కోనసీమ జిల్లా వానపల్లిపాలెంలో విద్యుత్ సదుపాయం లేక అంధకారంలోనే విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు
వెన్నుపోటు పార్టీ కుతంత్రాలకు కలిసొచ్చిన ‘మురసు’ తుపాను ..
వరుస తుపానులతో సగం రాష్ట్రం అతలాకుతలం
ప్రజల కష్టాలు కళ్లారా చూస్తూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌కు ఎస్‌ఈసీ పచ్చజెండా
చాలా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి
విపత్తు వేళ రిగ్గింగ్‌కు దారులు మరింత సుగమం చేసుకుంటున్న టీడీపీ కూటమి
సాక్షి, అమరావతి: ఊళ్లో జనం లేని సమయం చూసి, ఇళ్లకు తాళాలు వేసినప్పుడు కాపుకాచి.. దొంగల ముఠాలు పంజా విసిరి ప్రజల విలువైన సంపదను కొల్లగొట్టుకు పోవడం చూస్తుంటాం. అచ్చం అదే రీతిలో ‘మురసు’ తుపాను బీభత్సంతో ఓటర్లు వరద ముంపులో చిక్కుకుని, కనీసం ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టలేని నిస్సహాయ స్థితిని పచ్చ పార్టీ ముఠాలు ఆసరాగా చేసుకుని కుటిల రాజకీయం చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ సందర్భంగా తుపాన్ విరుచుకు పడుతున్న వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని, ఆలస్యంగా వచ్చే వారి ఓటు హక్కును హైజాక్ చేయడానికి దొంగల ముఠా పక్కా స్కెచ్ వేసింది.
ఇందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)ను మరోమారు పావుగా వాడుకుంది. భారీ వర్షాలకు ఊళ్లకు ఊళ్లు జలమయమైన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని భావించిన ఎస్‌ఈసీని సైతం వెనక్కు తగ్గేలా ఒత్తిడి తెచ్చింది. యధావిధిగా ఎన్నికలు జరుగుతాయని ఎస్‌ఈసీ ప్రకటించడం వెనుక ఉన్న వ్యూహం ఇదేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు, పచ్చ పార్టీ గూండాలు జట్టు కట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌లను అడ్డుకోవడం, వేసిన నామినేషన్‌లను విత్‌డ్రా చేయించడం ద్వారా పలు చోట్ల బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు.
మున్సిపల్ పోలింగ్ సందర్భంగా వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు సహా అనేక జిల్లాల్లో పోలీసులు, పచ్చ పార్టీ గూండాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకుని యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌లోనూ రిగ్గింగ్‌కు పాల్పడేందుకు వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వరదలు, వర్షాల దెబ్బకు ఓటర్లు సైతం ఇళ్ల నుంచి బయటకు రాకుంటే బూత్‌లను ఆక్రమించి ఏకపక్షంగా ఓట్లన్నీ గుద్దేసుకోవచ్చనే పన్నాగానికి తెరలేపారు. ఇందుకు ఎస్‌ఈసీ సైతం పచ్చజెండా ఊపడంపై ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించే వీల్లేకుండా ఏరియల్ సర్వే:
గత వారంలో అర్నబ్, ఈ వారంలో మురసు తుపాన్ల దెబ్బకు శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు అంటే రాష్ట్రంలో మూడొంతుల ప్రాంతం అతలాకుతలమైంది. మూడు రోజులుగా మురసు తుపాను ధాటికి కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఊళ్లన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి.
ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే, అక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్, క్షేత్ర స్థాయి పరిశీలనకు అనుకూల పరిస్థితులు లేవని.. కేవలం ఏరియల్ సర్వే చేశారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఓటర్లు ఎలాగూ పోలింగ్ బూత్‌లకు రారని, దాన్ని ఆసరాగా చేసుకుని, పచ్చ గూండాలను బరిలోకి దించి బూత్‌లను ఏకపక్షంగా ఆక్రమించుకోవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.
వాయిదా అన్నారు.. వెంటనే కాదన్నారు..
తుపాను కారణంగా తమ పరిధిలోని కొన్ని మండలాల్లో పోలింగ్ నిర్వహించే పరిస్థితి లేదని గుంటూరు, బాపట్ల జిల్లాల జెడ్పీ సీఈవోలు ఎస్ఈసీకి సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లాలోని కాకుమాను, పెదనందిపాడు, ఫిరంగిపురం మండలాల్లో గురువారం కాకుండా శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మళ్లీ కొద్ది సేపటికే వాయిదా నిర్ణయాన్ని విరమించుకున్నామని, యథావిధిగా గురువారమే జిల్లాలోని అన్ని మండలాల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. దీని వెనుక టీడీపీ కూటమి రిగ్గింగ్ వ్యూహం స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


