వామ్మో.. ఏడాదికి ఒక్కసారే స్నానం! విడాకులు ఇప్పించండి సారూ!! | Divorce Cases Personal Hygiene Marriage Problems | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఏడాదికి ఒక్కసారే స్నానం! విడాకులు ఇప్పించండి సారూ!!

Oct 25 2026 9:30 AM | Updated on Oct 25 2026 10:23 AM

Divorce Cases Personal Hygiene Marriage Problems

ఫండే

లీగలాటా

వరకట్న వేధింపులు.. అత్తింటి సాధింపులు లేవు; సూటి పోటి మాటలు అసలే లేవు; ఆస్తి తగాదాలు, కూర బాగాలేదని, చెప్పింది వండలేదని  శారీరక హింస లేనే లేవు; భార్యపై భర్తకు, భర్తపై భార్యకు అనుమానాలు– ఇవేవీ ఆ మూడు కుటుంబాల్లోనూ కనిపించవుఅయినా వారు కలిసి ఉండలేమని భీష్మించారు. విడాకులు ఇప్పించాలని అభ్యర్థించారు. వీటికి మించిన సమస్య ఎదుర్కొంటున్నామని, కలిసి కాపురం చేయలేమని వాపోయారు. ఇంతకీ వారు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏంటి? అది వింటే మొదట నవ్వొస్తుంది. తర్వాత విసుగొస్తుంది. చివరికి వారడిగింది సబబే అనిపిస్తుంది. ఇంతకీ ఏంటది? అదే ఈ వారం ‘లీగలాటా!

మీరు రోజూ పళ్లు తోముకుంటారా? ప్రతి రోజూ స్నానం చేస్తారా? ఇవేం ప్రశ్నలు ఇవన్నీ రోజూ అందరూ చేసేవేగా అంటారా? అయితే తైవాన్‌లో ఓ మహిళ ఏడాదికోసారే స్నానం చేస్తుంది. మూడ్‌  బాగున్న రోజు పళ్లు తోముకుంటుంది.. ఎప్పుడైనా చేయాలనుకుంటే తలస్నానం చేస్తుంది. దీనితో ఆమె భర్త కోర్టు మెట్లెక్కాడు. ఆమె నిర్ణయాలు, ఆలోచనలు కూడా భయానకంగా ఉన్నాయని, వేధింపులకు గురి చేస్తోందని వాపోయాడు. విడాకులు మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించాడు.

అప్పట్లో వారానికో సారి..
తైవాన్‌కు చెందిన మహిళ లిన్‌(ఇంటిపేరు), ఓ వ్యక్తి(పేరు వెల్లడించలేదు) ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ సమయంలో ఒకరి అలవాట్లు మరొకరికి తెలిశాయి.. ఆమె వారానికొక్కసారే స్నానం చేస్తుందని గుర్తించాడు. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంటుందని అర్థమైంది. పెళ్లయ్యకా మారుతుందని సరిపెట్టుకున్నాడు. కానీ, అపరిశుభ్రత మరింత పెరిగింది. వారం కాస్తా నెల రోజులైంది... తరువాత ఆరునెలలు... మెల్లగా ఏడాదికి జరిపింది. ఏడాదికి  ఒక్కసారే స్నానం... చేయాలనుకున్నప్పుడు పళ్లు తోముకోవడం, బుద్ధి పుడితే తలంటు స్నానం. దీంతో విసిగిపోయిన భర్త తైవాన్‌లోని న్యూ తైపీ సిటీ జిల్లా కోర్టులో విడాకుల కేసు దాఖలు చేశాడు.

స్పందించకపోవడం వల్లే..
వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంతో పాటు పెళ్లై పదేళ్లయిన పిల్లలు లేరని వాపోయాడు. భర్త  ఆరోపణలను భార్య లిన్‌ ఖండించింది. తమ వైవాహిక జీవితానికి సంబంధించి భర్త తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించింది. తన తల్లిదండ్రులు అతడ్ని కన్న కొడుకులా చూసుకుంటున్నారని పేర్కొంది. ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడం వల్లే ఆఫీసుకు వెళ్లి గొడవ చేసినట్టు వివరించింది.

కోర్టు తీర్పు ఇలా..
వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, రెండేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగా ఉండడం, వారి మధ్య వ్యక్తిగత విభేదాలు..వీటన్నిటినీ కోర్టు పరిశీలించింది. భర్త ఉద్యోగం చేసే ప్రాంతానికి సైతం వెళ్లి గొడవ చేయడాన్ని మానసిక క్రూరత్వంగా పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భర్త పిటిషన్‌ను అంగీకరిస్తూ వారికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అప్పీలుకు అవకాశం కల్పించింది.

--

  • పెళ్లయి 40 రోజులు.. విడాకులు కోరిన భార్య
    వీలు కుదరనప్పుడో, సమయం సరిపోకో కొంతమంది  స్నానం చేయకుండా సెంటో, బాడీ స్ప్రే కొడుతుంటారు. దుర్వాసన రాకుండా కవర్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడు. వారినికోసారి మాత్రం గంగాజలం చల్లుకుంటాడు. దీంతో అతని భార్య విసిగిపోయింది. దుర్వాసన భరించలేకపోయింది. పెళ్లయిన 40 రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది.

తనకు విడాకులు కావాలంటూ ఆగ్రాలోని కుటుంబ కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఆశ్రయించింది. సెంటర్‌ నిర్వాహకులు భర్తను పిలిపించి ప్రశ్నించారు.‘ తనకు నెలకొక్కసారే స్నానం చేసే అలవాటు ఉన్నా భార్య ఒత్తిడి భరించలేక ఈ 40 రోజుల్లో ఆరు సార్లు స్నానం చేశానని  చెప్పాడు. చివరికి కేసు పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. పరిశుభ్రంగా ఉంటానని, రోజూ స్నానం చేస్తానని భర్త అంగీకరించాడు. అయితే అతనితో కలిసి ఉండడానికి భార్య మాత్రం ససేమిరా అనడంతో మరోసారి కౌనెల్సింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. చివరికి ఇది ఏ మలుపు తీసుకుంటుందో!

  • గడ్డం గీయడు... స్నానం చేయడు
    తన భర్త  రోజూ గడ్డం గీయడు; పళ్లు తోమడు; స్నానం చేయడు; మర్యాద, మన్నన తెలియదని, అతడి దుర్వాసనను భరించలేక పోతున్నానని, వ్యవహారశైలితో విసిగిపోయానని, విడాకులు ఇప్పించాలని బీహార్‌లోని వైశాలికి చెందిన ఓ భార్య మహిళా కమీషన్‌ను వేడుకుంది. వృత్తి రీత్యా ప్లంబర్‌ అయిన మనీష్‌కుమార్‌కు  సోనీ అనే యువతితో వివాహం అయింది.

మూడేళ్లు గడిచాయి. భర్త తీరు నచ్చక ఆమె కమిషన్‌ను ఆశ్రయించింది. వివాహబంధాన్ని తెంచుకోవద్దని, భర్త ప్రవర్తనలో మార్పు తేవాలని కమిషన్‌ సూచించింది. మనీష్‌కుమార్‌ తన ప్రవర్తనను మార్చుకోవడానికి మహిళా కమీషన్‌ రెండు నెలలు సమయం ఇచ్చింది. మార్పు రాకపోతే కేసు ఫ్యామిలీ కోర్టుకు పంపుతామని పేర్కొంది.

- దిలీప్‌ మాదిరెడ్డి

ఇదీ చదవండి: స్నేహితులారా.. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement