తమిళనాడులో నటుడు ధనుష్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే ఊహాగానాలపై అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ స్పందించింది. సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు సీఎం జోసెఫ్ విజయ్ సాగించిన ప్రయాణం సరికొత్త రాజకీయ "స్టార్టప్‌లకు" ఒక స్ఫూర్తిగా మారిందని టీవీకే పేర్కొనడం విశేషం. ధనుష రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రానప్పటికీ, అధికార పార్టీ స్వయంగా విజయ్ ప్రయాణాన్ని ఒక స్ఫూర్తిగా అభివర్ణించడంతో, మరో తమిళ సూపర్ స్టార్ ఎంట్రీ ఖాయమేనా అనేది ఆసక్తికరంగా మారింది.
కోయంబత్తూర్‌లో దాదాపు 3,000 మంది కార్యవర్గ సభ్యుల సమక్షంలో ధనుష్ అభిమాన సంఘాన్ని "ధనుష్ నర్పణి ఇయక్కమ్" (ధనుష్ వెల్ఫేర్ మూవ్‌మెంట్)గా మార్చడంతో నెట్టింట తీవ్ర చర్చ మొదలైంది. ఈ సమావేశంలో మాజీ జర్నలిస్ట్, అన్నాడీఎంకే ఎంపీ రబి బెర్నార్డ్ క్రమశిక్షణ, సంక్షేమ కార్యకలాపాల గురించి మాట్లాడగా, ఒక ఇస్రో శాస్త్రవేత్త ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. అయితే ఈ సమావేశానికి ధనుష్ హాజరుకాలేదు, ఎలాంటి రాజకీయ ప్రవేశం గురించి ఆయన ప్రకటించలేదు.
ఈ పరిణామంపై టీవీకే ప్రతినిధి ఎం. సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలని భావించే వారికి టీవీకే స్ఫూర్తిగా నిలవడం సంతోషకర మన్నారు. విజయ్ ఈ స్థాయికి చేరుకోవడానికి దశాబ్దాల పాటు కష్టపడ్డారని గుర్తుచేశారు. విజయ్ తన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడే నటనను విడిచి పెట్టారని చెబుతూ, రాజకీయాల పట్ల ఆయన చేసిన త్యాగం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు.
మరోవైపు విజయ్ దీనికోసం 30 ఏళ్లు కృషి చేశారు. ఇది అంత సులభం కాదని సత్యకుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వేరే రాజకీయ శక్తులు పుట్టుకొచ్చినా, వాటి బలం, నిలకడ చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి విజయ్ ప్రయాణం ఒక టెంప్లేట్‌లా మారుతుందని, అయితే పార్టీని నడపడం, ఎన్నికల్లో గెలవడం అనేది పూర్తి స్థాయి నిబద్ధతను కోరుకుంటుందని సత్యకుమార్ హెచ్చరించడం గమనార్హం.
ఇదీ చదవండి: దసరా పండుగ : సింగర్ ఇంటికి కొత్త లగ్జరీ కారు
కాగా తమిళనాడులో సినిమా, రాజకీయాలు ఎప్పుడూ ముడిపడి ఉన్నాయనడానికి సీఎన్ అన్నాదురై, ఎం. కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జే జయలలిత లాంటి దిగ్గజాలే ఉదాహరణ. అయితే శివాజీ గణేశన్, విజయకాంత్, శరత్‌కుమార్, కమల్ హాసన్ వంటి నటులు రాజకీయాల్లోకి వచ్చినా అత్యున్నత పదవిని అధిరోషించలేకపోయారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల నుంచే తప్పుకున్నారు. ఇప్పుడు విజయ్ సాధించిన ఘనవిజయం, సీఎం పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో ధనుష్ ఎంట్రీ ఊహాగానాలు మళ్లీ వార్తల్లో నిలిచాయి.
ఇదీ చదవండి: టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
విజయ్ ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీకోసం చాలాకాలం ముందునుంచే తన పునాదిని బలం చేసుకున్నారు. అభిమాన సంఘాన్ని సంక్షేమ వేదికగా మార్చారు. ఉచిత భోజనం, విద్యార్థులకు సాయం, లైబ్రరీలను తెరవడం, న్యాయ సహాయం అందించడం వంటి సేవా కార్యక్రమాలతో మద్దతుదారులను కూడగట్టారు. కాలక్రమేణా ఈ నెట్‌వర్కే టీవీకే పార్టీకి బలమైన పునాదిగా మారింది ప్రస్తుతం ధనుష్ అభిమాన సంఘం కూడా అదే బాటలో నడుస్తోంది.


