స్నేహితులారా.. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండండి! | Funday Children's Story On Bad Friendship Monkey Moral Story | Sakshi
Sakshi News home page

స్నేహితులారా.. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండండి!

Oct 25 2026 8:34 AM | Updated on Oct 25 2026 8:34 AM

Funday Children's Story On Bad Friendship Monkey Moral Story

ఫండే

పిల్లల కథ

అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అంజి అనే కోతిపిల్ల ఉండేది. అది చాలా అల్లరి కోతిపిల్ల. అది పెద్దల మాటలు వినేదికాదు. తుంటరి పనులు చేస్తూ తిట్లు, దెబ్బలు తినేది. అంజి వెంట దాని స్నేహితులు ఏనుగు పిల్ల, ఎలుగుబంటి పిల్ల కూడా తిరిగేవి. కానీ ఇతర జంతువులను ఆటపట్టించేవి కాదు.

అవి మూడు కలిసి ప్రతిరోజు ఉదయం ఆహారం కోసం కలిసి తిరిగేవి.
ఒకరోజు ఉదయం అవి మూడు కలిసి అడవిలో తిరుగుతుండగా ఒక నక్క ఎదురు పడింది. 
‘ఏం అల్లుళ్లూ! పొద్దున్నే చెరువు వైపు పోతున్నారూ!?’ అడిగింది నక్క.
‘స్నానానికి మామా!’ అన్నాయి
ఏనుగు పిల్ల, ఎలుగు పిల్ల. కానీ అంజి– నక్క తోక వెనుక నుంచి లాగి ఎగిరి చెట్టు కొమ్మ మీద కూర్చుని ‘ఎక్కడికి పోతే నీకెందుకు. నువ్వెక్కడకు పోతున్నావో మేమడిగామా!?’ అంది. దాంతో నక్కకు కోపం వచ్చి మూడింటినీ తరిమింది. అవి తప్పించుకుని పారిపోయాయి.

అవి మూడు చెరువులో స్నానం చేస్తుండగా మొసలి వచ్చింది. 
‘ఏం అల్లుళ్లూ! ఇటు రావటమే మానేశారు. స్నానం చేసి ఎన్ని వారాలైంది!?’ అని పలకరించింది. 
ఏనుగు పిల్ల, ఎలుగుపిల్ల ‘వస్తూనే ఉన్నాం మామా! నువ్వు అవతలి ఒడ్డున ఉంటున్నావు!’ అన్నాయి. అంజి ఒడ్డున ఉన్న రాయి అందుకుని, ‘అసలు స్నానం చెయ్యం. నువ్వెవరు అడగటానికి!?’ అని మొసలి మీదకు విసిరింది. 
అది కోపంతో మూడింటినీ చెరువులోంచి ఉరికించింది.
అవి మూడూ పరిగెత్తి వెళ్లి, మామిడి చెట్టుని చేరుకున్నాయి.

అంజి ‘మీరు కింద కూర్చోండి నేను మీకు తియ్యటి పండ్లు తెస్తాను!’ అని చెట్టెక్కింది. 
చెట్టు కింద పడిన పండ్లను తినటానికి చీమలొచ్చాయి. అందులో ఒక చీమ ఏనుగు పిల్లను కుట్టింది. వెంటనే కుట్టిన దాంతో పాటు అక్కడే ఉన్న చీమలను నలిపేసింది ఏనుగు పిల్ల. అక్కడే ఉన్న చీమలరాజు ‘నిన్ను కుట్టింది ఒక్క చీమే కదా! కానీ మిగతా చీమలన్నిటినీ ఎందుకు బలి చేస్తున్నావూ!?’ అని అడిగింది.
‘చెడ్డ చీమతో కలిసి ఉన్నందుకు... శిక్ష అన్నిటికీ పడింది!’ అంది ఏనుగు పిల్ల.

అంతలో మృగరాజు సింహం అటుగా వచ్చింది. ‘నేను సింహం మీదకు మామిడి పళ్లు విసురుతాను. దెబ్బకు పారిపోతుంది చూడండి!’ చెట్టు మీద నుంచి అంది అంజి. 
‘మిత్రమా! మనం మంచిగవున్నా, అంజితో కలిసి తిరిగితే నీ చేతిలో తప్పు చేయని చీమలు బలైనట్టు మనం మృగరాజు చేతిలో చావటం ఖాయం!’ అంది ఎలుగు పిల్ల.
దుష్టులకు దూరంగా ఉండటమే మేలని గ్రహించి అవి అంజిని విడిచి అక్కడినుంచి వెళ్లి పోయాయి.
- శ్రావ్య అవధానుల

హితవచనం..
'ఉపకారో హి నీచానాం అపకారో హి జాయతే
పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనమ్‌'
     - నీచుడికి ఉపకారం చేస్తే, అది అపకారంగా పరిణమిస్తుంది. పాముకు పాలు పోస్తే, దాని విషం మరింత పెరుగుతుంది.

ఇదీ చదవండి: పామరుడి నుంచి పండితుడిగా.. గురుభక్తితో సాధ్యమైన అద్భుతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement