సాక్షి,చెన్నై: తమిళనాడులో అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే)పై దుమారం చెలరేగింది. టీవీకేకి చెందిన స్థానిక నేత ఒకరు కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.కుండపోతగా కురుస్తున్న వర్షంలో లిఫ్ట్ ఇస్తానని నమ్మించిన నిందితుడు విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నాగర్‌కోయిల్‌లోని ఓ కళాశాలలో ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, తన తోటి స్నేహితురాలితో కలిసి (వారిలో ఒకరు టీవీకే కార్యకర్త) కాలేజీ ముగిసిన తర్వాత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టీవీకే కేంద్ర జిల్లా కార్యవర్గ కమిటీ సభ్యుడైన క్రిస్టోఫర్.. తాను కూడా అదే మార్గంలో వెళ్తున్నానని చెప్పి వారిని నమ్మించి కారు ఎక్కించుకున్నాడు.
మార్గం మధ్యలో ముందుగా ఓ విద్యార్థిని దించాడు. ఆ తర్వాత మరో విద్యార్థినితో క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. ‘నేను కులశేఖరం వెళ్తున్నాను, నిన్ను కూడా అక్కడే దించుతాను’అంటూ నమ్మించాడు. అయితే మార్గమధ్యంలో కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
విపక్షాల తీవ్ర నిరసనలు.. విమర్శల వర్షం
ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తన పార్టీ నేతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. టీవీకే పార్టీ నేరస్థులకు నిలయంగా మారిందని మండిపడ్డారు. బాధితురాలికి తక్షణ రక్షణ కల్పించాలని, నిందితుడిపై నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ న్యాయం జరగకపోతే ప్రజాసంఘాలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అన్నాడీఎంకే విమర్శలు
మరోవైపు అన్నాడీఎంకే కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. సొంత పార్టీ సభ్యుల నుంచే మహిళలకు రక్షణ కల్పించలేని వ్యక్తి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని ఎక్స్ వేదికగా దుయ్యబట్టింది. టీవీకే రాజకీయ పార్టీనా లేక కామాంధుల అడ్డానా? అని నిలదీసింది. ఈ ఘటనపై టీవీకే పార్టీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. జిల్లా స్థాయి నేత అక్రమాలకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


