పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా, వెబ్ క్యాస్టింగ్, అభ్యర్ధులకు భద్రత కల్పించాలి
పోలింగ్ వేళ వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు ఆపాలి
మున్సిపల్ ఎన్నికల సీసీ టీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాలు భద్రపరచాలి
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ
ప్రతి అంశంపై విడివిడిగా ఎస్‌ఈసీకి లేఖలు
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా, వెబ్ క్యాస్టింగ్, అభ్యర్థులకు, పోలింగ్ కేంద్రాలకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. అలాగే పోలింగ్ వేళ వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాల్ని నిబంధనల ప్రకారం భద్రపరచాలని కూడా కోరింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్‌ఈసీకి వేర్వేరు లేఖలు రాశారు.
సుప్రీం ఆదేశాలు పాటించాలి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ సమయంలో అయినా సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, చుట్టుపక్కల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, లేదా వీడియో కెమెరాలతో రికార్డు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీకి రాసిన ఓ లేఖలో కోరింది. ముఖ్యంగా అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, విద్యుత్ సరఫరా, బ్యాకప్‌తో ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని తెలిపింది. 1న జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో నిఘా, భద్రత ఏర్పాట్లలో జరిగిన వైఫల్యాలపై తక్షణ విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను గుర్తించి, తీసుకున్న చర్యలతో నివేదిక సమర్పించాలని కోరింది.
వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ నిర్బంధాలను అడ్డుకోవాలి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు ముందు వైఎస్సార్‌సీపీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, పోలీసుల బెదిరింపులను తక్షణమే అరికట్టాలని ఎస్‌ఈసీని కోరింది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో వైఎస్సార్‌సీపీ వారిని పోలీసులు అరెస్టు చేసి, బైండోవర్, ఇతర కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వీటిపై స్థానిక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నిస్తే వదిలేస్తామని చెప్పి, ఇంకా నిర్బంధంలోనే ఉంచారని తెలిపింది..
కడప జిల్లా వేల్పులలో అక్రమాల్ని అడ్డుకోవాలి
వైఎస్సార్ కడప జిల్లా వేముల మండలంలోని 156, 157 పోలింగ్ కేంద్రాలు ఉన్న ఎంపీపీ యూపీ పాఠశాల చుట్టూ రాళ్ల కుప్పలు పోయడం, వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు ఎల్.రామలింగారెడ్డికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని మరో లేఖలో ఎస్‌ఈసీని వైఎస్సార్‌సీపీ కోరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ రోజున కాకినాడ జిల్లా తొండంగి మండలంలో అధికార పార్టీ వారు బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున అక్కడ తగిన పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
మున్సిపల్ ఎన్నికల సీసీ టీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాలు భద్రపరచాలి
కోర్టుల్లో తాము ఎన్నికల పిటిషన్లు వేసేందుకు వీలుగా అన్ని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల సీసీ టీవీ ఫుటేజిలు, వీడియో, వెబ్‌కాస్టింగ్ రికార్డులను ఒరిజినల్, డిజిటల్ రికార్డులు, బ్యాకప్‌లతో సహా భద్రపరచాలని కోరింది. ఆధారాలు మార్చకుండా, ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
కర్నూలు 23వ వార్డులో రీకౌంటింగ్ నిర్వహించాలి
దీంతో పాటు కర్నూలు కార్పొరేషన్ 23వ వార్డు ఫలితాల ప్రకటనలో వ్యత్యాసం నేపథ్యంలో ఓట్ల రీకౌంటింగ్‌కు ఆదేశించాలని ఎస్‌ఈసీని వైఎస్సార్‌సీపీ కోరింది.


