సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్‌ చేసిన అన్నామలై! | Annamalai clarifies never support CJP their agenda different | Sakshi
Sakshi News home page

సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్‌ చేసిన అన్నామలై!

Oct 23 2026 1:34 PM | Updated on Oct 23 2026 1:43 PM

Annamalai clarifies never support CJP their agenda different

బీజేపీతో విభేదాలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు.. ప్రధాని మోదీపై ప్రశంసలు.. ఇలా ఒకే వేదికపై భిన్నమైన వ్యాఖ్యలతో మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై మరోసారి వార్తల్లో నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలను తప్పుబట్టిన ఆయన.. అంతమాత్రాన తాను సీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు భావించవద్దని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి పోరాడే హక్కు ఉందని పేర్కొన్నారు.

గురువారం తన ‘వీ ద లీడర్స్‌’ ఉద్యమం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన అన్నామలై.. సీజేపీ ఎజెండా వేరని, తమ ఎజెండా వేరని అన్నారు. అయితే, నిరసనకారులు తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించకూడదని సూచించారు. అరెస్టులు చట్టబద్ధంగా, నిర్దేశిత విధానాలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఉందని భావిస్తే నిఘా సంస్థలు, ఇతర భద్రతా వ్యవస్థలు ఉన్నాయని అన్నామలై గుర్తుచేశారు. అలాంటి అంశాలపై చర్యలు తీసుకోవాలే తప్ప, సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేస్తూ అనవసర భయాందోళనలు సృష్టించకూడదని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అంగీకరించలేమన్నారు.

తన దేశభక్తిపై ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం గురించి తనకు తెలుసని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంచి పనులు చేస్తున్నారని ప్రశంసించిన అన్నామలై.. ఆయనకు మద్దతు ఇస్తూనే, తప్పుగా అనిపించిన అంశాలను ప్రశ్నించడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు.

ఇటీవల సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను నిర్బంధించడంపై కూడా అన్నామలై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న సీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును అన్నామలై ప్రశ్నించడం బీజేపీ వర్గాల్లో విమర్శలకు దారితీసింది. 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా అన్నామలై ప్రస్తావించారు. అప్పట్లో రాంలీలా మైదానంలో అవినీతి వ్యతిరేక నిరసనకారులపై పోలీసుల చర్యలను మోదీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. గతంలో ఇలాంటి చర్యలను ప్రశ్నించిన మోదీ.. ఇప్పుడు అదే తరహా విమర్శలు ఎదురవుతున్నప్పుడు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని ప్రశ్నించారు.

అంతేకాదు, సీజేపీని వ్యతిరేకించే క్రమంలో బీజేపీ ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ఉచిత ప్రచారం కల్పిస్తోందా? అని నిలదీశారు. అధికారంలో ఉండి కూడా బీజేపీ కొత్త శత్రువులను సృష్టించుకుంటోందని విమర్శించారు. అన్నామలై వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి తీవ్రంగా స్పందించారు. అన్నామలై ప్రశ్నలు శాంతియుత నిరసనలకు, ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించడానికి మధ్య ఉన్న తేడాను మసకబారుస్తున్నాయని విమర్శించారు. 2026 జూన్‌లో బీజేపీని వీడిన అన్నామలైకు ఆ పార్టీని విమర్శించే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఐపీఎస్‌ అంకితా శర్మకు బిగ్‌ షాక్‌.. ఇలా జరిగిందేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement