దేశాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు
రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు
ప్రజల మధ్య విభజన తీసుకురావాలని వారి కుట్ర
అటువంటి శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలవాలి
‘రాష్ట్రీయ ఏక్తా దివస్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
కీలక చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటన
ఏక్తానగర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు కేవలం విరోధ పక్షం(వ్యతిరేకించే వర్గం)గానే కాకుండా, అవరోధ పక్షం(అడ్డంకులు సృష్టించే వర్గం)గా మారాయని మండిపడ్డారు. నిరాశలో మునిగిపోయిన ప్రతిపక్షాలు దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిపోయాయని ఆక్షేపించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు.
రాజ్యాంగ సరిహద్దులను ఛిన్నాభిన్నం చేయడంలో నిమగ్నమయ్యారని విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. విపక్షాల తీరు చాలా దురదృష్టకరమని అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకొని రాష్ర్టీయ ఏక్తా దివస్ సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు దేశ ప్రజల మధ్య విభజన తీసుకురావాలని, యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను పరోక్షంగా ప్రస్తావించారు. విదేశాల్లో రహస్యంగా ఎవరిని ఎవరు కలుస్తున్నారు? భారతదేశానికి వ్యతిరేక శక్తులు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? భారతదేశ శత్రువుల భాషలో ఎవరు మాట్లాడుతున్నారు? అని పేర్కొన్నారు. అటువంటి శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత వ్యతిరేక శక్తులు క్రియాశీలకంగా మారాయని చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచం అత్యంత క్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటోందని, అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. మన దేశం బాహ్య సవాళ్లకు పరిష్కారాలను వెతుకుతున్న తరుణంలో, దేశంలోని కొన్ని శక్తులు అబద్ధాలను, పుకార్లను వ్యాప్తి చేస్తూ అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. కానీ, దేశ ప్రజలు మాత్రం దేశానికి అండగా నిలిచారని ప్రశంసించారు.
దిమాగీ నక్సల్స్ ముప్పు ఎక్కువగా ఉంది
సోషల్ మీడియాను ఒక ఆయుధంగా వాడుతున్నారని, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, తద్వారా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని నక్సలిజం, మావోయిజం నుంచి విముక్తం చేసేవరకు విశ్రమించబోమని గత ఏడాదే చెప్పానని, ఆ మాటను నిలబెట్టుకున్నానని వెల్లడించారు. నక్సలైట్ల వ్యవస్థను అంతం చేసినప్పటికీ, మేధో నక్సలైట్ల(దిమాగీ నక్సల్స్) ముప్పు ఇంకా చాలా ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.
మనం కీలక చర్యలు తీసుకోబోతున్నామని, దేశ సరిహద్దులను పూర్తిగా సురక్షితంగా మార్చడం, చొరబాట్లను, జనాభా మార్పులను అరికట్టడం, లౌకిక పౌర స్మృతి వైపు పయనించడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రకటించారు. ’ఏక్ భారత్–శ్రేష్ట్ర భారత్, వికసిత్ భారత్ అనేవి మన రెండు లక్ష్యాలని పునరుద్ఘాటించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చూపిన మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని తేల్చిచెప్పారు.
50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
పేదరిక నిర్మూలనకు గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ప్రధాని మోదీ తప్పుపట్టారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని నినాదాలు చేసిన వారే స్వయంగా మరింత ధనవంతులుగా మారారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావిస్తూ.. 2014 తర్వాత 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గతంలో ప్రతి 100 మందిలో 27 మంది తీవ్ర పేదరికంలో ఉండేవారని, నేడు ఆ సంఖ్య క్రమంగా తగ్గి, ప్రతి 100 మందిలో ముగ్గురికంటే తక్కువకు చేరుకుందని వెల్లడించారు. పేదల సంక్షేమం, సాధికారతపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని తేల్చిచెప్పారు.
సర్దార్ పటేల్‌కు ఘన నివాళులు
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తానగర్‌లో ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద మోదీ ఘనంగా నివాళులర్పించారు. పటేల్ విగ్రహానికి నమస్కరించారు. జాతీయ సమగ్రతకు, దేశ నిర్మాణానికి పటేల్ అందించిన కృషిని కొనియాడారు. బలమైన, సంపన్నమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు.
అలరించిన ‘నక్సల్ ముక్త్ భారత్’
పటేల్ జయంతి సందర్భంగా ఏక్తానగర్‌లో నిర్వహించిన ఏక్తా దివస్ పరేడ్ విశేషంగా ఆకట్టుకుంది. ఒకప్పుడు మావోయిస్టుల నీడలో ఉన్న 126 జిల్లాలకు చెందిన 2 వేల మంది కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. భయం, హింసతో నిండిన పరిస్థితుల నుంచి నక్సల్స్ రహిత భారతదేశం వైపు సాగిన తమ పరివర్తన గాథను ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వీక్షించారు. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నృత్య దర్శకత్వంలో రూపొందిన ‘నక్సల్ ముక్త్ భారత్’ అనే నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏక్తా దివస్ పరేడ్‌కు దేశవ్యాప్తంగా 126 జిల్లాలకు చెందిన సుమారు 5,000 మందిని ప్రత్యేకంగా ఆహా్వనించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి.


