‘అర్నబ్‌’ తుఫాన్‌ విధుల్లో పోలీసులు.. జైలు నుంచి 17మంది ఖైదీలు పరారీ | 17 Inmates Escape Theni Sub Jail | Sakshi
Sakshi News home page

‘అర్నబ్‌’ తుఫాన్‌ విధుల్లో పోలీసులు.. జైలు నుంచి 17మంది ఖైదీలు పరారీ

Oct 27 2026 7:38 AM | Updated on Oct 27 2026 8:36 AM

17 Inmates Escape Theni Sub Jail

సాక్షి,చెన్నై: ఒకవైపు దక్షిణాది రాష్ట్రాల్లో ‘అర్నబ్’ తుఫాన్‌ అలజడి సృష్టిస్తుంటే.. మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సైలెంట్‌గా తమ పని కానిచ్చేశారు. ప్రభుత్వ యంత్రాంగం తుఫాన్ సహాయక చర్యల్లో తలామునకలవుతుంటే, అదును చూసిన ఖైదీలు జైలు సిబ్బందిపై దాడి చేశారు. జైలు నుంచి పరారయ్యారు.

పోలీసుల వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకోవడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం ఖైదీల కోసం 16 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ గాలింపు చర్యల్లో ఒక ఖైదీని అదుపులోకి తీసుకోగా.. మరో 16 మంది కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.

జైల్లో మొత్తం 17 మంది ఖైదీలు ఒకే గదిలో ఉన్నారు. ఖైదీలలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని సమాచారం అందడంతో జైలు సిబ్బంది ఆ గదిలోకి వెళ్లారు. ఆ సమయంలోనే ఖైదీలు తప్పించుకునేందుకు ప్లాన్‌ చేశారు. ఖైదీలు ముందస్తు ప్లాన్‌లో భాగంగా ఫిట్స్ (మూర్ఛ) వచ్చినట్లు నటించారు. సిబ్బందిపై దాడి చేసిన ఖైదీలు అక్కడి నుండి పారిపోయినట్లు సౌత్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయేంద్ర బిదరి తెలిపారు.

ఖైదీల దాడి సమయంలో తేని జిల్లా జైల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది తంగపాండి తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆయనను జి.విలక్కు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు జైలు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు.

గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు పొరుగు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. దిండిగల్ జిల్లా ఎస్పీ ఎస్. జయకుమార్ మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో 16 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దిండిగల్-తేని రహదారిపై కూడా వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.

మధురై, దిండిగల్, ఇడుక్కి జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. పరారైన ఖైదీలను గుర్తించేందుకు వీలుగా వారి ఫొటోలను అన్ని పోలీస్‌స్టేషన్‌లు, చెక్‌పోస్టులకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి : రూ. 600 కోట్ల సుపారీ ప్లాన్.. కర్ణాటక పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement