నగర రోడ్లపై ఈవీ క్యాబ్‌లు | Seven seater electric cars running on Telangana roads | Sakshi
Sakshi News home page

నగర రోడ్లపై ఈవీ క్యాబ్‌లు

Nov 5 2026 2:00 AM | Updated on Nov 5 2026 2:00 AM

Seven seater electric cars running on Telangana roads

రంగంలోకి వియత్నాం కంపెనీ 

పరుగులు తీస్తున్న సెవెన్‌ సీటర్‌ ఎలక్ట్రిక్‌ కార్లు 

ఇప్పటికే వెయ్యి కార్లు దిగుమతి..త్వరలో మరో 2 వేలు!

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోకి మరో అంతర్జాతీయ యాప్‌ ఆధారిత క్యాబ్‌ సర్వీస్‌ ప్రవేశించింది. వియత్నాంకు చెందిన గ్రీన్‌ ఎస్‌ఎమ్‌ (గ్రీన్‌ అండ్‌ స్మార్ట్‌ మొబిలిటీ) తన సేవలు ప్రారంభించింది. ఇప్పటికే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ సంస్థ, దేశంలో తమ రెండో వ్యాపార నగరంగా 1.40 కోట్ల జనాభాతో కిటకిటలాడుతున్న భాగ్యనగరాన్ని ఎంచుకుంది. త్వరలో మరిన్ని నగరాల్లో సేవలు విస్తరించే ప్రయత్నంలో ఉంది. 

దేశంలో సరికొత్త ’రైడ్‌ హైరింగ్‌’విధానానికి తెరలేపిన ఈ క్యాబ్‌ కంపెనీ వినూత్న పద్ధతులతో వేగంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. గ్రీన్‌ ఎస్‌ఎమ్‌ అనేది వియత్నాం దేశానికి చెందిన 100% పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కంపెనీ. ఆ దేశానికి చెందిన ప్రముఖ బిలియనీర్, విన్‌ఫాస్ట్‌ ఈవీ సంస్థ వ్యవస్థాపకుడు ఫామ్‌ నాట్‌ వూంగ్‌ 2023లో ఈ రవాణా సంస్థను ప్రారంభించారు.  

సొంత కార్లు..నెలవారీ వేతనంతో డ్రైవర్లు 
సాధారణంగా మనకు అందుబాటులో ఉన్న క్యాబ్‌ అగ్రిగేటర్లు కేవలం డ్రైవర్లను మాత్రమే ఎంగేజ్‌ చేసుకోరు. కారుతో పాటు డ్రైవర్‌ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న క్యాబ్‌ సంస్థలన్నీ డ్రైవర్లకు కమీషన్‌ అందిస్తున్నాయి. రైడ్‌ చార్జీలో 30 శాతం వరకు తను తీసుకుని మిగతా మొ­త్తాన్ని డ్రైవర్లకు అందిస్తున్నాయి. కానీ ఈ సంస్థ దీనికి విరుద్ధంగా తానే కారును సమకూరుస్తూ, డ్రైవర్లను మాత్రమే ఎంగేజ్‌ చేసుకుంటోంది. కమీషన్‌ కాకుండా నెలవారీ జీతాన్ని అందిస్తోంది. జీతం, రైడ్‌ రేటింగ్స్, డ్యూటీ అవర్స్‌ ఆధారంగా ఇన్సెంటివ్‌లు కలిపి నెలకు దాదాపు రూ.60 వేలు లభిస్తాయని సంస్థ పేర్కొంటోంది. 

బీమా సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. ‘విన్‌ఫాస్ట్‌’కంపెనీ తాము సొంతంగా తయారు చేసిన ఎలక్ట్రిక్‌ కార్లనే వినియోగిస్తోంది. మనకు సాధారణంగా కనిపించే క్యాబ్‌లలో 90 శాతం నాలుగు సీట్ల కార్లే, కాగా ఈ సంస్థ వాడే ఈవీలన్నీ మూడు వరుసలతో ఏడు సీట్లుండే కార్లు కావడం గమనార్హం. కాగా ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 517 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని సమాచారం. ఈ కార్లన్నిటినీ ఒకే లుక్కుతో ఆకర్షణీయంగా ఉండేలా సియాన్‌ రంగులో తీర్చిదిద్దింది. రణగొణ ధ్వనుల మధ్య నిశ్శబ్ద ప్రయాణాన్ని ప్రయాణికులు ఆస్వాదిస్తారన్న వ్యాపార చిట్కాతో ఈవీలను రంగంలోకి దింపింది.  

సర్జ్‌ ప్రైసింగ్‌ ఉండదట.. 
వాన కురిసినా, ట్రాఫిక్‌ పెరిగినా, పండగొచి్చనా ప్రస్తుత క్యాబ్‌ సర్వీసులు డైనమిక్‌ ఫేర్‌ పద్ధతిలో చార్జీలను ఇష్టమున్నట్టు పెంచుతున్నాయి. ఈ సర్జ్‌ ప్రైసింగ్‌కు విరుద్ధంగా అన్ని సమయాల్లో కి.మీ.కు రూ.8 చొప్పున చార్జీని వసూలు చేయనున్నట్టు ఆ సంస్థ అంటోంది. అయితే ఇది ప్రారంభంలో ప్రయాణికులను ఆకట్టుకునే అంశమా, లేక భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.  

వ్యతిరేకిస్తున్న ఇతర క్యాబ్‌ డ్రైవర్లు 
ఆ సంస్థ ప్రస్తుతం డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కార్లు నగరానికి వచ్చాయని, త్వరలో మరో 2 వేల కార్లు వస్తాయని సమాచారం. డ్రైవర్ల నియామకం పెరిగేకొద్దీ కార్లను సమకూర్చే ప్రయత్నంలో ఉంది. అయితే కొత్తగా వస్తున్న ఈ వియత్నాం కార్ల వైపు ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశం ఉందని, ఇది తమ ఉపాధికి గండి కొడుతుందని నగరంలో ఇప్పటికే ఉన్న ప్రధాన క్యాబ్‌ సర్వీసుల డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ సంస్థ నిర్వహించే రిక్రూట్‌మెంట్‌ కేంద్రం వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇవన్నీ పెద్ద సెవెన్‌ సీటర్‌ వాహనాలు కావడం, పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తే.. రద్దీ నగరంలో ఎదురయ్యే ట్రాఫిక్‌ చిక్కులపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. 

‘ఆ సంస్థను నిషేధించాలి’ 
‘వియత్నాం క్యాబ్‌ సర్వీస్‌ సంస్థను రవాణా శాఖ నిషేధించాలి. ఆ సంస్థ చెబుతున్న నెలవారీ రూ.60 వేల జీతం, బీమా వసతి లాంటి ప్రకటనలకు మోసపోకుండా, లిఖితపూర్వక ఒప్పంద పత్రంలోని అంశాలను ఆ సంస్థలో చేరే డ్రైవర్లు జా­గ్రత్తగా సరిచూసుకోవాలి’అని తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫా­మ్‌వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement