బ్రెస్ట్‌  క్యాన్సర్‌కు.. బెస్ట్‌ థెరపీస్‌! | explanation of Breast cancer and metastatic breast cancer | Sakshi
Sakshi News home page

బ్రెస్ట్‌  క్యాన్సర్‌కు.. బెస్ట్‌ థెరపీస్‌!

Oct 25 2026 4:53 AM | Updated on Oct 25 2026 4:53 AM

explanation of Breast cancer and metastatic breast cancer

మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ ఒకటి. తొలిదశలోనే దీన్ని గుర్తిస్తే చికిత్స ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశాలుంటాయి. అయితే కొందరిలో క్యాన్సర్‌ కణాలు రొమ్ము నుంచి ఎముకలు, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు వంటి ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి. ఈ పరిస్థితిని మెటాస్టాటిక్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అంటారు. 

సాధారణంగా నాలుగో దశలో ఇలా వ్యాపించడం (మెటాస్టాటిస్‌) జరుగుతుంది కాబట్టి దీన్ని నాలుగో దశ రొమ్ము క్యాన్సర్‌ అంటారు. ఇలా వ్యాపించడం అన్నది మొదట్లోనే ఇతర అవయవాలకు వ్యాపించి, తర్వాత కనిపించవచ్చు లేదా చికిత్స తర్వాత కొన్ని నెలలు లేదా కొన్నేళ్ల తర్వాత ఇది తిరిగి కనిపించవచ్చు. ఈ నెల 
(అక్టోబరు) రొమ్ముక్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా మెటాస్టాటిక్‌ రొమ్ముక్యాన్సర్‌ను నయం చేయడానికి అందుబాటులోకి వచ్చిన కొత్త  ప్రక్రియలూ దాంతో కనిపిస్తున్న సరికొత్త ఆశారేఖలను చూద్దాం.

మొదటి రెండు దశల్లో రొమ్ముక్యాన్సర్‌ను దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. కానీ  నాలుగో దశ రొమ్ము క్యాన్సర్‌ను సాధారణంగా పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, ఆధునిక వైద్యవిధానాలతో వ్యాధిని నియంత్రించడం, లక్షణాలను తగ్గించడం, బాధితుల ఆయుర్దాయాన్ని పెంచడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం సాధ్యమేనని చెప్పవచ్చు. 

లక్షణాలపై అవగాహన ఇలా... 
మెటాస్టాటిక్‌ రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలన్నవి ఆ క్యాన్సర్‌ ఏ అవయవానికి వ్యాపించిందనే అంశంపై ఆధారపడి ఉంటాయి. 
→ రొమ్ములోనే మళ్లీ క్యాన్సర్‌ పెరిగితే... రొమ్ములో గడ్డ చేతికి తగలడం, రొమ్ము ఆకృతిలో మార్పు, చర్మం మందంగా మారడం లేదా నిపుల్‌ నుంచి స్రావాలు రావడం. 
→ ఎముకలకు వ్యాపిస్తే... నిరంతర ఎముకల నొప్పి, వెన్నునొప్పి, కొన్నిసార్లు ఎముకలు తేలిగ్గా విరిగిపోవడం.
→ ఊపిరితిత్తులకు వ్యాపిస్తే... దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
→ కాలేయానికి వ్యాపిస్తే... కడుపు ఉబ్బరం, ఆకలి తగ్గడం, కొన్నిసార్లు చర్మం కళ్లు పసుపు రంగులోకి మారడం. 
→ మెదడుకు వ్యాపిస్తే... తలనొప్పి, చూపులో మార్పులు, మూర్ఛలు లేదా ఇతర నాడీ సంబంధిత లక్షణాలు.
అవే కాకుండా... కారణం తెలియకుండా బరువు తగ్గడం, అలసట, ఆకలి మందగించడం. అయితే... ఈ లక్షణాలన్నీ క్యాన్సర్‌ వల్లే వస్తాయని భావించకూడదు. ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. కాకపోతే ఇలాంటి లక్షణాలు కొనసాగుతూ ఉంటే మాత్రం... వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, మూర్ఛలు, కొత్తగా చేతులు లేదా కాళ్లలో బలహీనత, తీవ్రమైన శ్వాస ఇబ్బంది కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.

నిర్ధారణ ఇలా... 
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు వైద్యులు శారీరక పరీక్షతోపాటు మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, అవసరాన్ని బట్టి ఎమ్మారై వంటి పరీక్షలు సూచిస్తారు. క్యాన్సర్‌ నిర్ధారణకు బయాప్సీ కీలకం. క్యాన్సర్‌ ఇతర అవయవాలకు వ్యాపించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవసరాన్ని బట్టి సీటీ, పీఈటీ–సీటీ, ఎముకల స్కాన్  లేదా ఎమ్మారై పరీక్షలు అవసరం. 

క్యాన్సర్‌ రకాన్ని బట్టి చికిత్స
క్యాన్సర్‌ బాధితులందరికీ ఒకే రకమైన చికిత్స సరిపోదు. లక్షణాలూ, వ్యాధి ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాప్తి జరిగింది, గతంలో తీసుకున్న చికిత్సలు, బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వారికి ఎలాంటి చికిత్స చేయాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త చికిత్స ప్రక్రియల్లో ఇవి కొన్ని... 
హార్మోన్  రిసెప్టర్‌ పాజిటివ్‌ క్యాన్సర్‌: ఈ తరహా చికిత్సలో... హార్మోన్  చికిత్సతోపాటు సీడీకే4/6 ఇన్హిబిటార్‌ మందులను వాడతారు. 

హెచ్‌ఈఆర్‌2 పాజిటివ్‌ క్యాన్సర్‌: హెచ్‌ఈఆర్‌2 అనేది ఒక రకమైన ప్రోటీన్ . రొమ్ముక్యాన్సర్‌ బాధితుల్లో ఈ ప్రోటీన్‌ చాలా ఎక్కువగా వెలువడుతుంది. కొన్ని మందులు ఈ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. 

ట్రిపుల్‌ నెగెటివ్‌ క్యాన్సర్‌: ఇది కీమోథెరపీగా అందించే ప్రధాన చికిత్సల్లో ఒకటి. ఈ తరహా క్యాన్సర్‌లో ఈస్ట్రోజెన్ , ్రపొజెస్టెరాన్  రిసెప్టర్లు, హెచ్‌ఈఆర్‌2 ప్రోటీన్‌ల వల్ల కనిపించే లక్షణాలు  ఉండవు. ఈ తరహా క్యాన్సర్‌ బాధితుల్లో  పీడీ–ఎల్‌1 అనే వైద్య పరీక్ష ఫలితాలను బట్టి పెంబ్రోలిజుమాబ్‌ వంటి ఇమ్యునోథెరపీ మందులను కీమోథెరపీతో కలిపి ఇవ్వవచ్చు. 

టార్గెటెడ్‌ థెరపీ: సాధారణంగా మిగతా సంప్రదాయ చికిత్సలు క్యాన్సర్‌ కణాలనే కాకుండా... ఆరోగ్యకరమైన కణాలనూ కొంతవరకు దెబ్బతీయవచ్చు. కానీ టార్గెటెడ్‌ థెరపీ అంటే అవి నిర్దిష్టంగా కేవలం క్యాన్సర్‌ కణాలనే దెబ్బతీసి... ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టమూ చేకూర్చవు. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన యాంటీబాడీ–డ్రగ్‌ కాంజుగేట్స్‌ అనే ఆధునిక ఔషధాలు క్యాన్సర్‌ కణాలను గుర్తించే యాంటీబాడీతో పాటు క్యాన్సర్‌ నిరోధక మందుతో కలగలసి పనిచేస్తాయి.

ఇమ్యునోథెరపీ: ఇమ్యునోథెరపీ చికిత్సలో ఇచ్చే మందులు... మన సొంత రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ కణాలను గుర్తించి దాడి చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. అయితే ఇది బాధితులందరిలోనూ ఒకేలాంటి ప్రయోజనం కలిగించకపోవచ్చు. క్యాన్సర్‌ రకం, బయోమార్కర్‌ పరీక్షల ఫలితాల ఆధారంగా ఎవరికి ఎలాంటి చికిత్స అందించాలన్నది  వైద్యులు నిర్ణయిస్తారు. 

నొప్పిని తగ్గించడమూ... ఇతర సహాయక చికిత్సలూ కీలకం
క్యాన్సర్‌ నియంత్రణతోపాటు బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం కూడా ముఖ్యం. ఎముకలకు వ్యాప్తి చెందిన క్యాన్సర్‌తో కలిగే నొప్పిని తగ్గించేందుకు మందులు, అవసరాన్ని బట్టి రేడియోథెరపీ ఉపయోగిస్తారు. బాధితులకు ఉపశమనం కలిగించే ప్రక్రియల్లో... పోషకాహారం, వ్యాయామానికి సంబంధించిన వైద్య సలహాలు, పునరావాసం, మానసిక కౌన్సెలింగ్‌ వంటివీ కీలకం. 

నివారణ ఇలా... 
మెటాస్టాటిక్‌ రొమ్ము క్యాన్సర్‌ను పూర్తిగా నివారించడానికి నిర్దిష్టమైన మార్గం లేదు. అయితే రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం, తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి ముదిరే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన రీతిలో ఉండాల్సిన బరువు ఉండేలా చూసుకోవడం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు, పొగతాగడం, మద్యం అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులు రొమ్ము క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. 

వయస్సు, వ్యక్తిగత ముప్పునకు కారకాలను బట్టి డాక్టర్ల సూచన మేరకు మామోగ్రఫీ వంటి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్‌ చరిత్ర (మెడికల్‌ హిస్టరీ) ఉన్నవారు, జన్యుపరంగా ముప్పు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి. రొమ్ములో కొత్త గడ్డ లేదా అసాధారణ మార్పులు కనిపిస్తే స్క్రీనింగ్‌ పరీక్ష కోసం కాకుండా తక్షణం అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

డాక్టర్‌ సింధు పేరిచర్ల 
కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement