ఫండే
భక్త విజయం
దుర్వాసుడు ఒకసారి శిష్యసమేతంగా దట్టమైన అడవి దారిలో ప్రయాణించసాగాడు. చాలాదూరం నడిచాక దుర్వాసుడు, ఆయన శిష్యులు బాగా అలసిపోయారు. దరిదాపుల్లో ఏదైనా గ్రామం గాని, నగరం గాని ఉన్న జాడల్లేవు. కనీసం దప్పిక తీర్చుకుందామనుకుంటే, కనుచూపు మేరలో తటాకమైనా లేదు.
దుర్వాసుడు, ఆయన శిష్యులు మరికొంత దూరం ముందుకు నడిచారు. కొంత నడక తర్వాత వారికి ఒక పూరిగుడిసె లాంటి ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో ఒక శబర తాపసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. దుర్వాసుడు, ఆయన శిష్యుల రాక వల్ల ఏర్పడిన అలికిడికి శబర తాపసుడు ధ్యానం నుంచి తేరుకుని, ఆశ్రమం గుమ్మం వద్దకు వచ్చాడు. ఎదురుగా దుర్వాసుడు శిష్యసమేతంగా కనిపించాడు. శబర తాపసుడు ఆనందపరవశుడై, దుర్వాసుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు.
‘మహానుభావా! నా పూర్వజన్మ సుకృతం వల్ల నేడు మీ దర్శనభాగ్యం కలిగింది’ అంటూ ఆహ్వానం పలికాడు. దుర్వాసుడికి, ఆయన శిష్యులకు అర్ఘ్యపాద్యాలు సమర్పించి, తన ఆతిథ్యం స్వీకరించాలని అభ్యర్థించాడు.
దుర్వాసుడు సరేనన్నాడు.
దుర్వాసుడికి, ఆయన శిష్యబృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి శబర తాపసుడు ప్రార్థించగా, అశరీరవాణి అతడికి ఒక అపూర్వమణిని ఇచ్చింది. ఆ మణి నుంచి వందలాదిగా తరుణులు పుట్టుకొచ్చి, నిమిషాల్లో అతిథులందరికీ కావలసిన పంచభక్ష్య పరమాన్నాలను సిద్ధం చేశారు.
శబర తాపసుడు దుర్వాసుడిని భోజనానికి రమ్మని పిలిచాడు.
భోజనానికి ముందు తాను సంధ్య వార్చుకోవాలని, అందుకోసం జలం కావాలని అడిగాడు దుర్వాసుడు.
దుర్వాసుడి కోసం శబర తాపసుడు తన తపో మహిమతో దేవికా నదిని నేరుగా దుర్వాసుడి వద్దకు రప్పించాడు. దుర్వాసుడు, ఆయన శిష్యులు స్నానాలు చేసి, సంధ్యావందనం పూర్తి చేసుకున్నారు. తర్వాత శబర తాపసుడికి ఆశ్రమం లోపలికి వచ్చి, సుష్టుగా భోజనాలు చేశారు.
శబర తాపసుడి ఆతిథ్యానికి దుర్వాసుడు సంతుష్టుడయ్యాడు.
శబర తాపసుడికి ఇంతటి మహిమ ఎలా వచ్చిందంటే, చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో పడి అరణి మహర్షిని ఆశ్రయించాడు. అరణి మహర్షి ఆదేశంతో గురుచరణాలనే ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించాడు. ఘోర తపస్సు ఫలితంగా సమస్త ప్రకృతి అతడికి వశమైంది.
దుర్వాసుడు దివ్యదృష్టితో ఇదంతా గ్రహించాడు.
శబరుని పిలిచి, ‘ఓ శబరా! నువ్వు గురూపదేశంతో సత్యనిష్ఠతో తపస్సు చేశావు. నీ తపస్సు సఫలమైంది. ఈనాటి నుంచి నువ్వు ‘సత్యతపుడు’ అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు. వేద శాస్త్ర పురాణేతిహాసాలలోని పాండిత్యమంతా నీకు అబ్బుతుంది.’ అని దీవించాడు.
‘మహాత్మా! నేను పామరుడైన శబరుడిని. నాకు అప్రయత్నంగా జ్ఞానం ఎలా అబ్బుతుంది?’ అని ప్రశ్నించాడు శబర తాపసుడు.
‘సత్యతపా! నీ తపస్సు కారణంగా నీ పూర్వ శరీరస్వభావం నశించింది. నీ పూర్వపు అజ్ఞానం తొలగిపోయింది. నీ అంతఃకరణం నిర్మలమైంది. వివేకం, సుజ్ఞానం, సత్కర్మ, భగవదారాధన, వ్రతాచరణ– వీటి ద్వారా మనిషి ఉన్నతుడవుతాడు. గురుభక్తితో చేసిన తపస్సు ఫలించి నువ్వు ఉన్నతుడివయ్యావు. అందువల్ల వేద శాస్త్రాదులన్నీ నీకు స్వయంగా స్ఫురిస్తాయి.’ అని పలికాడు దుర్వాసుడు.
అంతేకాకుండా, దుర్వాసుడు అతడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. పరమ రహస్యమైన మంత్రాలను ఉపదేశించి, హిమాలయాలకు వెళ్లి, ఆ మంత్రాలను జపిస్తూ తపస్సు చేసుకోమని మార్గనిర్దేశనం చేశాడు. దుర్వాసుడి నిర్దేశంతో సత్యతపుడు హిమాలయాలకు బయలుదేరాడు.
- సాంఖ్యాయన
పురావిశేషం..
పలుచోట్ల అమ్మవారి ఆలయాల్లో బలులు ఇవ్వడం మామూలే! బిహార్‌లోని ముండేశ్వరి ఆలయంలో జంతుబలి మిగిలిన ఆలయాల కంటే భిన్నంగా జరుగుతుంది. ఇది అహింసా బలి. ఇందులో బలి కోసం తీసుకువచ్చిన మూగజీవాలను వధించరు. మొక్కులు ఉన్నవారు ఇక్కడికి సాధారణంగా మేకపోతులను తీసుకువస్తుంటారు. వారు తీసుకువచ్చే మేకపోతులపై ఆలయ పూజారి అక్షతలను, పువ్వులను, తీర్థ జలాన్ని చల్లుతారు. వీటిని చల్లిన వెంటనే మేకపోతు మూర్ఛపోయి, కొద్ది నిమిషాల్లో తేరుకుంటుంది. ఆ తర్వాత ఆ మేకపోతును స్వేచ్ఛగా విడిచిపెట్టేస్తారు. ఈ అహింసాబలి ఆచారం ఉన్న ఆలయం దేశంలో ఇదొక్కటి మాత్రమే!
ఇదీ చదవండి: 'నోబెల్' బెట్టింగుల్లో డేంజర్ బెల్స్!


