మాల్దీవుల డబుల్‌ గేమ్‌.. భారత్‌కు వెన్నుపోటేనా? | Maldives entering Pak orbit Muizzu signs defence deals | Sakshi
Sakshi News home page

మాల్దీవుల డబుల్‌ గేమ్‌.. భారత్‌కు వెన్నుపోటేనా?

Oct 23 2026 9:27 AM | Updated on Oct 23 2026 9:31 AM

Maldives entering Pak orbit Muizzu signs defence deals

హిందూ మహాసముద్రంలో కీలక స్థానంలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తాజా పర్యటన ఇప్పుడు ప్రాంతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఒకవైపు భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సహకారాన్ని పెంచుకునేందుకు అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో చర్చలు, ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌తో సమావేశం, ఏకంగా 20 ఒప్పందాలపై సంతకాలు.. ఇవన్నీ ముయిజ్జు పర్యటనను సాధారణ దౌత్య పర్యటన పరిధి దాటించాయి. దీంతో భారత్‌కు మాల్దీవులు వెన్నుపోటు పొడుస్తోందా? లేక తన విదేశాంగ విధానంలో భాగంగా అన్ని దేశాలతో సంబంధాలను విస్తరిస్తోందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అక్టోబర్‌ 20 నుంచి 22 వరకు ముయిజ్జు పాకిస్థాన్‌లో పర్యటించారు. 11 ఏళ్ల తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన వేళ ఈ పర్యటన జరగడం మరో విశేషం. ఈ సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, పోలీసింగ్‌, పౌర విమానయానం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పర్యాటకం తదితర రంగాల్లో 20 ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం సుమారు 1.3 కోట్ల డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండేళ్లలో 20 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందాలు తమ మధ్య సహకారానికి కొత్త అధ్యాయమని ముయిజ్జు అభివర్ణించారు. అయితే, రక్షణ, సముద్ర భద్రత అంశాలు ఈ పర్యటనకు వ్యూహాత్మక ప్రాధాన్యం తీసుకొచ్చాయి.

మునీర్‌తో భేటీ.. 
పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో సమావేశమైన ముయిజ్జు.. ఆ దేశ శక్తిమంతమైన సైనిక నాయకుడు, ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌తోనూ చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారం, సంస్థాగత సంబంధాలు, సైనిక శిక్షణ అంశాలు వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్థాన్‌ సాయుధ దళాల వృత్తి నైపుణ్యాన్ని ముయిజ్జు ప్రశంసించారు. అయితే, హిందూ మహాసముద్రంలోని కీలక సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవులు భారత్‌కు వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశం. అలాంటి దేశం పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సంబంధాలను విస్తరించడం సహజంగానే న్యూఢిల్లీని టెన్షన్‌ పెట్టే పరిణామం. అయితే, ఈ ఒప్పందాల ద్వారా మాల్దీవుల్లో పాకిస్థాన్‌ సైనిక స్థావరం ఏర్పాటవుతోందని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవు. ఒప్పందాలు ఆచరణలో ఏ రూపం దాలుస్తాయన్నదే కీలకం.

‘ఇండియా అవుట్‌’ నుంచి పాక్‌ స్నేహం వరకు!
ముయిజ్జు రాజకీయ ప్రస్థానంలో భారత్‌ అంశం మొదటి నుంచీ కీలకంగా ఉంది. 2023లో ‘ఇండియా అవుట్‌’ ప్రచారంతో ఆయన అధికారంలోకి వచ్చారు. అనంతరం మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక సిబ్బందిని వెనక్కి పంపించి, వారి స్థానంలో పౌర సాంకేతిక సిబ్బందిని నియమించారు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే, ఆ తర్వాత భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు కూడా ముయిజ్జు ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు అదే ప్రభుత్వం పాకిస్థాన్‌తో రక్షణ, సముద్ర భద్రత సహకారాన్ని పెంచుకోవడం కొత్త చర్చకు కారణమైంది. భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే పాకిస్థాన్‌తో వ్యూహాత్మక సంబంధాలను విస్తరించాలనుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

సార్క్‌ పునరుద్ధరణకు ముయిజ్జు పిలుపు
ఈ పర్యటనలో ముయిజ్జు మరో కీలక ప్రతిపాదన చేశారు. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌)ను తిరిగి క్రియాశీలం చేయాలని పిలుపునిచ్చారు. 2014లో ఖాట్మండులో జరిగిన సమావేశం తర్వాత ఈ కూటమి శిఖరాగ్ర సమావేశం జరగలేదు. 2016లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సమావేశం ఉరీ ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాల్గొనకపోవడంతో రద్దయింది. సార్క్‌ దేశాల మధ్య సహకారం పెంచేందుకు, తదుపరి శిఖరాగ్ర సమావేశం త్వరగా నిర్వహించేందుకు మాల్దీవులు కృషి చేస్తాయని ముయిజ్జు తెలిపారు. అయితే, సార్క్‌ పునరుద్ధరణకు భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలు, ఉగ్రవాదంపై నెలకొన్న విభేదాలు కీలక అడ్డంకులుగా ఉన్నాయి.

కశ్మీర్‌, సింధు జలాల అంశాలను లేవనెత్తిన పాక్‌
ముయిజ్జుతో చర్చల సందర్భంగా షరీఫ్‌.. జమ్మూ కశ్మీర్‌, సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్‌ వైఖరిని వివరించారు. నీటి సరఫరాలో జోక్యాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని షరీఫ్‌ హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. అయితే, ఈ అంశాల్లో పాకిస్థాన్‌ వైఖరికి ముయిజ్జు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు.

భారత్‌కు వెన్నుపోటు?
మాల్దీవులు భారత్‌కు సమీప సముద్ర ప్రాంతంలో ఉన్నందున అక్కడి విదేశాంగ, రక్షణ సంబంధాల్లో వచ్చే మార్పులు న్యూఢిల్లీకి ప్రాధాన్యం కలిగిస్తాయి. మరోవైపు, చైనా కూడా మౌలిక సదుపాయాల పెట్టుబడుల ద్వారా మాల్దీవుల్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ముయిజ్జు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ వ్యూహాలకు కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. తాజా ఒప్పందాలు నిజంగా రక్షణ సహకారాన్ని ఎంతవరకు పెంచుతాయి? అవి భారత్‌-మాల్దీవుల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అన్నది రానున్న పరిణామాలే నిర్ణయించనున్నాయి.

ఇదీ చదవండి: ఇరాన్‌ మాస్టర్‌ప్లాన్‌.. ఎన్నికల వేళ ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement