ఇటీవలే మనదేశంతోపాటు నేపాల్‌లోనూ వరదల వల్ల కొండచరియలు విరిగిపడి తీవ్ర నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను గుర్తించిన ఓ విద్యార్ధి దీనికో పరిష్కారాన్ని కనిపెట్టాలని తపించాడు.‘సమ్మిట్ సాథీ’ పేరుతో ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడే సరికొత్త శాటిలైన్‌ను ఆవిష్కరించాడు.
సాధారణంగా వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్‌లు లేదా ఇతర సమాచార వ్యవస్థలపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ మారుమూల పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాల సమయంలో ఈ వ్యవస్థలు పనిచేయకపోవచ్చు. ఇలాంటి సమస్యను అధిగమించడమే సమ్మిట్‌సాథి ప్రధాన ఉద్దేశం.
హైదరాబాద్‌కు చెందిన ఆగమ్ జైన్ 12వ తరగతి చదువుతున్నాడు. నెట్‌వర్క్ లేని ప్రాంతాలకు కూడా సమాచారాన్ని చేరవేసే వ్యవస్థను రూపొందించాలనుకున్నాడు. వాతావరణ ఉపగ్రహాల నుంచి మేఘాలకు సంబంధించిన చిత్రాలను నేరుగా స్వీకరించి స్థానిక ప్రజలకు అందించడం ఈ పరికరం ప్రత్యేకత. అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ విడి భాగాలతోనే దీన్ని రూపొందించడం విశేషం. ఒక్కో పరికరం తయారీకి సుమారు రూ.68 వేల వరకూ ఖర్చు అవుతుందని ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న బృందం తెలిపింది.
సెరాజ్ లోయ ద్వారా...
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఉన్న సెరాజ్ లోయలో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు రిసీవర్ల ద్వారా పది గ్రామాల్లోని వెయ్యి మందికి పైగా ప్రజలకు వాతావరణ సమాచారాన్ని చేరవేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. దీన్ని నిర్వహించేందుకు స్థానికులకు శిక్షణ కూడా ఇచ్చారు. మొబైల్ నెట్‌వర్క్ లు పనిచేయని పరిస్థితుల్లోనూ ఉపగ్రహ వాతావరణ చిత్రాలను వీరు స్వీకరించి ప్రజలకు అందించగలరు.
– సత్యబాబు


