ఆవిష్కరణలే దేశ భవితకు దిక్సూచి
పరిశ్రమల అనుసంధానం, మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు
దేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.1 లక్ష కోట్ల భారీ నిధిని (ఆడీఐ స్కీమ్) విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. పరిశోధనా రంగాన్ని కేవలం విద్యాపరమైన పరిధికి మాత్రమే పరిమితం చేయకుండా దాన్ని పారిశ్రామిక అవసరాలతో అనుసంధానించాలని నొక్కిచెప్పారు. తిరుచ్చిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల (ఎస్‌ఆర్‌సీ) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె దేశ ఆర్థిక ప్రగతిలో, వికసిత్ భారత్ సాధనలో విద్యాసంస్థల బాధ్యతను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిధి ప్రత్యేకతలు, ప్రయోజనాలు
నవంబర్ 2025లో ప్రారంభించిన రూ. లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల నిధి.. ప్రైవేట్ రంగంలో డీప్-టెక్, ఏఐ, అంతరిక్ష పరిశోధనలు, వ్యూహాత్మక ప్రాజెక్టులకు దీర్ఘకాలికంగా తక్కువ వడ్డీతో లోన్లను అందించే వేదిక అని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. ఈ నిధి ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేయవచ్చన్నారు. అకడమిక్ పరిశోధనలను నేరుగా పరిశ్రమలు, రైతులు, సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా ఆచరణలోకి తేవచ్చని ఆమె స్పష్టం చేశారు.
మహిళా సాధికారత, ఉపాధి కల్పనే ధ్యేయం
ఈ నిధుల ద్వారా కేవలం సాంకేతిక ఆవిష్కరణలతోపాటు మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా యువతకు ఏఐ, ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. తద్వారా వారు ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికంటే ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే స్థానిక పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐ), చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) విద్యాసంస్థలతో అనుసంధానించడం ద్వారా మార్పులు తీసుకురావచ్చని తెలిపారు.
ద్రవ్యలోటు నియంత్రణ
ఇదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటును క్రమంగా తగ్గిస్తూ ఆర్థిక అనుశిక్షణను పాటించడంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు సైతం భారత దేశ ఆర్థిక నిర్వహణను, రుణ నిర్వహణా విధానాలను ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే 2030 నాటికి జాతీయ రుణాన్ని స్థూల దేశీయోత్పత్తిలో 50 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతోందన్నారు.
ఇదీ చదవండి: గాంధీజీ ‘ఐదో కుమారుడు’.. రూ.14 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం


