'నేను అబ్బాయిని... బస్సు కింద పడి చనిపోయా..' చిన్నారి మాటలతో.. | Funday Mystic World Story On Purnima Ekanayake Reincarnation Mystery | Sakshi
Sakshi News home page

'నేను అబ్బాయిని... బస్సు కింద పడి చనిపోయా..' చిన్నారి మాటలతో..

Oct 25 2026 10:21 AM | Updated on Oct 25 2026 10:21 AM

Funday Mystic World Story On Purnima Ekanayake Reincarnation Mystery

ఫండే

మిస్టిక్‌ వరల్డ్‌

1990– శ్రీలంకలోని బకామూనా ప్రాంతం.
మూడేళ్ల పూర్ణిమా ఏకనాయకేకు ఆమె తల్లి జడలు వేస్తోంది. ‘అమ్మా! నాకెందుకు ఇలా జడలు వేస్తున్నావ్‌? నేను అబ్బాయిని కదా?’ అని ప్రశ్నించేసరికి తల్లి అవాక్కయింది. ‘నువ్వు అమ్మాయివి. అందుకే జడలు వేస్తున్నా’ అని ఎంత చెప్పినా ఆ చిన్నారి వినిపించుకోలేదు. ఇదే క్రమంలో ఓరోజు ‘నేను అబ్బాయినే. అగర్‌బత్తీలు తయారుచేసేవాడిని. నాకు వేరే కుటుంబం ఉంది. ఓ రోజు బస్సు కింద పడి చనిపోయాను’ అని చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు.

ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించిన పూర్ణిమ మాటలు అక్కడితో ఆగలేదు. తాను తయారు చేసే అగరబత్తుల పేర్లను కూడా చెప్పింది. అగరబత్తుల తయారీ కేంద్రం ఇటుకల బట్టీ, చెరువు దగ్గర ఉండేదని వివరించింది. తమ వద్ద రెండు వ్యాన్లు, ఒక కారు ఉండేవని కూడా చెప్పింది. తనకు భార్య ఉందని, ఆమె పేరు కుసుమి అని, తల్లిపేరు సిమోనా అని, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని తెలిపింది. ఒక చిన్నారి ఇంత వివరంగా ఒక తెలియని జీవితం గురించి మాట్లాడటం కుటుంబ సభ్యుల్లో ఆసక్తిని కలిగించింది. కానీ ఆమె చెబుతున్న వ్యక్తి నిజంగా ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు?– ఈ మిస్టరీ వారికి అంతుచిక్కలేదు.

ఒక రోజు పూర్ణిమ టీవీ చూస్తుండగా, అందులో శ్రీలంకలోని ప్రసిద్ధ కెలనియా దేవాలయం గురించి కార్యక్రమం ప్రసారమైంది. ఆ దేవాలయాన్ని చూసిన పూర్ణిమ గట్టిగా అరుస్తూ, ‘నాకు ఈ ప్రదేశం తెలుసు. నేను ఇక్కడే ఉండేదాన్ని. నది అవతల’ అని చెప్పింది. ఆ ప్రాంతం వారు ఉంటున్న ఊరికి దూరంగా ఉంది. ఇదే సమయంలో పూర్ణిమ తండ్రి పనిచేస్తున్న పాఠశాలకు సుమనసిరి అనే కొత్త ఉపాధ్యాయుడు వచ్చారు. అతనిది కెలనియా ప్రాంతమే. దీంతో ఈ విషయాన్ని పూర్ణిమ తండ్రి ఆయనకు చెప్పాడు. 

దీంతో సుమనసిరి– కెలనియా నది అవతలి ప్రాంతంలో అగరబత్తులు తయారు చేసే కుటుంబాల గురించి ఆరా తీశారు. రెండు చిన్న కుటుంబ వ్యాపారాల గురించి సమాచారం లభించింది. వాటిలో ఒక కుటుంబం అగరబత్తులు తయారు చేసేది. ఆ కుటుంబంలో జినదాస పెరేరా అనే వ్యక్తి ఉన్నాడని తెలిసింది. ఓ రోజు సైకిల్‌పై అగరబత్తులు తీసుకుని మార్కెట్‌కు వెళ్తుండగా బస్సు ఢీకొట్టడంతో చనిపోయాడని, ఈ ప్రమాదం పూర్ణిమ పుట్టడానికి రెండేళ్ల ముందు 1985లో జరిగిందని సుమనసిరి తెలుసుకున్నారు. పూర్ణిమ చెప్పిన రెండు అగరబత్తుల బ్రాండ్లు కూడా అవేనని గుర్తించారు.

అనంతరం పూర్ణిమను ఆమె తల్లిదండ్రులు జినదాస కుటుంబం వద్దకు తీసుకెళ్లారు. ముందుగా ఆ కుటుంబంలోని కొందరిని చూసిన ఆమె– విజయసిరిని గుర్తించి, ఆయన తనకు బావమరిది అని చెప్పింది. అగరబత్తుల వ్యాపారానికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. విజయసిరికి గతంలో జరిగిన ఒక మోకాలి ప్రమాదం గురించి కూడా చెప్పడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ విషయం పునర్జన్మలపై పరిశోధనలు చేస్తున్న ఎర్లెండూర్‌ హరాల్డ్‌సన్‌ చెంతకు చేరింది. దీంతో ఆయన ఈ కేసును పరిశోధించారు. ముందుగా రెండు కుటుంబాల మధ్య ముందు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణకు వచ్చారు. పూర్ణిమ చెప్పిన గతజన్మ వివరాలకు సంబంధించిన మొత్తం ఇరవై అంశాల్లో పద్నాలుగు అంశాలు సరిపోయినట్టు ధ్రువీకరించారు. మూడు అంశాలు తప్పుగా ఉన్నాయని, మరో మూడింటి విషయంలో స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయామని పేర్కొన్నారు. 

అయితే ఈ కేసులో హరాల్డ్‌సన్‌ ను అత్యంత ఆశ్చర్యపరచిన అంశం మరొకటి. అది పూర్ణిమ చెప్పిన మాటలు కాదు, ఆమె శరీరంపై ఉన్న పుట్టు మచ్చలు. పూర్ణిమ పుట్టినప్పటి నుంచే ఆమె ఛాతీ, ఎడమ వైపు పక్కటెముకల ప్రాంతంలో ప్రత్యేకమైన మచ్చలు ఉన్నాయి. జినదాస పోస్టుమార్టం నివేదికను హరాల్డ్‌సన్‌  పరిశీలించగా, బస్సు చక్రం అతని ఎడమ ఛాతీ భాగంపై నుంచి వెళ్లడంతో ఎడమ వైపు పక్కటెముకలు విరిగి, అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలైనట్లు ఉంది. జినదాస మరణ సమయంలో అతని శరీరంపై ఏర్పడిన గాయాల స్థానంలో పూర్ణిమ పుట్టుకతో ఉన్న మచ్చల ప్రాంతం పోలి ఉందని హరాల్డ్‌సన్‌  నిర్ధారించారు.

పూర్ణిమ చెప్పిన విషయాల్లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. తాను ప్రమాదంలో మరణించిన తర్వాత కొంతకాలం చీకటిలాంటి ప్రదేశంలో తేలుతూ ఉన్నానని చెప్పింది. తన కోసం కుటుంబ సభ్యులు ఏడుస్తున్నట్లు, అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తన శరీరాన్ని చూస్తున్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఒక వెలుగు కనిపించిందని, తరువాత తాను ప్రస్తుత జీవితంలోకి వచ్చానని వివరించింది. 

దూర ప్రాంతంలో జీవించిన ఓ వ్యక్తి గురించి మూడేళ్ల చిన్నారికి ఇంత నిర్దిష్టమైన వివరాలు ఎలా తెలిశాయి? మరణ గాయాలకు పోలిన పుట్టుక మచ్చలు ఎలా వచ్చాయి? ఇవన్నీ పునర్జన్మకు ఆధారాలేనా? లేక ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని మరో మానసిక లేదా సామాజిక ప్రక్రియ ఏదైనా ఉందా? పూర్ణిమా ఏకనాయకే కేసుకు కచ్చితమైన సమాధానం ఏదైనా కావచ్చు. కానీ ఓ మూడేళ్ల చిన్నారి చెప్పిన మాటలు అప్పటికే ముగిసిపోయిన ఓ మనిషి జీవితం మళ్లీ తెరపైకి రావడం వల్ల ఈ కేసు పునర్జన్మపై జరిగిన పరిశోధనల్లో ఒక అసాధారణ అధ్యాయంగా మిగిలిపోయింది.

- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

ఇదీ చదవండి: వామ్మో.. ఏడాదికి ఒక్కసారే స్నానం! విడాకులు ఇప్పించండి సారూ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement