పశ్చిమ బర్ధమాన్: పశ్చిమ బెంగాల్‌లోని బొగ్గు గనిలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం కార్మికులను ప్రమాదంలోకి నెట్టివేసింది. పశ్చిమ బర్ధమాన్ జిల్లా ఆసన్సోల్‌లోని కుమార్డిహ్-ఎ కొలియరీలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్)కు చెందిన సుమారు 10 నుంచి 14 మంది కార్మికులు భూమికి దాదాపు 200 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈసీఎల్ బంకోలా ఏరియాలోని కుమార్డిహ్-ఎ కొలియరీలో కార్మికులు గనిలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఉపయోగించే లిఫ్ట్‌ను స్థానికంగా ‘డోలి’ అని పిలుస్తారు. సోమవారం సాయంత్రం కార్మికులు ఈ లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. లిఫ్ట్‌ను నడిపించే తాడు ఇంజిన్ గదిలోని డ్రమ్‌లో చిక్కుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో లిఫ్ట్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. కార్మికులు భూగర్భంలోనే ఉండిపోవడంతో గనిలో ఆందోళన నెలకొంది.
గనిలో చిక్కుకున్న కార్మికుల సంఖ్యపై భిన్నమైన వివరాలు వెలువడ్డాయి. తొలుత 14 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందగా, ఈసీఎల్ అధికారి ఒకరు సుమారు 10 నుంచి 12 మంది ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, కార్మిక సంఘాల ప్రతినిధులు 12 నుంచి 14 మంది వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే, కచ్చితమైన సంఖ్యపై అధికారిక నిర్ధారణ కాలేదు. మరోవైపు, లిఫ్ట్ తాడును డ్రమ్ నుంచి వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. డ్రమ్‌ను వ్యతిరేక దిశలో తిప్పి తాడును సురక్షితంగా బయటకు తీయాలని చూస్తున్నారు.
భూగర్భంలో చిక్కుకున్న కార్మికులకు తాళ్ల సాయంతో తాగునీరు, డ్రై ఫ్రూట్స్, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నారు. గనిలో తాజా గాలికి కొరత లేదని, కార్మికులు స్పందిస్తున్నారని ఈసీఎల్ అధికారి వెల్లడించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు పట్టే సమయాన్ని బట్టి సహాయక చర్యలు పూర్తవుతాయని కార్మిక సంఘం నాయకుడు మింటూ బెనర్జీ తెలిపారు. కార్మికులను బయటకు తీసుకురావడానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే జితేంద్ర తివారీ పేర్కొన్నారు. గతంలోనూ డోలి నిలిచిపోయిన ఘటనలు జరిగాయని, కొన్ని నెలల క్రితమే లిఫ్ట్‌కు మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ సమస్య తలెత్తిందని కార్మికులు చెబుతున్నారు. కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఏమైనా జరిగిందా అనే అంశాలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే కోరారు. నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ట్రంప్‌కు మరో తలనొప్పి.. డెమోక్రాట్‌కు రిపబ్లికన్ల మద్దతు!


