గుజరాత్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి | Gujarat Chemical Plant Blast: 5 Workers Killed 6 Injured in Reactor Explosion | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

Oct 17 2026 11:42 AM | Updated on Oct 17 2026 11:42 AM

Gujarat Chemical Plant Blast: 5 Workers Killed 6 Injured in Reactor Explosion

గుజరాత్‌ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి.. పలువురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. భరూచ్‌ జిల్లా వాగ్రా తాలూకాలోని సాయఖా జీఐడీసీలో ఉన్న సింజీల్‌ ఫార్మాకెమ్‌ పరిశ్రమలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘోరం సంభవించింది. 

రియాక్టర్‌ పేలడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. పేలుడు అనంతరం రసాయన వాయువు లీకవడంతో పరిశ్రమ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అధికారులు, అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

హైడ్రోజనేషన్‌ ప్రక్రియలో పేలుడు
పరిశ్రమలో రసాయనాల తయారీ ప్రక్రియ కొనసాగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. హైడ్రోజనేషన్‌ ప్రక్రియలో ఉపయోగిస్తున్న సుమారు 15 వేల లీటర్ల సామర్థ్యం గల రియాక్టర్‌ పేలినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు యంత్ర పరికరాలు దెబ్బతినడంతో పాటు వాటి శకలాలు పరిశ్రమ ప్రాంగణంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని శకలాలు ఫ్యాక్టరీ వెలుపలికి కూడా ఎగిరిపడ్డాయి.

15 కిలోమీటర్ల దూరం వరకు శబ్దం
పేలుడు శబ్దం సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు పరిసర గ్రామాల ప్రజలు తెలిపారు. భారీ శబ్దంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పేలుడు అనంతరం ప్లాంటులో, దాని చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. మీథిలీన్‌ డైక్లోరైడ్‌ (MDC) వాయువు లీకైనట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న కొందరు కార్మికులు, ఇతరులకు కళ్ల మంట వంటి ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం.

క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స
ప్రమాదంలో గాయపడిన కార్మికులను భరూచ్‌, వడోదరలోని ఆస్పత్రులకు తరలించినట్లు నివేదికలు తెలిపాయి. మృతదేహాలను భరూచ్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు పలు తాజా కథనాలు వెల్లడించగా, గాయపడిన వారి సంఖ్యపై కొన్ని నివేదికల్లో ఐదుగురు, మరికొన్నింటిలో ఆరుగురిగా పేర్కొన్నారు. అధికారికంగా తుది సంఖ్య నిర్ధారణ కావాల్సి ఉంది.

ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు
ఘటనపై పోలీసులు, జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. గుజరాత్‌ కాలుష్య నియంత్రణ మండలి, పారిశ్రామిక భద్రత–ఆరోగ్య విభాగం అధికారులు కూడా పరిశీలన ప్రారంభించినట్లు సమాచారం. రియాక్టర్‌ పేలడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? తయారీ ప్రక్రియలో సాంకేతిక లోపం ఏదైనా తలెత్తిందా? పరిశ్రమలో భద్రతా నిబంధనలు పాటించారా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం మాత్రం విచారణ పూర్తయిన తర్వాతే వెల్లడికానుంది.

ఇదీ చదవండి: కాలువలో పడ్డ బస్సు.. 8 మంది మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement