582 జెడ్పీటీసీ,7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
పోటీలో మొత్తం 20,966 మంది అభ్యర్థులు
2.61 కోట్ల మంది ఓటర్లు.. 31,460 పోలింగ్ కేంద్రాలు
పోలింగ్‌కు వర్షం బెడద!
ఎన్నికల సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయని అధికారులు.. ఆందోళనకు దిగిన ఉద్యోగులు
సాక్షి, అమరావతి/ఎమ్మిగనూరు టౌన్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని.. కొన్ని ప్రాంతాలు మినహా పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది.
కలెక్టర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వర్షాల కారణంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగపురం మండలాల్లో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్లు బుధవారం ఉదయం ప్రకటించినా.. గంటన్నర అనంతరం తిరిగి అక్కడ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలు
ఏకగ్రీవాల అనంతరం 28 జిల్లాల పరిధిలో 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్‌ఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, 77 మండలాల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మిగిలిన 582 మండలాల్లో 2,169 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
9,821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మూడుచోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఆయా ఎంపీటీసీ స్థానాల్లో 18,843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కలిపి మొత్తం 20,966 మంది పోటీ పడుతున్నారు. మొత్తంగా 31,460 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయగా.. 2,61,52,377 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.
16,064 సమస్యాత్మక ప్రాంతాలు.. 15,396 చోట్లే సీసీ కెమెరాలు
మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలకు గాను 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 16,064 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 15,396 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఈసీ పేర్కొంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన వాటిలోనూ 668 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా వీడియోగ్రఫీకి పరిమితం చేశారు. మరోవైపు సాధారణ పోలింగ్ కేంద్రాలుగా పేర్కొన్న చోట్ల 6 వేలచోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, మరో 6,507 చోట్ల వీడియోగ్రఫీ, 2,889 చోట్ల ఇతర ఏర్పాట్లు చేసినట్టు వివరించింది. ఎన్నికల నిర్వహణలో 49,121 పోలింగ్ సిబ్బంది, బందోబస్తు కోసం 40,769 మంది పోలీసులు పాల్గొంటారని తెలిపింది.


