి జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 27.6 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 22.5 సెం.మీ. సత్తుపల్లిలో 21.8, వేంసూరులో 21.2, కల్లూరులో 21 సెం.మీ., భద్రాద్రి జిల్లా మల్కారంలో 18.8 సెం.మీ, అంకంపాలెంలో 17.5 సెం.మీల వర్షపాతం నమోదైనట్టు అధికారులు నివేదిక విడుదల చేశారు. ఈ వర్షం ధాటికి రిజర్వాయర్లు, చెరువుల్లోకి భారీగా వరద చేరింది. దీంతో పలుచోట్ల చెరువుల కట్టలు తెగి రహదారులు, నివాసాల్లో వరద పోటెత్తింది. ఈ కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

పంట చేలలోకి నీరు.. 
భారీ వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పత్తి, వరి పంటలన్నీ నీట మునిగాయి. చేతికి వచ్చే దశలో వరి చేలన్నీ నేలవాలాయి. పత్తి చేలల్లో నీరు చేరగా, తీతకు సిద్ధంగా ఉన్న పత్తికి నీరు చేరింది.  

వరదలో చిక్కుకున్న జనం 
భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని మల్లెపూల వాగు ఉప్పొంగడంతో పొలం పనులకు వెళ్లిన 11మంది రెండు చోట్ల చిక్కుకున్నారు. దురదపాడు గ్రామానికి చెందిన వీరప్రోలు నాగమణి గ్రామ శివారు పొలంలో పనిచేస్తుండగా వరద పోటెత్తడంతో గట్టుపై ఉన్న ఓ చెట్టును ఆశ్రయించింది. గ్రామస్తులు విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్డీఆర్‌ఎఫ్‌ ‡బృందం బోటు ద్వారా వెళ్లి ఆమెను సురక్షితంగా తీసుకువచ్చింది. 

తొట్టిపంపు గ్రామ శివారు గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంలో వ్యవసాయ పనుల కోసం వచి్చన అదే గ్రామానికి చెందిన పది మంది చిక్కుకుపోయారు. అక్కడకు కూడా ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బోట్ల సాయంతో వెళ్లి సురక్షితంగా బయటకు తరలించారు. 

ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన మిర్యాల మధు, మరో ఇద్దరు రైతులతో కలిసి పొలంలో మోటార్‌ తీసి వస్తుండగా, మధు వెనక్కి వెళ్లాడు. అదే సమయంలో వాగు పోటెత్తడంతో చెట్టు ఎక్కి సాయం కోసం అభ్యర్థించాడు. సహచర రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై మ«ధుప్రసాద్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో చేరుకుని డ్రోన్‌ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం మధును క్షేమంగా వాగు దాటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

చెరువులకు గండ్లు
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి శివారులోని పెద్దవాగు ప్రాజెక్టులో తాత్కాలికంగా నిర్మించిన రింగ్‌బండ్‌కు భారీగా వరద చేరడంతో గండ్లు పడి తెగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి వరదను గోదావరిలోకి విడుదల చేశారు. అయినా ఎగువ ప్రాంతాల నుంచి వరద ముంచెత్తడంతో రింగ్‌బండ్‌ పూర్తిగా నిండి కట్టపై నుంచి వరద ప్రవహించింది. మండలంలో భారీ వర్షంతో పలు చెరువులకు గండ్లు పడి పొలాలు, గ్రామాల్లోకి వరద చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement