ఇస్రో ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ హర్షం | Pm Modi Congratulates Isro On Successful Gslv F18 Launch | Sakshi
Sakshi News home page

ఇస్రో ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ హర్షం

Oct 31 2026 8:57 AM | Updated on Oct 31 2026 8:57 AM

Pm Modi Congratulates Isro On Successful Gslv F18 Launch

ఢిల్లీ: భారత నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్‌’ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన అత్యాధునిక నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌వీఎస్‌-03 విజయవంతంగా ప్రయోగించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మన శాస్త్రవేత్తల మేధస్సు, అంకితభావం మన దేశానికి గర్వకారణంగా నిలుస్తోందంటూ ప్రధాని మోదీ కొనియాడారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ సంస్థ తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించిన జియోసింక్రనస్‌ లాంఛ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ) ఎఫ్‌–18 సెకండ్‌ జనరేషన్‌ నావిక్‌–03 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి 11.51 గంటలకు జరిగిన ఈ ప్రయోగంలో  50 మీటర్లు పొడవు, 420 టన్నుల బరువున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–18 రాకెట్‌ 2,232 కిలోల బరువు కలిగిన నావిక్‌–03 ఉపగ్రహాన్ని మోసుకుని చిమ్మ చీకట్లును చీల్చుకుంటూ నింగివైపు అత్యంత వేగంగా దూసుకెళ్లింది.

ఈ సమయంలో శ్రీహరికోట ప్రాంతమంతా పట్టపగలులా కనిపించడం విశేషం. రాకెట్‌లోని మూడు దశలు అద్భుతంగా పని చేశాయి. రాకెట్‌ను ప్రయోగించిన 18.43 నిమిషాలకు నావిక్‌–03 ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు (పెరిజీ), భూమికి దూరంగా 37,023 కిలోమీటర్లు (అపోజి) లో దీర్ఘ వృత్తాకార జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (భూ బదిలీ కక్ష్య)లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహానికి ఇరువైపులా ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌ విచ్చుకున్నాయని బెంగళూరు సమీపంలో బైలాలు ప్రాంతంలో ఉన్న  గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ అందాయి.

జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన నావిక్‌–03  ఉపగ్రహంలో నింపిన ఇంధనం సాయంతో మరో రెండు మూడు రోజుల్లోనే  మూడు దశల్లో  పెరిజీని పెంచుతూ అపోజిని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్‌లో స్థిరపరుస్తారు. షార్‌ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 107వ ప్రయోగం. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 20వ ప్రయోగం, నావిక్‌ సిరీస్‌లో మూడో ఉపగ్రహం.

మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ మాట్లాడుతూ ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారత దేశ నావిగేషన్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్‌లో మూడు ఉపగ్రహాలను పంపామని చెప్పారు. వచ్చే ఏడాది నావిక్‌–04, 05  ఉపగ్రహాలను ప్రయోగించి భారతదేశానికి నావిగేషన్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆరు నెలలకొక ఉపగ్రహం ప్రయోగిస్తామని తెలిపారు.

నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్స్‌టలేషన్‌ (నావిక్‌) అనేది భారతదేశ స్వతంత్ర నావిగేషన్‌ వ్యవస్థ. ఈ వ్యవస్థలో భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ఉపగ్రహాల శ్రేణి తదుపరి తరం నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థలో నావిక్‌–03 ఉపగ్రహం మూడోది. ఈ ఉపగ్రహంలో నావిగేషన్‌ పేలోడ్, రేంజింగ్‌ పేలోడ్‌ అనే రెండు రకాలు పేలోడ్స్‌ అమర్చా­రు.

నావిగేషన్‌ పేలోడ్‌ వినియోగదారులకు నావిగేషన్‌ సేవా సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఈ పేలోడ్‌ ఎల్‌1 బ్యాండ్, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లతో పనిచేస్తుంది. అత్యంత స్థిరమైన రుబీడియం అటామిక్‌ క్లాక్‌ నావిగేషన్‌ పేలోడ్‌లో ఒక భాగం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌ ఉపగ్రహాలలో దిగుమతి చేసుకున్న రుబీడియం అటామిక్‌ క్లాక్‌లు విఫలం కావడంతో అహమ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించి ఈ ఉపగ్రహంలో పొందుపరిచారు. 

ఇదీ చదవండి: ఢిల్లీలో వింత వాతావరణం.. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement