ఢిల్లీలో వింత వాతావరణం.. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..! | Clean Air: Delhi Records Coldest October Day In 75 Years After Heavy Rain | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వింత వాతావరణం.. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..!

Oct 31 2026 7:51 AM | Updated on Oct 31 2026 7:51 AM

Clean Air: Delhi Records Coldest October Day In 75 Years After Heavy Rain

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరాన్ని చలిపులి వణికిస్తోంది. అక్టోబర్‌ నెలలో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 20.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. దీంతో ఢిల్లీ వాసులు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, శాలువాలు, వెచ్చని దుస్తులు బయటకు తీశారు.

మరోవైపు, వర్షాల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడింది. అక్టోబర్‌ నెలలో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి శుక్రవారం నమోదైంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 60గా నమోదైంది. 2022 అక్టోబర్‌ 10న ఏక్యూఐ 44గా నమోదైన తర్వాత ఇదే అత్యుత్తమ స్థాయి.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరాల ప్రకారం.. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ వాతావరణ కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 20.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సాధారణం కంటే ఇది 10.3 డిగ్రీలు తక్కువ. 1951 తర్వాత అక్టోబర్‌ నెలలో ఇంత తక్కువ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. పాలంలో 20.5 డిగ్రీలు, లోధి రోడ్డులో 20.6 డిగ్రీలు, రిడ్జ్‌లో 20.8 డిగ్రీలు, అయానగర్‌లో 20.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

భారీ వర్షాలపై వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ  చేయగా.. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కూడా వర్షాలు కొనసాగాయి. సఫ్దర్‌జంగ్‌లో మరో 4.2 మి.మీ., పాలంలో 3 మి.మీ. లోధి రోడ్డులో 4 మి.మీ., రిడ్జ్‌లో 1.9 మి.మీ., అయానగర్‌లో 2.1 మి.మీ. వర్షం కురిసింది.

శుక్రవారం నమోదైన వర్షపాతం గత నాలుగేళ్లలో అక్టోబర్‌ నెలలో ఒకే రోజులో కురిసిన అత్యధిక వర్షం. 1951 తర్వాత నమోదైన అక్టోబర్‌ నెలలోని అత్యధిక రోజువారీ వర్షపాతాల్లో ఇది ఆరో స్థానంలో నిలిచింది. చివరిసారిగా 2022 అక్టోబర్‌ 9న ఢిల్లీలో 74 మి.మీ. వర్షం కురిసింది.

అక్టోబర్‌ నెల మొత్తంగా చూస్తే కూడా ఢిల్లీలో భారీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం 8.30 గంటల నాటికి సఫ్దర్‌జంగ్‌లో ఈ నెలలో మొత్తం 123.3 మి.మీ. వర్షం కురిసింది. సాధారణంగా అక్టోబర్‌లో కురిసే సగటు వర్షపాతం 15.1 మి.మీ. మాత్రమే. 2022లో 128 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. 1954 తర్వాత అక్టోబర్‌లో నమోదైన అత్యధిక వర్షపాతాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది.

వర్షాల ప్రభావంతో ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడింది. శుక్రవారం ఏక్యూఐ 60గా నమోదైంది. నగరంలోని 54 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 33 చోట్ల సంతృప్తికరమైన గాలి నాణ్యత, 17 చోట్ల మంచి గాలి నాణ్యత, నాలుగు చోట్ల మధ్యస్థ స్థాయి నమోదైంది. లోధి రోడ్డులో అత్యల్పంగా 33 ఏక్యూఐ నమోదుకాగా, పూసాలో అత్యధికంగా 105గా నమోదైంది.

సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ) ప్రకారం.. ఏక్యూఐ 0–50 మధ్య ఉంటే మంచి గాలి నాణ్యతగా, 51–100 మధ్య ఉంటే సంతృప్తికరంగా, 101–200 మధ్య ఉంటే మధ్యస్థంగా పరిగణిస్తారు. 201–300 మధ్య ఉంటే పేలవమైన గాలి నాణ్యతగా, 301–400 మధ్య ఉంటే అత్యంత పేలవంగా, 401–500 మధ్య ఉంటే తీవ్ర కాలుష్యంగా వర్గీకరిస్తారు. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సీఆర్‌ఈఏ) విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ సగటు ఏక్యూఐ 167గా నమోదైంది. 2015 తర్వాత అక్టోబర్‌ నెలలో నమోదైన అత్యల్ప సగటు కాలుష్య స్థాయి ఇదే.

ఇదీ చదవండి:  నిరుద్యోగులకు విజయ్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement