ఫండే
కవర్ స్టోరీ
ఈ ఏడాది నోబెల్ సాహిత్యపురస్కారం కెనడియన్ కవయిత్రి యాన్ కార్సన్‌కు దక్కింది. అక్టోబర్ 8న ఈ పురస్కార ప్రకటనకు కొద్దిరోజుల ముందు నుంచే బుక్కీల హడావుడి మొదలైంది. దాదాపు అరడజను మంది సాహితీవేత్తల పేర్లు బుక్కీల అంచనాల్లో బలంగా వినిపించాయి. పందెం రాయుళ్లు వీరిపై భారీ స్థాయిలు బెట్టింగులకు దిగారు. బుక్కీలు ఈసారి అంచనా వేసిన వారిలో చైనీస్ రచయిత్రి చాన్ ష్యూహ్, జపానీస్ రచయిత హరూషీ మురకామి పేర్లు ప్రధానంగా వినిపించాయి.
యాన్ కార్సన్‌కు సాటి కెనడియన్ సీనియర్ రచయిత్రి మార్గరెట్ యాట్‌వుడ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురైంది. తనకు నోబెల్ బహుమతి ప్రకటించిన విషయాన్ని యాన్ కార్సన్ తొలుత నమ్మలేదు సరికదా, దీనిపై తనకు అభినందలు చెబుతూ ఫోన్‌కాల్స్ చేసిన సన్నిహితులకు ‘మీకు మతిపోయినట్లుంది’ అని కూడా వ్యాఖ్యానించారు. అయితే, బుక్కీల జాబితాలో కార్సన్ పేరు రెండో స్థానంలో నిలిచినట్లు సమాచారం. నోబెల్ బహుమతి ఎవరికి దక్కుతుందనే దానిపై బెట్టింగులు ఇటీవలి ధోరణి కాదు, దాదాపు నలభయ్యేళ్లుగా ఈ ద్యూతక్రీడ సాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో మరింత ప్రబలింది.
ఆధునిక, నాగరిక దేశాలు కొన్ని, పేకాట–లాటరీలూ–మట్కా– తదితర రూపాల్లోని జూదాన్ని ఒక మేరకు నిషేధించాయి. మరి కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో జూదం నిషిద్ధం కాగా, పొరుగునే వున్న ప్రాంతాలు జూదరుల ద్యూతార్తిని యథాశక్తి తీరుస్తూనే వున్నాయి. కానీ, ఇప్పటికీ 48 దేశాల్లో జూదర్లు భారీ మొత్తంలో బెట్టింగులు అనే పందేలను బాహాటంగానే కాస్తూ వున్నారు. క్రికెట్, సాకర్, టెన్నిస్ (ముఖ్యంగా వింబుల్డన్ ఓపెన్ లాంటి పోటీలు), బేస్‌బాల్, ఐస్ హాకీ లాంటి ఆటల్లో ప్రపంచ కప్ పోటీల విషయంలో బెట్టింగులను ఆపేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నమూ జరగలేదు– కొద్దోగొప్పో ప్రయత్నించిన చోట సత్ఫలితమూ సాధ్యం కాలేదు!
ఇక తెలుగువారి విషయమే తీసుకోండి– సంక్రాంతి లాంటి కొన్ని పండగల సందర్భంగా జరిగే కోడిపందేల్లో జూదాన్ని నివారించలేక పోతున్నారనేది ఓ చేదునిజం. దిల్లీ– ముంబై– కోల్‌కాతా– హైదరాబాద్– చెన్నై– ఊటీ– బెంగళూరు తదితర పెద్దపెద్ద నగరాల్లో గుర్రప్పందేలూ జరుగుతూనే వున్నాయి. అవి చాలనట్లు కొన్ని పట్టణాలూ, నగరాల్లో పేకాట క్లబ్బులు మూయించేసిన తర్వాత, జూదం శివార్లకు పోయి తలదాచుకుందే తప్ప అంతరించిపోలేదు.
ఆన్‌లైన్ బెట్టింగులను అదుపు చేసే శక్తి ఏ రాజ్యానికీ లేదని పదేపదే రుజువవుతూనే వుంది! ఇక ఉన్నమాట చెప్పాలంటే, క్యాసినోలూ, గాంబ్లింగ్ డెన్‌లూ, జూదగృహాలను మూయించేందుకు ఏ దేశంలోనూ చిత్తశుద్ధితో ప్రయత్నం జరగలేదనే చెప్పాలి. అందుకు ఒక కారణం అందరికీ తెలిసిందే– ప్రజాజీవనంలో ప్రముఖపాత్ర వహించే నాయకుల కనుసన్నల్లోనే ఈ జూదపుటిళ్ళ నిర్వహణ జరగడం వల్లనే ఎక్కడా వాటిని నియంత్రించలేక పోతున్నారు! అంతకుమించి, ఈ ద్యూతవ్యసనం కొత్తకొత్త పోటీలకూ రంగాలకూ వ్యాపిస్తోంది. వాటిల్లో నోబెల్ సాహిత్యపురస్కారం లాంటివి కూడా చేరడం దురదృష్టకరం.
రాతియుగం నాటి ఆట
జూదం లేదా పాచికలాట అనే అక్షక్రీడ వేల యేళ్ళుగా– పాత రాతియుగం నుంచీ– అమల్లో వున్నదేనని చరిత్ర చెప్తోంది. పాచికలాట గురించి ప్రస్తావించే ఋగ్వేద సూక్తం సుప్రసిద్ధం. అక్షక్రీడ దుష్ఫలితాలు కుటుంబ జీవితాన్నీ, సామాజిక గౌరవాన్నీ ఎంతగా దిగజారుస్తాయో ఋగ్వేదం – పదో మండలంలోని, 34వ సూక్తం– జూదగాడి మాటల్లోనే– మన ముందుంచింది. (అందుకే ఈ సూక్తానికి ‘పందెగాడి ప్రలాపం’ అనేది మరో పేరు!) ఇక, ‘జూదపుసిరి యాసపడం గాదని విదురుండు సెప్పంగా నప్పుడు, కర్ణాదుల పలుకులు విని పతి యాదరణము సేయలే’దని ధర్మరాజు చేత ‘ఆంధ్ర మహాభారతం ఉద్యోగపర్వం’లో తిక్కన చెప్పించిన పద్యం సుప్రసిద్ధమే కదా! ‘తెలుగువారి మహాభారతం’గా చెప్పుకునే ‘పల్నాటి వీరచరిత్ర’లో కూడా పందెపుకోళ్ళ యుద్ధక్రీడ గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. ఇవన్నీ మానవ చరిత్రలో జూదం ఎంత లోతుగా పాతుకుపోయిందో చాటి చెప్తున్నాయి.
గతకాలపు ఋషులూ, దార్శనికులూ మొదలుకొని నిన్నమొన్నటి మేధావుల వరకూ ప్రతి ఒక్కరూ జూదం వల్ల మానవ సమాజానికి జరిగే హాని ఎంతటిదో దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో హెచ్చరిస్తూనే వున్నారు– కానీ, జరిగేది జరుగుతూనే వుంది! సాంస్కృతిక పతనోత్థానాల పరిభాషలో దీని గురించి మాట్లాడడం భావ్యం కాదు– పాపం ఎన్ని సుకుమార హృదయాలు గాయపడతాయో అలా చేస్తే! అయితే జూదంపట్ల పేరుకుపోయిన ఈ ప్రేమ, సాహిత్యాది కళారూపాల వరకూ పాకినప్పుడు, ఆ పరిణామం గురించి మరే భాషలో మాట్లాడగలం? డొంక తిరుగుడు ఎందుకు గాని, మనం ప్రస్తావించుకుంటున్నది నోబెల్ సాహిత్యపురస్కారం విషయంలో ప్రబలిన ‘బెట్టింగు’ దురాచారం గురించే!
రాతియుగం నాటి పాచికలు
భాషలు వేరు.. జూదం ఒకటే!
అనిశ్చిత ఫలితం ఆధారంగా పందెం కాయడాన్ని తెలుగులో జూదం అంటారని మనకి తెలుసు. ఈ ‘పందెం‘ అనేది ఏ ప్రతిఫలమూ ఆశించకుండా చేసేది కాదు! జూదర్లు కాసే ప్రతి పందెంలోనూ ఆర్థిక పరమైన లాభనష్టాలు దాంకుని వుంటాయి. ఈ జూదాన్నే దేవభాష సంస్కృతంలో ‘ద్యూతం’ అంటారు. ఇంగ్లిష్ వాళ్ళు దాన్నే ‘గ్యాంబ్లింగ్’ అంటారు. (ఆధునిక వ్యవహారంలో దాన్నే ‘బెట్టింగ్’ అంటున్నార్లెండి!) జూదర్లుగా ప్రపంచ ప్రసిద్ధులైన ఫ్రెంచ్ జాతీయులు జూదాన్ని చట్టబద్ధం చేసుకున్నారు! వాళ్ళలో, సగానికి సగం మందికి జూదం నిత్యకృత్యమట! పేకాట తదితర ‘క్రీడ’లను, ఫ్రెంచ్ వారు ముద్దుగా ‘స్కిల్ గేమ్స్’గా వ్యవహరించడం చూస్తే జూదమంటే వారికి ఎంత ఇష్టమో తెలియడంలేదూ! జూదాన్ని ఫ్రెంచ్ భాషలో ‘జ్షుదా జ్షాన్‘ అంటారట. రష్యన్ భాషలో జూదాన్ని ‘ఇగోర్నియ్’ అంటారట; చైనీస్ అదే జూదాన్ని ‘దూ షాంగ్‘ అంటారు. మాటలు మారినా భావం ఒకటే!– వాడుక మారినప్పటికీ, ‘వ్యవహారం’ ఒకటే!!
అనిశ్చితికి అవకాశం!
సాధారణంగా, ఏ పోటీలోనైనా ఫలితంపై ఎంతో కొంత ‘అనిశ్చితి’ ఉండి తీరుతుంది. అదే, జూదం అందులో దూరిపోవడానికి అవకాశం కల్పిసుంది. ఉత్తమ సాహిత్యానికిచ్చే నోబెల్ ప్రైజ్ విషయానికి వస్తే, ఈ అనిశ్చితికి మూలం స్వీడిష్ ఎకాడెమీ నిబంధనల్లోనే ఉంది. నోబెల్ పురస్కారాలకు సంబంధించిన సిఫారసుల క్రమం గురించిన వివరాలను, పురస్కార ప్రకటన వెలువడిన 50 యేళ్ళ వరకూ బహిరంగ పరచడానికి వీల్లేదన్నది ఎకాడెమీ నియమం! అంటే, 2026 నోబెల్ సాహిత్య పురస్కారం విషయమై వచ్చిన సిఫారసులకు సంబంధించిన వివరాలు– మరో 50 యేళ్ళవరకూ– అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు! 1895లో ఈ పురస్కారానికి నిధులు కేటాయించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ అనిశ్చితికి అవకాశం కల్పించలేదు.
నోబెల్ పురస్కారాలకు సంబంధించిన విషయంలో తుది నిర్ణయం ఎకాడెమీ వారిదేనని మాత్రమే ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో పేర్కొన్నాడు! అందులో వుండే 18మంది సభ్యులనూ స్వీడన్ రాజు నియమిస్తారు. వారికి తప్పిస్తే, మరెవరికీ సదరు సిఫారసుల క్రమం గురించి తెలిసే అవకాశం లేదు. అదిగో– అక్కడే వుంది, మనమనుకుంటున్న ‘అనిశ్చితికి అవకాశం.’
రాయల్ స్వీడిష్ అకాడమి
ఊహాగానాలా? వేలంపాటలా?!
నోబెల్ పురస్కారాలకు సంబంధించిన బుక్కీల ఊహాగానాలకు ‘మార్కెట్ విలువ’ ఆపాదిస్తున్న అంశాల్లో ఇదొకటి మాత్రమే! ఒక అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం 210 సిఫారసులు జ్యూరీ పరిశీలనార్థం ఎకాడెమీకి చేరతాయి. వాళ్ళలో విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా వున్నాయనే విషయంలో బుక్కీలు రకరకాల ఊహాగానాలు సాగిస్తూ ఉంటారు. వార్తల ఆకలితో అలమటించే పత్రికలూ, టీఆర్పీ రేట్ల పరుగుపందెంలో పడుతూలేస్తూ పోటీ పడే టీవీ చానెళ్ళు ఈ ఊహాగానాలకు తమ తమ సృజనాత్మకతను యథోచితంగా జోడిస్తాయి. దాంతో, ఈ ఊహాగానం కాస్తా వేలంపాట వ్యవహారానికి చేరువ మారుతుంది. ఇలాంటి ‘పోటీ’లో గెల్చిన నోబెల్ సాహిత్య పురస్కార విజేత నెత్తిన, ఎకాడెమీ వారు వెయ్యికోట్లకు మించిన ప్రతిఫలం కుమ్మరించడం, అనిశ్చితికి మరో అవకాశమని నిపుణులు వ్యాఖ్యానిస్తారు.
లెక్కలూ– తిక్కలూ!
‘ద్యూతార్హము కానిదేది భూతలమంతా వెదకిన దొరకదు!’ అనేశాడు ఓ రెడీమేడ్ పేరడీంద్రుడు. ఏ పోటీనైనా జూదంగా మార్చగల లెక్కలు మాత్రం ‘బుక్కీ’ల సొంతం! ఈ లెక్కను ఓ తిక్కగా కొట్టిపారేసేవాళ్ళు కూడా కొందరున్నారు. కానీ, సదరు తిక్కకు సైతం కొన్ని సొంత లెక్కలున్నాయనే అంటారు మరికొందరు నిపుణులు. ఆ మాటకొస్తే, ఈ లెక్క ప్రతి తిక్కకూ వర్తిస్తుంది! అవి క్రికెట్ మ్యాచెసా? సాకర్ మ్యాచెసా? ఎన్నికల ఫలితాలా? లేక, ఈ శతాబ్దిలోనే బెటింగ్ రంగంలో కాలుపెట్టిన నోబెల్ సాహిత్య పురస్కారమా అనేది అలా వుంచండి. ఈ వూహాగానాలకు పునాదులు ‘ఆడ్స్’ అనే తిక్కలెక్కలు.
ముందుగా బుక్కీలు, తమతమ ‘నెట్‌వర్కులు’ అందించే సమాచారం ఆధారంగా, పోటీలో వున్న అభ్యర్థుల విజయావకాశాలను లెక్క వేస్తారు. టెలివిజన్లలో మనం చూసే రియాలిటీ షోల తరహాలోనే, ఈ బుక్కీలు ఒక్కో రచయితనూ ‘ఎలిమినేట్’ చేస్తూ పోతారు. చివరికి ఏ ఏభై మందితోనో, బుక్కీలందరి ఉమ్మడి ‘తుది జాబితా’ రుపొందుతుంది. అక్కడినుంచీ, ఆయా బుక్కీల సొంత ‘తుది జాబితాలు’ రూపుదిద్దుకుంటాయి. స్వీడిష్ ఎకాడెమీ సభ్యులూ, వారి చేతికింద పనిచేసే ఉద్యోగుల సహకారం లేకుండా, ఎకాడెమీల్లోపల జరిగే పరిణామాల గురించి బుక్కీలకు తెలిసె అవకాశం లేదన్నది వాస్తవం.
ఎడ్వార్డ్ థోర్(ప్)
జాతకరత్నాలా? మిడతంభొట్లా?
కొంచెం అటూ యిటూగా ప్రతి పోటీకి ఈ క్రమం వర్తిస్తుంది. ఇప్పటికే బెట్టింగులను ప్రతి ఆటల పోటీకీ, నటకాగ్రేసరుల సినిమాల భవితవ్యానికీ, అన్ని ఎన్నికల ఫలితాలకూ అనుగుణంగా మార్చుకుంటూ వచ్చారు బుక్కీలు. ఆఖరికి నోబెల్ సాహిత్య పురస్కారాలు ఎవరు గెల్చుకోబోతున్నారన్న ఊహాగానాన్ని సైతం తమ జూదానికి వీలుగా మలచుకునేందుకు తెగించారు ఈ బుక్కీలు! ఈ బుక్కీలలో కొందరు మహారచయితల జాతకచక్రాలు వేస్తారని చెప్పుకుంటారు; అలాంటి బుక్కీల జాతకచక్రాలు ఏనాడో నెట్టింట వీరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే!
ప్రపంచ ప్రసిద్ధ ప్రచురణకర్తల ప్రాపకం, ప్రోత్సాహం ఈ బుక్కీల పాలిట ఆక్సిజెన్ సిలిండర్ల లాంటివి. ముఖ్యంగా నోబెల్ శాంతి పురస్కారం, నోబెల్ సాహిత్య పురస్కారాల విషయంలో వీరి ప్రమేయం అతిగా వుంటోందని పాశ్చాత్య సాహిత్య సమాజాల అభిప్రాయం. ‘లోపలిమనుషుల’ సహాయ సహకారాలు లేకపోయినట్టయితే, బుక్కీలనే జాతకరత్నాలు కాస్తా, మిడతంభొట్లుగా మారిపోవడం ఖాయమన్నది ఈ వర్గాల నమ్మకం.
వాదాలూ– వివాదాలూ
ఇరవయ్యో శతాబ్దితో పాటుగానే 1901లో మొదలైన నోబెల్ సాహిత్య పురస్కారం కొన్ని సందర్భాల్లో వాదవివాదాలకు సైతం కారణమైంది. ప్రపంచ ప్రసిద్ధ తాత్త్విక రచయిత జ్షాన్ పాల్ సార్‌త్ర్ 1964లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. అయితే, ఆనాటి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో ఎకాడెమీ వ్యవహార సరళి ఉండవలసినంత నిష్పాక్షికంగా లేదని వ్యాఖ్యానిస్తూ సార్‌త్ర్ ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
ఆ సంఘటన యూరోపియన్ సాహిత్య సమాజంలో పెద్ద కల్లోలాన్నే సృష్టించింది కానీ సార్‌త్ర్ తిరస్కరణ వెనక సాహిత్యేతర కారణాలున్నాయని ఏ ఒక్కరూ అనకపోవడం విశేషం. కానీ ఆ తర్వాత మరో నలుగురు నోబెల్ విజేతల విషయంలో మాత్రం సాహిత్యేతర ప్రాతిపదికలపైనే అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం! ఆ వివరాలు కూడా పరిశీలిద్దాం. ఇవి ప్రత్యక్షంగా బుక్కీల కార్యకలాపాలతో ముడిపడివున్న సందర్భాలు కావు– కాకపోతే, ఉన్నత ఆదర్శాలను ప్రొత్సహించడమనే నోబెల్ లక్ష్యానికి విరుద్ధమైనవని మాత్రం గుర్తుంచుకోవాలి!!
డేరియో ఫో
సార్‌త్ర్ మాట నిజం చేశారు!
ఇటాలియన్ నాటకరంగ చరిత్ర తెలిసినవారికి డేరియో ఫో పేరు తెలియకుండా వుండదు. గొప్ప రూపకకర్త, నటుడు–దర్శకుడు, రంగస్థల రూపకర్త, గీత రచయితగా ఫో ప్రపంచ ప్రసిద్ధుడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశీలి రచనలు 30 భాషల్లోకి అనువాదమయ్యాయి! పాశ్చాత్య ప్రపంచమంతటా ప్రదర్శనలిచ్చిన నటుడాయన. ఫో చేసిన నేరం ఒక్కటే– ఇటలీలో వామపక్ష రాజకీయాలను ఆయన బాహాటంగా సమర్థించాడు! పాశ్చాత్య ప్రపంచం ఆ నేరాన్ని అంత తేలిగ్గా వదిలేయ లేదు– 1997లో స్వీడిష్ ఎకాడెమీ, ఫోకు నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించిన వెంటనే కొందరు విమర్శకులు విరుచుకుపడ్డారు.
వారు సార్ర్‌త్ విమర్శ నిరాధారం కాదని నిరూపించారు! మరో అయిదేళ్ళకు, 2012లో, మో యాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నప్పుడు కూడా, చైనీస్ అసమ్మతివాదులే ఆ నిర్ణయానికి వంకలు పెట్టారు! మరో నాలుగేళ్ళకు, బాబ్ డిలాన్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నప్పుడూ అలాంటి విమర్శలే వినబడ్డాయి. మరో మూడేళ్ళకు పీటర్ హాండ్కె నోబెల్ ప్రైజ్ గెల్చినప్పుడూ అలాంటి విమర్శలే వినవచ్చాయి. ఇవేవీ సాహిత్యపరమైన అభ్యంతరాలు కావు. ప్రజాస్వామ్య ప్రియులమని గొంతెత్తి చెప్పుకునేవారు ప్రకటించిన అసహన భావాలివి!
అతీతులు కారా?
ఈ రెండు సంఘటనలకూ నడుమ 1974లో మరో వివాదం తలెత్తింది. ఐవిండ్ జాన్సన్– హ్యారీ మార్టిన్సన్ అనే ఇద్దరు స్వీడిష్ రచయితలు ఆ యేడాది నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు ఎకాడెమీ ప్రకటించడం పెద్ద కల్లోలాన్నే సృష్టించింది. ఎందుకంటే, ఆ పురస్కారాన్ని ప్రకటించిన ఎకాడెమీలో, ఈ రచయితలిద్దరూ సభ్యులే! ఎకాడెమీ సభ్యులు తమకే పురస్కార ప్రదానం చేసుకోవడంలో ఔచిత్యం లేదని విమర్శకులు ఏకి పారేశారు. అప్పుడు, సన్నసన్నగా, పాశ్చాత్య ప్రచురణకర్తల పనుపున కొందరు సాహిత్య ఏజెంట్లు పనిచేసినందువల్లనే ఈ ఫలితం సాధ్యమైందనే వ్యాఖ్యలు వినవచ్చాయి. అప్పటికి బుక్కీల జోక్యం ఇంకా మొదలు కాలేదనే చెప్పాలి. కానీ, స్వీడిష్ ఎకాడెమీ కూడా లోపాయికారీ వ్యవహారాలకు అతీతమేం కాదనే విమర్శ అప్పుడే తొలిసారి అ(వి)నిపించింది.?
ఐవిండ్ జాన్సన్ - హ్యారీ మార్టిన్సన్
పెద్దల సుద్దులు!
‘అదుపుచేసుకోలేని వాంఛనుంచి పుట్టే అతివేలమైన కామం, వేటపిచ్చి, జూదం, మద్యపానం– ఈ నాలుగు దుర్గుణాలూ మనిషిని దిగజారుస్తా’యన్నాడు చాణక్యుడు. ‘అనిశ్చిత ఫలితంపై ఆశపెట్టుకుని ఆడే జూదం, ఉన్నదాన్ని సైతం ఊడ్చేయడం మాత్రం సునిశ్చిత’మన్నాడు పందొమ్మిదో శతాబ్దపు సుప్రసిద్ధ అమెరికన్ నాటకకర్త విల్సన్ విజ్నర్. ‘జూదరులందరూ చివరికి పరాజితులుగానే మిగులుతా’రన్నాడు ‘గాడ్ ఫాదర్’ సృష్టికర్త మారియో పూజో. ‘జూదమనేది అజ్ఞానానికి మనిషి కట్టే సుంకం!’ అని తేల్చేశాడు మన కాలపు సువిఖ్యాత గణిత శాస్త్రవేత్త ఎడ్వార్డ్ థోర్(ప్). కానీ మానవ మనస్తత్వం ఎంత విచిత్రమైందో! ఎందరు ఎన్ని సుభాషితాలు పలికినా జూదం తన ఆకర్షణను అణుమాత్రం కూడా కోల్పోయిన దాఖలాలు ఎక్కడా కనిపించవు!
బెట్టింగులు బహువిధాలు!
కొందరి లెక్క ప్రకారం బెట్టింగులు 15, 16 రకాలున్నాయి. వాటిల్లొ ‘నావెల్టీ బెటింగులు’ ఒక రకం. కొన్ని పోటీలపై కాసే బెటింగులను, బుక్కీలు ‘నావెల్టీ బెటింగులు’గా పరిగణిస్తారు. వాటిల్లో నోబెల్ పురస్కారాలపై కాసే బెట్టింగులూ ఉన్నాయి. ల్యాడ్ బ్రోక్స్, బెట్ సన్, నైసర్ ఆడ్స్, కెల్షీ, ప్యాడీ పవర్ తదితర ‘బెట్టింగ్ ప్లాట్ఫామ్స్’ నోబెల్ బెట్టింగులను ఆ కోవకు చెందినవిగానే పరిగణిస్తాయి.
ప్రతి సంవత్సరం నోబెల్ పురస్కారాలు గెల్చుకోబోయేది ఎవరో తమకు– దాదాపు– స్పష్టంగా తెలిసినట్లే ఈ సంస్థలు జోస్యం చెబుతుంటాయి. విమర్శకులూ, విద్వాంసులూ, సాంస్కృతిక వ్యవహారాలపై తరచు రాసే జర్నలిస్టులూ కలిసే చోట చేరి బుక్కీలు వాళ్ళ ఊహాగానాలకు ముడిసరుకు సేకరిస్తారట. సర్వసాధారణంగా ఈ జోస్యాలు ఫలించవు– అది వేరే విషయం! అయినప్పటికీ భారీ మొత్తంలో బెట్టింగులు కొనసాగుతూనే వున్నాయి! 2026 సంవత్సరానికి గాను, నోబెల్ సాహిత్య పురస్కార విజేత ఎవరనే విషయంపై కాసిన పందేల మొత్తం అరవై లక్షల రూపాయలకు మించిందని మార్కెట్ నిపుణుల అంచనా.
- మందలపర్తి కిషోర్
ఇదీ చదవండి: ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టే సమ్మిట్ సాథి


