పక్కింటి టేస్ట్‌లు.. స్విగ్గీ ఇష్టులు వంటరి వాళ్ళం కాదు! | family special story of sunday reading | Sakshi
Sakshi News home page

పక్కింటి టేస్ట్‌లు.. స్విగ్గీ ఇష్టులు వంటరి వాళ్ళం కాదు!

Oct 25 2026 4:29 AM | Updated on Oct 25 2026 4:29 AM

family special story of sunday reading

సండే రీడింగ్‌

సోమవారం నుంచి శనివారం వరకు వంటగదిలో ఏదో ఉడకేసుకుంటాం. ఆదివారం అలా కాదు. మెల్లగా లేచి, హడావిడి లేకుండా వండుకునే రోజు. ఇష్టకూరలూ... మెచ్చిన వంటలూ...మన ఘుమఘుమలు మనవైతే ఇరుగూ పొరుగూ సువాసనలు మరికొన్ని. మన కూర కంటే అక్కడేదో బాగున్నట్టుందే అని పాడు ఆశ.
అపార్ట్‌మెంట్‌లో అయితే నూరు మసాలాలు నూరనీ...వేయి రుచులు ఊరనీ...

ఒకప్పుడైతే పొగ లేచేది. పొరుగువారి వంట మొదలైనట్టు తెలిసేది. ఇప్పుడు విజిల్‌ వేసే కుక్కరే ఆ కబురు అందిస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ స్కూళ్లూ... ఉద్యోగాల హడావిడి. ఏం వండుతున్నామో ఏం తింటున్నామో. ఇడ్లీకి చట్నీ మేచ్‌ కాదు. పప్పులో ఉప్పు తగినంత పడదు. బెండకాయ తాలింపు సోసో. ఆమ్లేట్‌ మాడుతుంది. చికెన్  ఫ్రిజ్జులో ‘నన్ను వండు’ అని మొత్తుకుంటూ ఉంటుంది. కాని టైమ్‌ ఉండదు. కాని ఆదివారం అలా కాదు. ఆ రోజు ఆత్మారాముడు నిద్ర లేచే రోజు. అయితే మనకేనా ఆత్మరాముడు ఉన్నది. పొరుగింట్లో ఆత్మాభీముడు... ఎదురింట్లో ఆత్మానలుడు... అటుపక్క ఇంట్లో ఆత్మాబకాసురుడు.

పొరుగింటి పుల్లకూరే కాదు పోపు వాసన కూడా రుచే. అచట వచ్చే ఘుమఘుమ ఎచటి పదార్థానిది? పంజగుట్ట వెళ్లి మటన్  తెచ్చారేమో. ఆ ఫ్లాటాయన సంచి పట్టుకుని నాటుకోడి స్టాల్‌వైపు వెళుతూ కంటపడ్డాడు. అదే ఏమో. ఇటువైపు ఫ్లాటాయన లైవ్‌ చేపల కోసం చెరువు దాకా వెళ్లేందుకు కూడా తెగిస్తాడు. వీలైతే చెరువులోనూ దూకుతాడు. బెంగాల్‌లో పుట్టి వుంటే బెడద పోయేది. ఇక్కడ చేరి ప్రతి ఆదివారం బాంyì లో మీనమేషాలు లెక్కపెడుతుంటాడు.

«భర్తల మనసులో ఏదో ఉంటుంది. వారు వంటగదిలో భార్యలను ఎక్కడి వంటదాకో తీసుకెళ్లాలనుకుంటారు. కాని భార్యలు అక్కడకు రారు. ‘మా వారికి బోటీ ఇష్టం వొదినె. తెచ్చారు. ఒండుతున్నా’ అంటుంది ఒకామె. పాపం ఈ ఫ్లాటాయనకు అదంటే ఏడో ప్రాణం. కాని భార్య మాత్రం ‘చేతులు నొస్తాయి... నేనొండ’ అంటుంది. బోటీ వండుతున్న సువాసన పక్కింటి నుంచి పీల్చడమే ఆ పూటకు ప్రాప్తం. భార్య మనసులో చందువాల పులుసు ఉండొచ్చు. మొండి భర్త రొయ్యలు తెచ్చి ఫ్రై  చేయమంటాడు. కాని అపార్ట్‌మెంట్‌లో ఏదో మూల నుంచి చేపల పులుసు వాసన వచ్చి కాస్త కాంపెన్ సేషన్  చేస్తుంది.

ఇక వెజిటేరియన్స్ కు వేయి. ఉదయం పది గంటలకే మూడోఫ్లోర్‌లో పచ్చడి కోసం పచ్చి మిరపకాయలు వేగుతాయి. ఫోర్త్‌ఫ్లోర్‌లో చింతపండు పులుసును ఉడకబెట్టి, వేరుశెనగ పప్పు, కరివేపాకు వేసి పోపు పెట్టిన  పులిహోర వాసన. మధ్యాహ్నానికి గుత్తి వంకాయ కూరో అరటి దూట స్పెషలో.... ఆకాకరకాయ రేపే ఆశలు ఎన్నో. పక్కింటి పిల్లాడు లిఫ్ట్‌లో ‘అంకుల్‌ మా ఇంట్లో వెజ్‌ బిర్యానీ’ అని గర్వంగా చెప్పుకుంటూ వెళ్తాడు.  వెంటనే మనకు పనీర్‌ ముక్కలు నెయ్యిలో దోరగా వేగుతున్న వాసన, పైన బిర్యానీ ఆకు వేసిన వాసన. దమ్‌ పెట్టి, మూత తీయగానే వచ్చే ఆ ఆవిరి వాసన లిఫ్ట్‌లోకి కూడా వచ్చేస్తుంది. తలుపులు మూసుకోగలరు గాని 

వాసనలను ఆపగలరా?
‘కొంచెం పచ్చడి ఉందా?’ అని అడిగే  ధైర్యం ఆదివారమే వస్తుంది. పక్కింటి ఆంటీ ఆదివారం వస్తే గోంగూర పచ్చడి చేస్తుంది. ఆ రోటి పచ్చడి వాసన ఈ ఇంటి వరకు వస్తుంది. అప్పుడు అమ్మ ‘వెళ్లి కొంచెం అడిగిరా’ అని చెప్పదు. మనమే అర్థం చేసుకోవాలి. ఏదో మాటవరసకు వెళ్లినట్టు వెళ్లి ‘ఆంటీ, గోంగూర వాసన చాలా బాగా వస్తుంది’ అంటే చాలు ఆమె నవ్వుతూ ఒక చిన్న గిన్నెలో పెట్టి ఇస్తుంది. దానికి బదులుగా మన ఇంట్లో చేసిన కేసరి కొంచెం ఇస్తాం. 

వాసనలకు మనుషులను గుర్తు పెట్టుకునే శక్తి ఉంది. బామ్మ చేతి ఆవకాయ వాసన, నాన్నమ్మ పెట్టే అప్పడాల వాసన ఎప్పటికీ మర్చిపోం కదా. అలాగే పక్కింటి వాళ్ల వాసనలు కూడా. లోకో భిన్న రుచిః అన్నారు పెద్దలు. లోకో భిన్న పాకః అని కూడా తెలుసుకోవాలి. ఎల్ల పాకములు నొల్లకూడనివే. పిల్లలకు పరమత సహనం అని పాఠాలు చెప్తారు. పర వంటల సహనం నేర్పాలి. మన ఇంటి బెంచీలో మనకు ఇష్టమైనది తింటాం. 

కామన్  బెంచీలో వాళ్లకు ఇష్టమైనది తినేటప్పుడు మనం లేచి వెళ్లకుండా ఉండగలగడమే సంస్కారం. మన కూర మనకెంతో వారి కూర వారికి అంత. దేవుని దృష్టిలో కూరలకు హెచ్చుతగ్గులు లేవు. తినే పదార్థాలకు పాపపుణ్యాలు అంటగట్టరాదు. భయంకరమైన ఆకలి రోజుల ఆదియుగం నుంచి ఆకలి వేయగానే స్విగ్గీకి ఆర్డర్‌ పెట్టగల రోజులకు వచ్చాం. ఆకలి క్రూరత్వం తెలిసినప్పుడే దొరికింది తినడంలో ఎంత గౌరవం ఉంటుందో కూడా తెలుస్తుంది. దొరికింది తినడమే క్రమంగా అలవాటుగా మారింది. మన అలవాటు మనది... వారి అలవాటు వారిది.

– కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement