సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాం
రాష్ట్రంలో గొల్ల కులస్తులకు సముచిత స్థానం
సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సదర్ సమ్మేళనం యాదవులకే కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మగౌరవ ప్రతీక అని..ఇది అద్భుతమైన కార్యక్రమమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో తాము కులగణన చేసి చూపించామని, తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా కులగణన నిర్వహించామన్నారు.
మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవస రం ఉందని, ఇందుకు యాదవుల సహకారం ఉండాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి గోల్కొండ కోట ఒకనాటి గొల్లకొండ అని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. యాదవుల సహకారంతోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలన్న ఆలోచన చేయలేదని, గొల్ల కులస్తులు కోరగానే రాష్ట్ర పండుగగా ప్రకటించామని, సదర్ సమ్మేళనం నిర్వహణకు రూ.5 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. తమ ప్రభుత్వంలో గొల్ల కులస్తులకు సముచిత స్థానం కల్పించామని రేవంత్‌రెడ్డి అన్నారు.
అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని, ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించామని వివరించారు. యాదగిరిగుట్ట గోశాలలో గోసంరక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో యాదవుల వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. బిహార్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి, నేరగాళ్ల రాజ్యంగా మారిందని ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విమర్శించారు. నగరంలో తమకు లభించిన అపూర్వ స్వాగతం మనసుకు తాకాయని, ఇంకా చారిత్రక సంప్రదాయం కొనసాగడం ఎంతో ప్రశంసనీయమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అందరివాడని, అన్ని కులాలను అధ్యయనం చేసి, అందరికీ అన్ని రంగాల్లో లబ్ధి చేకూర్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆయన రేవంత్‌రెడ్డి కాదని, రేవంత్ యాదవ్ అని, సందర్భాన్ని బట్టి రేవంత్ యాదవ్, ముదిరాజ్, గౌడ్ అని అన్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, కె. రఘువీర్ రెడ్డి, అఖిలేష్ యాదవ్ సోదరుడు, మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, మాపీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


