ఓటెత్తకుండా మళ్లీ దండెత్తిన పోలీస్‌ | Police duties aimed at stopping the opposition in the council elections | Sakshi
Sakshi News home page

ఓటెత్తకుండా మళ్లీ దండెత్తిన పోలీస్‌

Nov 5 2026 3:19 AM | Updated on Nov 5 2026 3:19 AM

Police duties aimed at stopping the opposition in the council elections

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ పేట్రేగిన ఖాకీలు

ప్రజాస్వామ్య పరిరక్షణకు బదులు ప్రతిపక్షాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా విధులు

నేడు పోలింగ్‌ వేళ వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టులు, బెదిరింపులు, నిర్బంధాలు 

పచ్చ మూకల బూత్‌ క్యాప్చర్, రిగ్గింగ్‌కు పూర్తి సహకారం 

వేధింపులు తాళలేక పోటీ నుంచి తప్పుకుంటున్నానన్న మైదుకూరు జెడ్పీటీసీ అభ్యర్థి.. పోటీలో ఉంటే చంపేస్తామంటూ జేసీ వర్గీయుల బెదిరింపులు 

రాళ్లు, కర్రలు, మారణాయుధాలు పోగేసుకున్న టీడీపీ గూండాలు 

అన్నీ తెలిసినా గుడ్లప్పగించి చూస్తున్న రక్షకభటులు.. ప్రతిపక్షంపై మాత్రం ఉక్కుపాదం

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: మున్సిపల్‌ ఎన్ని­­కల మాదిరిగానే పరిషత్‌ ఎన్నికల్లోనూ ముఖ్య­మంత్రి కార్యాలయం(సీఎంవో) ఆదేశాలతో కొందరు పోలీసులు పేట్రేగిపోతున్నారు. ప్రజలు స్వే­చ్ఛ­గా ఓటెయ్యకుండా మళ్లీ ఉక్కుపా­దం మోపుతున్నా­రు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వే­చ్ఛగా జరిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సి­న పోలీసులే వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ప్రతిపక్ష వైస్సార్‌సీపీ శ్రేణులను కట్టడి చేసే చర్యలకు దిగారు. గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతల గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, బెదిరింపులు, నిర్బంధాలను పోలీసులు తీవ్రతరం చేశారు. నామినేషన్ల ముందు నుంచే బైండోవర్లు, నామినేషన్లు అడ్డుకోవడం, ప్రచారం నిలిపి వేయడం, బలవంతపు ఉపసంహరణల వరకు పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పదే పదే విజ్ఞప్తి చేసినా అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ), ఇటు పోలీస్‌ వ్యవస్థ ‘పచ్చ’పాత ధోరణిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అదనపు భద్రత, కేంద్ర బలగాలు, వెబ్‌ కాస్టింగ్, సీసీ టీవీ నిఘా కల్పించాలని వైఎస్సార్‌సీపీ ప్రత్యేకంగా కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీకి పోటీ చేసే అవకాశం లేకుండా చేసి, ఓటు వేయకుండా ప్రజలను అడ్డుకుని అధికార పక్షమే అంతా సెలక్షన్‌.. ఎలక్షన్‌ చేసుకునేలా పోలీస్‌ యంత్రాంగం సహకరిస్తోందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. అయినా పోలీసుల తీరు షరా మామూలే.

                   అక్రమ అరెస్టులపై సీఐ శాంతిలాల్‌తో చర్చిస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి   

మున్సి‘పోల్స్‌’ మాదిరిగానే ఇప్పుడూ పన్నాగం 
తొలుత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే పరిషత్‌ ఎన్నికల్లోనూ పోలీస్‌ మార్కు పచ్చపాతం పెచ్చుమీరింది. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో కూడా ప్రతిపక్ష అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్న పోలీసులు.. ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు, నాయకులకు అడ్డంకులు కల్పించేందుకు రంగంలోకి దిగారు. ఎన్నికలు సజావుగా నిర్వహించే పేరుతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్‌ బందోబస్తును ప్రతిపక్ష పార్టీపై నిర్బంధానికి ఉపయోగిస్తున్నారు.  

డీఐజీ కోయ ప్రవీణ్‌ ఆదేశాలతో అక్రమ అరెస్టులు 
పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ పచ్చ పార్టీ సేవకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను బుధవారం నుంచి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బైండోవర్‌ కేసులు, ఇతర అక్రమ కేసులు పెడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను అడ్డుకుని, పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌ చేసుకునేలా పచ్చ గూండాలకు పోలీసులే ముందుండి మార్గాన్ని సుగమం చేస్తున్నారని స్పష్టమవుతోంది.  

గురజాల మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్టు 
పల్నాడు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ముందు నుంచే పేట్రేగిపోతున్న పోలీసులు పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డిని బుధవారం నరసరావుపేటలో హౌస్‌ అరెస్టు చేశారు. గురువారం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గురజాల వెళ్లకూడదని నిర్బంధించారు. కీలక ఎన్నికల వేళ పోలీసులు ఇలా ఏకపక్షంగా అడ్డుకోవడం సరికాదని మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే అనుమతించేది లేదని, ఎన్నికలు ముగిసే వరకు గృహ నిర్బంధంలోనే ఉంచుతామని పోలీసులు మొండికేశారు. గురజాలలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లును సైతం పోలీసులు అక్రమ అరెస్టు చేశారు.  

                   నరసరావుపేటలో కాసు మహేష్‌రెడ్డిని నిలువరిస్తున్న పోలీసులు   

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు రాకూడదని హెచ్చరిక 
కర్నూలు జిల్లాలో పలు చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై పోలీసులే బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లు ఎవరూ పోలింగ్‌ కేంద్రాల్లో కూర్చోవద్దంటూ హుకుం జారీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లుగా కూర్చుంటే పీడీ యాక్ట్‌ పెడతామని బెదిరింపులకు దిగారు.   గురువారం ఉదయం పోలింగ్‌ సమయానికి పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రావాలని ఆంక్షలు విధించారు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో పోలీసుల బెదిరింపులపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. క్రిష్ణగిరి జెడ్పీటీసీ బరిలో టీడీపీ గుర్తు కూడా లేనప్పటికీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోలీసులు పని చేయడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు.  

వైఎస్సార్‌ జిల్లాలో రిగ్గింగ్‌కు సిద్ధం 
మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అరాచకాలకు అ«ధికార టీడీపీ తెరలేపింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ జిల్లాలో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పచ్చమూకలు సిద్ధమయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలో లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు వెన్నుపోటు పార్టీ నేతలు పక్కా పథకం వేశారు. వేముల మండలంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, ఏజెంట్లపై దాడులకు పాల్పడేందుకు రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారు. ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకునేందుకు కిరాయి మూకలను రప్పించి సిద్ధం చేశారు. 

                      పులివెందులలో దాడికి టీడీపీ రౌడీలు సిద్ధంచేసిన రాళ్లు

కాగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా బండారులంకలో ఓటర్‌ స్లిప్పుల పంపిణీపై రభస జరిగింది. అధికారులు పంపిణీ చేయాల్సిన ఓటర్‌ స్లిప్పులను టీడీపీ కార్యకర్తలు పంపిణీ చేయడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పంచాయతీ కార్యదర్శి సమర్థించుకోవడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల అధికారి(ఆర్వో)కి ఫిర్యాదు చేశారు. దువ్వూరు మండలం చల్లబసాయపల్లె ఎంపీటీసీ ఎన్నిక నేపథ్యంలో పుల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డితోపాటు ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, పోతులూరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లింగాల మండలం కోమన్నూతల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులను రూరల్‌ సీఐ శాంతిలాల్‌ అదుపులోకి తీసుకోవడంతో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి లింగాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పోటీ నుంచి తప్పుకోకపోతే ప్రాణాలు దక్కవు.. 
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలు పెచ్చుమీరాయి. మునిసిపల్‌ ఎన్నికల్లో గూండాగిరి ప్రదర్శించిన ఆయన.. ఇప్పుడు పరిషత్‌ ఎన్నికల సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో అదే రీతిలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నేరుగా బెదిరిస్తున్నారు. గ్రామాల్లో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి విధ్వంసాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఊరూరా తిరుగుతూ.. ‘పోటీ నుంచి తప్పుకోకపోతే ప్రాణాలు దక్కవు.. పోటీలో ఉంటారా? ప్రాణాలతో ఉంటారా?’అంటూ బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలింగ్‌ రోజున ఓటర్లు బయటకు రాకూడదని, తామే వేసుకుంటామని జేసీ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. తమ మాట వినకపోతే పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  

                         పోలీసుల బెదిరింపులపై సీఐతో మాట్లాడుత్ను కంగాటి శ్రీదేవి  

రైల్వేకోడూరు నియోజకవర్గంలో 105 మందికి నోటీసులు 
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పోలీసులు వైఎస్సార్‌సీపీ ప్రధాన నాయకులే లక్ష్యంగా నోటీసులు జారీచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం వైఎస్సార్‌సీపీ నేతలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏమిటని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైల్వేకోడూరులో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు, మాజీ వైస్‌ ఎంపీపీ రామిరెడ్డి రాజారెడ్డికి, పట్టణ కన్వినర్‌ సీహెచ్‌ రమేష్‌ సహా మొత్తం 40 మందికి నోటీసులు జారీచేశారు. పెనగలూరు మండలంలో రాష్ట్ర మాజీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి సోదరులకు, ఇతరులకు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చారు. పుల్లంపేట మండలంలో మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్‌ రెడ్డి వర్గీయులు10 మందికి, ఓబులవారిపల్లి మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు వత్తలూరు సాయికిషోర్‌ రెడ్డి, మరో 30 మందికి నోటీసులు జారీ చేశారు. చిట్వేలి మండలంలో పది మందికి నోటీసులు ఇచ్చారు.  

వ్యవస్థలు సహకరించక పోటీ నుంచి విరమణ  
నామినేషన్‌ వేసినప్పుటి నుంచి  వేధింపులు, బెదిరింపులు ఎక్కువైనందున తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వైఎస్సార్‌సీపీ మైదుకూరు జెడ్పీటీసీ అభ్యర్థి నేట్లపల్లె శివరాం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పార్టీ ఆదేశాలతో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన తాను ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎంతో ఆశపడ్డానని తెలిపారు. అయితే వ్యవస్థలు సహకరించడం లేదని, అధికార పార్టీ.. పోలీసులు కలిసి అప్రజాస్వామ్య పద్ధతిలో గురువారం పోలింగ్‌ జరుపుకునేందుకు సిద్ధమైందన్నారు. అధికారులు, వ్యవస్థలు సహకరించని ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని తెలిపారు. 

అన్ని చోట్లా అరాచకాలు 
» తిరుపతి జిల్లా పెళ్లకూరు మిట్ట ప్రాంతంలో గురువారం జరగనున్న ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి 35వ పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏజెంట్‌ వెంకయ్య ఏజెంట్‌ ఫారాలు రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చేందుకు బుధవారం రాత్రి వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్త కార్తిక్‌ ఆ ఫారాలు లాక్కొని చించివేశాడు. 

» నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేశారు. బుధవారం ఉదయం పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గుజ్జుల స్వాములు, అమీర్‌బాషా, బెస్త కురుమన్న, అలీబాషా, నబిసాహెబ్, రామకృష్ణలను స్టేషన్‌కు పిలుచుకెళ్లారు. సాయంత్రం లక్ష్మాపురానికి చెందిన పలువురిని బైండోవర్‌ చేశారు.    

» కర్నూలు జిల్లా కృష్ణగిరి జెడ్పీటీసీకి సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాధవరావుతోపాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక స్వతంత్య్ర అభ్యర్థి మర్రి శ్రీరాములును గెలిపించేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలను వేధిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాల నుంచి దాదాపు 40 మందికిపైగా వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు పిలిపించారు. పోలింగ్‌ రోజు ఉదయమే స్టేషన్‌కు రాకపోతే కేసులు నమోదు చేస్తామని వెల్దుర్తి సీఐ యుగంధర్‌ హెచ్చరించారు.  

» అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో గురువారం వైఎస్సార్‌సీపీ నేతలెవ్వరూ కనిపించకూడదని సీఐ సాయి ప్రసాద్‌ హుకుం జారీ చేశారు. సీఐ బెదిరింపులపై వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు లేవు.    

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి కుమారుడిపై కత్తులతో దాడి
ఆళ్లగడ్డ/పట్నంబజారు: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ పచ్చ రౌడీలు మరోసారి బీభత్సం సృష్టించారు. పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన షరీఫా బి కుమారుడు, పార్టీ నేత సాధిక్‌పై హత్యాయత్నం చేశారు. పట్టణానికి చెందిన ఏఎన్‌ఆర్‌ చికెన్‌ సెంటర్‌ నిర్వాహుకుడు హుస్సేన్‌బాషా భార్య షరిఫా బి ఆళ్లగడ్డ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీలో నిలబడ్డారు. 

ఇది మనుసులో పెట్టుకున్న టీడీపీ నాయకులు ఎలాగైనా ఆమె కుమారుడిని మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. కత్తులతో దాడి చేశారు. సాధిక్‌ను చికిత్స కోసం నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. అలాగే, గుంటూరు నగరంలోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నగర అధ్యక్షుడు పల్లపు మహేష్, అతని సోదరి ప్రసన్నలక్ష్మి కార్పొరేటర్లుగా పోటీ చేయడం గిట్టని టీడీపీ వాళ్లు బుధవారం మహేష్ పై విచక్షణరహితంగా రాడ్లతో దాడి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement