పేదరికం కరిగిపోయింది | Modi says 500 million people lifted out of extreme poverty in 10-12 years | Sakshi
Sakshi News home page

పేదరికం కరిగిపోయింది

Nov 4 2026 4:25 AM | Updated on Nov 4 2026 4:26 AM

Modi says 500 million people lifted out of extreme poverty in 10-12 years

ప్రధాని మోదీ స్పష్టీకరణ

50 కోట్ల మందికి విముక్తి 

12 ఏళ్లలో ఘనమైన పరివర్తన 

గతం ప్రకటనలకే పరిమితం 

మౌలిక సదుపాయాలకు పెద్దపీట 

కరువు రైతులను కేంద్రం ఆదుకుంటుందని ప్రధాని భరోసా 

పుణేలో పింక్‌లైన్‌ మెట్రో ఆవిష్కరణ 

మరో 4 కారిడార్లకు శంకుస్థాపన

పుణే: దేశంలో గత పన్నెండేళ్లలో యాభై కోట్ల మంది ప్రజలు కటిక పేదరికం కోరల్లోంచి బయటపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచబ్యాంకు తాజా నివేదికను ప్రస్తావిస్తూ ప్రకటించారు. గతంలో పేదరికాన్ని తొలగించడం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమై ఉండేదని ఆయన చెప్పారు. పుణేలో మూడో మెట్రో లైన్‌ (పింక్‌ లైన్‌)ను మంగళవారం ఆవిష్కరించిన ప్రధాని మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం 1,200 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ పనిచేస్తోందని, 2014కు ముందు ఇది కేవలం 248 కిలోమీటర్లు మాత్రమేనని తెలిపారు. నగరాల మౌలిక సదుపాయాలు మెరుగైతే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత జోరు అందుకుంటుందని అన్నారు. 

పుణే మెట్రో రెండో దశలో భాగంగా రూ.21,800 కోట్లతో చేపట్టనున్న నాలుగు కొత్త రూట్లకు మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రజలు 2014లో దేశసేవ కోసం ఎన్డీయేకు అవకాశమిచ్చినప్పుడు నగరాల్లోని మధ్యతరగతి ప్రజల జీవితాలను, రవాణాను సులభతరం చేయాలన్న కృత నిశ్చయంతో ముందడుగు వేశామని ప్రధాని తెలిపారు. మహారాష్ట్రలో కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా వారిని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంతవరకూ సాయం అందించిందని, ఎన్డీయే ప్రభుత్వం కూడా రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. కలిసికట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొందామని అన్నారు. ఈ పండుగల సీజన్‌లో దేశ ప్రజలు కూడా కరువుతో అల్లాడుతున్న రైతులను గుర్తు చేసుకోవాలని, రైతులు కూడా ఈ దీపావళిని ఆనందంగా జరుపుకునేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.  

ప్రపంచబ్యాంకు పేదరికంపై ఇటీవల విడుదల చేసిన సూక్ష్మ నివేదికను ప్రస్తావిస్తూ.. గతంలో పేదరిక నిర్మూలన ప్రకటనలకు పరిమితమైతే..ఇప్పుడు క్షేత్రస్థాయిలో పేదరికాన్ని తొలగిస్తున్నామని చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనలు రెండూ ఒకదానితో ఒకటి సంబంధమున్న అంశాలని... మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాలూ ఎక్కువవుతాయని, తద్వారా ప్రజల జీవితాలు మెరుగవుతాయని కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని ప్రధాని వివరించారు. ప్రజలకు ఉట్టిగా సాయం చేయడం కంటే వారిని సాధికారులుగా మార్చాలన్న విధానాన్నే ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు.  

మౌలిక సదుపాయాల్లో ‘పరివర్తన’ 
పట్టణ రవాణా మౌలిక వసతుల్లో వచ్చిన పరివర్తన గురించి ప్రధాని నరేంద్ర మోదీ సోదాహరణంగా వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మూడు మెట్రో నెట్‌వర్క్‌లలో భారత్‌ ఒకటిగా ఎదిగిందని ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా మెట్రో సౌకర్యాలు వేగంగా విస్తరిస్తూండటం ప్రభుత్వ ముందుచూపునకు, ప్రజల అవసరాలు తీర్చాలన్న సంకల్పానికి నిదర్శనాలన్నారు. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అయి ఉత్పాదకత పెరుగుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష కోట్ల రూపాయలతో ‘అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌‘ను ఆమోదించిందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో పట్టణాభివృద్ధికి భారీ పెట్టుబడులను సమీకరించడం ఈ నిధి లక్ష్యమని పేర్కొన్నారు. చిన్న పట్టణాలను అభివృద్ధి కేంద్రాలుగా మార్చేందుకు స్థానిక సంస్థలు, ప్రైవేట్‌ రంగం కలిసి యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement