సాక్షి,హైదరాబాద్ : మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రవళికను బస్సు నుంచి తోసిన మహిళ ఈమెనే’నంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ప్రవళికను తాను తోసేయలేదని.. తనే పడిపోయింది” అంటూ ఓ మహిళ చెబుతోంది. తనకు, ప్రవళికకు మధ్య వాగ్వాదం జరిగిన మాట వాస్తవమేనని, అయితే తాను ఆమెను తోసేయలేదని, బస్సు మెట్లపై నుంచి ప్రవళిక తనంతట తానే పడిపోయిందని వాదిస్తోంది. అయితే ఈ ఘటనలో అసలు ఏం జరిగింది..? ప్రవళిక బస్సు నుంచి కిందపడటానికి కారణమేంటి..? మహిళ చెబుతున్న వాదనలో నిజానిజాలేంటి..? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రవళిక మృతి కేసులో వీడియోలోని మహిళ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
అసలేం జరిగిందంటే?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ప్రవళికకు గతనెల 25న చిల్లర విషయంలో మిట్టగూడెం వద్ద ఓ ప్రయాణికురాలితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రయాణికురాలు ఆమెను తోసేయడంతో ప్రవళిక బస్సు నుంచి కిందపడిపోయారు. బస్సు వెనుక టైర్లు ఆమె కుడికాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన ఆమెను హైదరాబాద్‌లోని కొత్తపేట సాయి సంజీవిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దాదాపు పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రవళిక.. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, మణుగూరు డిపో సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన గుండ్ల ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రవళిక తల్లికి ఉద్యోగం.. కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ట్వీట్ చేశారు.


