సాక్షి, చెన్నై: తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు సవర్ల బంగారు పుస్తెల తాడుకోసం సహోద్యోగిని దారుణంగా హత్య చేసిన ఉదంతం రాజకీయ దుమారాన్ని రాజేసింది. హోంశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్‌పై డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.అసలు ఏం జరిగిందంటే..
రామనాథపురం జిల్లాకు చెందిన ఉత్తిర అనే మహిళ, తిరుప్పూర్ జిల్లా పళ్లగౌండంపాలయంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అక్టోబర్ 15న మిస్ అయిందంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 17న పెరుందురై సమీపంలోని విజయమంగళం టోల్ గేట్ వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ఉత్తిర సహోద్యోగి శరవణన్‌ను నిందితుడిగా గుర్తించారు. బంగారం కోసమే నిందితుడు ఆమెను తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి, హత్య చేసి ఆమె తాళిను దొంగిలించాడని ఈరోడ్ జిల్లా పోలీసులు తెలిపారు. అక్టోబర్ 19న శరవణన్‌ను అరెస్టు చేసి, దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.
రాజుకున్న రాజకీయం
ఈ హత్య ఉదంతంతో తమిళనాడులో శాంతిభద్రతల అంశంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. సీఎం విజయ్ కేవలం పేరుకే హోంశాఖను తన వద్ద ఉంచుకున్నారు. మిగతా శాఖల బాధ్యతలను ఇతర మంత్రులకు పంచిపెట్టినట్లే, పోలీస్ శాఖను కూడా ఎవరికైనా అవుట్‌సోర్సింగ్ ఇచ్చారా?" అంటూ స్టాలిన్ మండిపడ్డారు. మాదకద్రవ్యాలను వదిలేయండి, క్రీడలను స్వీకరించండి అన్న విజయ్ ఇచ్చిన పిలుపును గుర్తుచేస్తూ.. "ముఖ్యమంత్రి గారూ, మీ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను తీస్తోంది. ముందు మీరు విశ్రాంతిని వదిలేసి, మీ శాఖపై పూర్తి దృష్టి పెట్టండి" అని స్టాలిన్ ఎద్దేవా చేశారు. అలాగే శివగంగ జిల్లాలో బెయిల్‌పై బయటకొచ్చిన వ్యక్తి హత్యకు గురికావడం, అలాగే శ్రీలంకకు దాదాపు 135 కిలోల మెథాంఫెటమిన్ ద్రవాన్ని అక్రమంగా తరలించడానికి యత్నిస్తూ టీవీకే (TVK) మాజీ నిర్వాహకుడు భూబాలన్ పట్టుబడటం వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని స్టాలిన్ ఆరోపించారు.
ఇదీ చదవండి: దసరా పండుగ : సింగర్ ఇంటికి కొత్త లగ్జరీ కారు
టీవీకే స్పందన
మరోవైపు, అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూబాలన్‌ను పార్టీ నుంచి వెంటనే బహిష్కరించినట్లు టీవీకే తెలిపింది. నాయకులతో ఫోటోలు దిగే ప్రతి ఒక్కరి నేపథ్యాన్ని తనిఖీ చేయడం సాధ్యం కాదని పేర్కొంది. స్టాలిన్ విమర్శలపై విజయ్ నేరుగా స్పందించనప్పటికీ, ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేరాల పెరుగుదలకు కేవలం కొన్ని నెలల తమ ప్రభుత్వాన్ని బాధ్యత వహించలేమని, గత డీఎంకే పాలనలోనే డ్రగ్స్ విచ్చలవిడిగా మారాయని, నేరాల నియంత్రణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విజయ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: హాట్ టాపిక్ : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందన


