ఇన్నాళ్లు ఎక్క‌డ వున్నావు బ్రో..! టీమిండియాకు దొరికిన అణిముత్యం | From Unsung Hero to Match-Winner: Naman Dhir Becomes Indias Newest T20 Star | Sakshi
Sakshi News home page

IND vs NZ: ఇన్నాళ్లు ఎక్క‌డ వున్నావు బ్రో..! టీమిండియాకు దొరికిన అణిముత్యం

Oct 22 2026 6:47 PM | Updated on Oct 22 2026 8:02 PM

From Unsung Hero to Match-Winner: Naman Dhir Becomes Indias Newest T20 Star

టీమిండియాకు మరో అసలు సిసలైన ఆల్‌రౌండర్ దొరికేశాడు. ఇటు బ్యాటింగ్‌లోనూ అటు బౌలింగ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. అనుహ్యంగా భారత టీ20 జట్టులోకి వచ్చిన ఈ యువ ఆట‌గాడు ఇప్పుడు తన స్ధానాన్ని  సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. అతడే పంజాబ్‌కు చెందిన  ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో నమన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న తరుణంలో తన సంచలన బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

నమన్ వీరోచిత ఇన్నింగ్స్‌
226 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ఓపెన‌ర్లు సంజూ శాస‌న్‌, అభిషేక్ శ‌ర్మ మెరుపు ఆరంభం అందించిన‌ప్ప‌టికి.. మిడిలార్డ‌ర్ విఫ‌లం కావ‌డంతో భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో భార‌త విజ‌యానికి 60 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన న‌మ‌న్ ధీర్ అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔటైన‌ప్ప‌టికి న‌మ‌న్ మాత్రం ఆఖ‌రి వ‌ర‌కు అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. కేవ‌లం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 42 ప‌రుగులు చేశాడు. దీంతో అత‌డిపై స‌ర్వాత్ర ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. టీమిండియాకు సరైన ఆల్‌రౌండర్ దొరికేశాడని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

విండీస్ సిరీస్‌లో అరంగేట్రం
వాస్తవానికి భారత టీ20 జట్టులోకి నమన్ వస్తాడని ఎవరూ ఊహించలేదు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు మాత్రం అతడిన తొలుత సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ కరేబియన్ టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టులో అనుహ్య మార్పు చోటు చేసుకుంది. ఆ సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్‌ను తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. నమన్ ధీర్‌కు పిలుపు నిచ్చింది.  

ఈ క్రమంలో తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న నమన్.. కివీస్ పర్యటనకు కూడా ఎంపికయ్యాడు. ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై కూడా తన మార్క్ చూపించి సెలక్టర్ల నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నాడు.

ఐపీఎల్‌లో అదుర్స్‌
ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన పంజాబ్ టీ20 లీగ్‌లోనూ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే జాతీయ సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం నమన్ ధీర్ ప్రత్యేకత. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement