మోదీ దేశద్రోహి.. ఐదు నిమిషాల్లో నిరూపిస్తా | I will prove in 5 minutes that Narendra Modi is a traitor, Rahul gandhi challenges | Sakshi
Sakshi News home page

మోదీ దేశద్రోహి.. ఐదు నిమిషాల్లో నిరూపిస్తా

Nov 5 2026 5:33 AM | Updated on Nov 5 2026 5:33 AM

I will prove in 5 minutes that Narendra Modi is a traitor, Rahul gandhi challenges

ఎన్డీటీవీ వేదికపై చర్చిద్దామంటూ రాహుల్‌ గాంధీ సవాలు  

పార్లమెంట్‌లో చర్చిద్దామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగంగా సవాలు విసిరారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రధానమంత్రి ఒక దేశద్రోహి అని నిరూపించగలనని తేల్చిచెప్పారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘మోదీజీ.. అదానీకి చెందిన ఎన్డీటీవీ వేదికపైనే మనం చర్చిద్దాం రండి. వేదిక మీదే, తీర్పు ఇచ్చేవారు కూడా మీవాళ్లే. అదానీ అయినా సరే, మోహన్‌ భాగవత్‌ అయినా సరే. 

నరేంద్ర మోదీ ఒక దేశద్రోహి అని కేవలం 5 నిమిషాల్లోనే నిరూపిస్తా’’ అని రాహుల్‌ స్పష్టంచేశారు. మోదీకి రాహుల్‌ సవాలు విసిరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఓట్ల దొంగతనంపై దేశం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రధానమంత్రి స్వయంగా ముందుకు రావాలని అన్నారు. మోదీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహించలేదని తప్పుపట్టారు. 

మోదీ ఇకనైనా ముందుకు రావాలని, ప్రశ్నలను ఎదుర్కోవాలని ఖర్గే చెప్పారు. ఓట్ల దొంగతనానికి ఎందుకు పాల్పడ్డారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ చేసిన పోస్టుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా స్పందించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న రాహుల్‌ గాంధీ బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. 

చర్చ కోసం వేదికను ఎంచుకోవాలని ప్రధానమంత్రిని రాహుల్‌ కోరుతున్నారని, అయితే అలాంటి చర్చకు పార్లమెంట్‌ అందుబాటులో ఉందని గుర్తుచేశారు. సోషల్‌ మీడియాలో సవాళ్లు విసురుతున్నప్పుడు చూపిస్తున్న ఉత్సాహాన్ని పార్లమెంట్‌లో చర్చ విషయంలో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రభుత్వం  స్పందిస్తున్నప్పుడు రాహుల్‌ గాంధీ, ఆయన పార్టీ సహచరులు పార్లమెంట్‌ నుండి వాకౌట్‌ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement