చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్లపాటు సడలింపు ప్రకటించారు. ఈ నిర్ణయంతో వయోపరిమితి కారణంగా ఇప్పటివరకు ఉద్యోగ పరీక్షలకు దూరమైన వేలాది మంది అభ్యర్థులకు మరో అవకాశం లభించనుంది.
ప్రభుత్వ ఉద్యోగ ఆశావహుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన వెల్లడించింది. ఇప్పటికే అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులకు అదనంగా ఈ ఐదేళ్ల మినహాయింపు వర్తించనుంది.
గ్రూప్స్ అభ్యర్థులకు భారీ ఊరట
తాజా నిర్ణయం ప్రకారం గ్రూప్-1 ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు పెరగనుంది. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 37 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచారు. దివ్యాంగ అభ్యర్థుల్లో జనరల్ కేటగిరీ వారికి 42 నుంచి 47 ఏళ్లకు, రిజర్వేషన్ కేటగిరీ వారికి 47 నుంచి 52 ఏళ్లకు వయోపరిమితిని పెంచారు. అలాగే, గ్రూప్-2 ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 30 నుంచి 35 ఏళ్లకు పెంచారు. జనరల్ కేటగిరీకి చెందిన దివ్యాంగ అభ్యర్థులకు 40 నుంచి 45 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగాలకు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ఇప్పటికే గరిష్ఠ వయోపరిమితి లేదు.
కాగా, ఈ కొత్త నిబంధనలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. దీంతో తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు మరింత సమయం, అవకాశాలు లభించనున్నాయి.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. వైరలవుతున్న చివరి సెల్ఫీ !


