ఫండే
ఈవారం కథ
విశ్వవిద్యాలయం అంటే సిరికి ఒక పెద్ద ప్రపంచం. ఉదయం గ్రంథాలయం మెట్లపై పుస్తకాలు తెరిచి కూర్చున్న విద్యార్థులు, చెట్ల నీడలో పరిశోధనల గురించి చర్చిస్తున్న పరిశోధకులు, దారంతా వినిపించే విభిన్న భాషల పలకరింపులు... ఆ ప్రాంగణం ప్రతిరోజూ ఒక చిన్న భారతదేశంలా కనిపిస్తుంది. అక్కడ ప్రతి పుస్తకం ఒక కొత్త ఊరు, ప్రతి భాష ఒక కొత్త మనిషి, ప్రతి మనిషి ఒక కొత్త కథ. భాషలు వేరు, అలవాట్లు వేరు... కానీ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరిలో ఒకటే!
ఆ ప్రపంచంలో సిరి కూడా ఒక భాగమే. పల్లెటూరి సంప్రదాయ కుటుంబంలో పెరిగిన అమ్మాయి ఆమె. పెద్దల మాటకు విలువ ఇవ్వడం, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం చిన్నప్పటి నుంచే నేర్చుకుంది. అయితే పుస్తకాలంటే ఆమెకు ప్రత్యేకమైన ప్రేమ. పుస్తకాల్లోని ప్రపంచాలను చదవడమే కాదు, వాటి వెనుక ఉన్న మనుషుల జీవితాలను అర్థం చేసుకోవాలనే ఆసక్తి కూడా ఆమెకు ఉండేది.
సిరి ఇంటి వాతావరణం మాత్రం విశ్వవిద్యాలయానికి భిన్నంగా ఉండేది. ఇంట్లోకి అడుగు పెట్టగానే విశ్వవిద్యాలయ సందడి వెనక్కి వెళ్లిపోయి, ఇంటి నిశ్శబ్దం ఆమెను పలకరించేది. సాయంత్రం ఆమె తండ్రి ప్రకాశ్ ఇంట్లోకి అడుగుపెట్టగానే టెలివిజన్ శబ్దం కొద్దిగా తగ్గిపోయేది. మాటలు పూర్తిగా ఆగిపోవు కానీ, వాటి వేగం మాత్రం తగ్గిపోయేది. ప్రకాశ్ పెద్దగా మాట్లాడడు, కోపంగా అరిచే అలవాటు లేదు. కానీ ఆయన ఇంట్లో ఉన్నాడంటే చాలు నవ్వులు కూడా తగ్గిపోయేవి. ఆయన మౌనం ఇంట్లో ఒక క్రమశిక్షణలా ఉండేది.
ప్రకాశ్ మొదటినుంచి అలా ఉండేవాడు కాదు. ఒకప్పుడు చెడు సావాసాలు అతని జీవితాన్ని తప్పుదారి పట్టించాయి. సరదాగా మొదలైన అలవాటు, తర్వాత అతనిపైనే పట్టు సాధించింది. ఒక రాత్రి మద్యం మత్తులో బార్లో జరిగిన గొడవలో అందరి ముందూ అతన్ని బయటకు గెంటేశారు. ఆ చల్లని రాత్రి బార్ బయట కూలబడ్డ ప్రకాశ్‌కు మొదటిసారి తన మీద తనకే అసహ్యం వేసింది. ఆ క్షణంలో అతని కళ్ల ముందు భార్యా పిల్లల ముఖాలే కనిపించాయి. తాను కోల్పోతున్నది డబ్బు కాదు, తన కుటుంబం నమ్మకమని అతనికి అర్థమైంది. ఆ మార్పు ఒక్కరోజులో రాలేదు.
క్రమంగా ఇంట్లోని సిగరెట్ పెట్టెలు, యాష్ట్రేలు, ఇంటి వెనుక దాచిన ఖాళీ సీసాలు, చొక్కాలపై పొగాకు వాసనలు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. అర్ధరాత్రి తలుపు తట్టి అతన్ని తీసుకొచ్చే స్నేహితులు దూరమయ్యారు. చుట్టు పక్కలవారి అసహ్యపు చూపులు తగ్గిపోయాయి. కానీ ఆ రోజుల్లో తాను కుటుంబానికి కలిగించిన బాధ మాత్రం అతని మనసులో గాయంలా మిగిలిపోయింది. అందుకే మారిన తర్వాత కూడా అతను మరింత మౌనంగా ఉండిపోయాడు. ప్రేమించడం తెలుసు. కానీ, ప్రేమను బయటపెట్టడం తెలియదు.
సిరి తల్లి భర్తను అర్థం చేసుకున్న మహిళ. ప్రకాశ్ మారినందుకు ఆమెకు సంతోషంగా, గర్వంగా కూడా వుంది. కానీ, అతని మౌనం వల్ల ఎప్పుడూ ఒక జాగ్రత్త ఉండేది. ఆ ఇంట్లో ప్రకాశ్‌తో ధైర్యంగా మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి సిరి వాళ్ళ నానమ్మ.
ఒకసారి సిరితో అంది, ‘మనిషి మారడం గొప్ప విషయం తల్లీ... కానీ అతని పాత గాయాలు మాత్రం అతనితోనే ఉంటాయి.’
ఆ మాట సిరి మనసులో నిలిచిపోయింది.
∙∙
ఒక రోజు సాయంత్రం విశ్వవిద్యాలయంలో ఉన్నట్టుండి పెద్ద వర్షం మొదలైంది. గ్రంథాలయం బయట వర్షం తగ్గే వరకు ఆగిన విద్యార్థుల మధ్యలో ఒక కొత్త ముఖం కనిపించింది. వర్షపు చినుకులు అతని జుట్టు చివర్ల నుంచి జారుతున్నా, ముఖంలో మాత్రం ప్రశాంతమైన చిరునవ్వు చెదరలేదు. అతను ఈశాన్య భారతదేశంలోని మిజోరాం నుంచి వచ్చిన అరుణ్. మధ్యాహ్నం క్యాంటీ¯Œ లో మాధవి అతన్ని సిరికి పరిచయం చేసింది.
‘సిరి... ఇతను అరుణ్. మిజోరాం నుంచి వచ్చాడు, జానపద సాహిత్యంపై పరిశోధన చేస్తున్నాడు’ అంది మాధవి.
అరుణ్ మర్యాదగా చేతులు జోడిస్తూ, ‘నమస్కారం’ అన్నాడు.
మాటలు సాగుతున్న కొద్దీ అతని తెలుగులో ఈశాన్య భారతదేశపు యాస స్పష్టంగా వినిపించింది.
సిరి చిరునవ్వు నవ్వి, ‘మీ తెలుగు బాగుంది’ అంది.
అరుణ్ చిన్నగా నవ్వుతూ, ‘ఇంకా నేర్చుకోవాలి’ అన్నాడు.
మొదటి చూపులోనే అరుణ్ రూపం సిరిని ఆకట్టుకుంది. మధ్యస్థమైన ఎత్తు, కొండ ప్రాంతపు వాతావరణానికి అలవాటు పడిన మేని ఛాయ, నుదుటిపైకి చల్లగా జారిపడే నల్లటి జుట్టు... ఆ రూపంలో ఏదో కొత్తదనం, ఆకర్షణ కనిపించాయి. కానీ అంతకంటే ఎక్కువగా అతని ముఖంలో ఉన్న ప్రశాంతత, ఎదుటి మనిషిని అర్థం చేసుకునే వినయం సిరిని ఆకట్టుకున్నాయి.
అరుణ్ మాట్లాడేటప్పుడు అతని కళ్లలో ఒక స్వచ్ఛమైన భావం కనిపిస్తుంది. కొండల మధ్య పెరిగినవాడు కాబట్టేమో, అతనికి నిశ్శబ్దంతో భయం లేదు. కానీ తన ఇంట్లోని నాన్న నిశ్శబ్దం వేరు. అది గతంలో తాను చేసిన తప్పులు మిగిల్చిన గాయాల భారం. నాన్న గదిలో మౌనంగా కూర్చున్నప్పుడు ఆ మౌనం ఇంట్లో ఒక అభద్రతాభావాన్ని పెంచితే, అరుణ్ మౌనంలో ఒక భరోసా కనిపించేది.
∙∙
కొద్దిరోజుల్లోనే అరుణ్ అందరికీ పరిచయమయ్యాడు. అతను వివిధ భాషల జానపద సాహిత్యంపై పరిశోధన చేస్తున్నాడు. తన ప్రాంతపు కథలు, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది అతని లక్ష్యం. పుస్తకాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్లలో కనిపించే మెరుపు, తన ఊరి గురించి చెప్పేటప్పుడు స్వరంలో వినిపించే ఆప్యాయత... అవి అతని పరిశోధన కేవలం విద్య కోసం కాదని, తన నేల మీద ఉన్న మమతతో మొదలైందని చెప్పేవి.
ఒక రోజు సిరి అడిగింది–
‘మీకు మీ భాషంటే ఎందుకు ఇంత ప్రేమ?’
అరుణ్ కొద్దిసేపు మౌనంగా దూరంగా కనిపిస్తున్న చెట్ల వైపు చూశాడు. తర్వాత మెల్లగా అన్నాడు–
‘ప్రతి భాష వెనుక ఒక జాతి జ్ఞాపకం ఉంటుంది. ఒక భాషలో పదాలు మాత్రమే ఉండవు, ఆ ప్రజల ఆలోచనలు, అనుభవాలు, సంస్కృతి కూడా ఉంటాయి.’
ఆ మాటలు సిరి మనసులో చాలా సేపు ప్రతిధ్వనించాయి.
ఆ రోజు నుంచి అరుణ్‌కు తెలుగు పదాలు నేర్పడం మొదలుపెట్టింది సిరి. గ్రంథాలయం మెట్లపై కూర్చునో, క్యాంటీ¯Œ లో టీ తాగుతూనో, దారిలో నడుస్తూనో... ఏ సందర్భం దొరికినా ఒక్కో కొత్త పదం అతనికి చెప్పేది.
ఒక రోజు సిరి ‘జ్ఞాపకం’ అనే పదం చెప్పింది.
అరుణ్ పలకడానికి ప్రయత్నించి తడబడ్డాడు. ఇద్దరూ నవ్వుకున్నారు.
మరోసారి నెమ్మదిగా పలికాడు.
‘జ్ఞా...పకం...’
ఈసారి సరిగ్గా పలికాడు.
ఒక చిన్న విజయాన్ని పొందిన పిల్లవాడిలా అతని ముఖంలో మెరిసిన ఆనందాన్ని చూసి సిరి కూడా నవ్వింది.
ఆ చిన్న క్షణం ఆమె మనసులో అలా నిలిచిపోయింది.
తెలియకుండానే సిరి మనసులో విచిత్రమైన భావం మెదిలింది.
అరుణ్ తన కొండల కథలు కాలంతో కొట్టుకుపోకూడదని ప్రతి పదాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని భద్రంగా దాచుకుంటున్నాడు.
కానీ నాన్న తన గతాన్ని, పాత జ్ఞాపకాలను మనుషుల కంట పడకుండా లోపల దాచేస్తున్నాడు.
ఒకరు పరిమళాన్ని పంచడానికి జ్ఞాపకాలను దాచుకుంటే, ఇంకొకరు తమ గాయం కనిపిస్తుందేమోనని గతాన్ని దాచేస్తున్నారు.
ఒక రోజు అరుణ్ తన పరిశోధన గురించి చెబుతూ, ‘మనుషులు మారిపోతారు... కానీ వాళ్లు వదిలిన కథలు ఉంటే వారి జీవితం తర్వాతి తరాలకు చేరుతుంది.’ అన్నాడు.
ఆ మాటలు సిరికి మళ్లీ తన తండ్రిని గుర్తు చేశాయి.
ఇంట్లో కూడా సిరిలో వచ్చిన మార్పును ప్రకాశ్ గమనించాడు.
ఒక రోజు భోజనం తర్వాత ప్రకాశ్ అడిగాడు–
‘ఈ మధ్య మిజోరాం గురించి ఎక్కువగా చదువుతున్నావు?’
‘అవును నాన్నా! అక్కడి సంస్కృతి గురించి తెలుసుకుంటున్నాను.’ అంది సిరి.
ప్రకాశ్ ఆమె వైపు చూశాడు.
ఆ చూపులో కోపం లేదు. ప్రశ్నించాలనే ఆలోచన లేదు. నిశ్శబ్దపు ఆర్ద్రత మాత్రమే ఉంది.
‘తెలుసుకోవడం తప్పు కాదు..’ అని కొద్దిసేపు ఆగి, ‘కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా మర్చిపోకూడదు.’ అన్నాడు.
నాన్న అలా అన్నప్పుడు ఆ మాటలు కేవలం పుస్తకాల గురించే కాదనిపించింది సిరికి.
‘మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు–’ అంటే, తను చేసిన తప్పులను తన పిల్లలు మళ్లీ చేయకూడదనే ఒక తండ్రి లోపల దాగి ఉన్న ఆందోళన.
నాన్న ఆధిపత్యం చలాయించడానికి మౌనంగా లేడు; మళ్లీ ఏ పొరపాటూ జరగకుండా కాపలా కాసే కాపలాదారుడిలా ఉన్నాడని ఆ క్షణంలో సిరికి అర్థమైంది.
ఆ రాత్రి సిరి తన తల్లి దగ్గర కూర్చుని,
‘అమ్మా... నాన్న మనసులో ఉన్నది ఎందుకని బయటచెప్పరు?’ అని అడిగింది.
తల్లి చిరునవ్వు నవ్వి అంది– ‘కొంతమందికి ప్రేమను మాటల్లో చెప్పడం రాదు సిరి. కానీ వాళ్ల ప్రేమ... వాళ్లు చేసే జాగ్రత్తల్లో కనిపిస్తుంది.’
కాలం సాగిపోతోంది.
అరుణ్ పరిశోధన చివరి దశకు చేరుకుంది.
ఒక సాయంత్రం గ్రంథాలయం బయట ఇద్దరూ కూర్చున్నారు.
అస్తమిస్తున్న సూర్యుడి వెలుతురు గ్రంథాలయం కిటికీలపై బంగారు రంగులా పరచుకుంది. కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం కూడా వారి సంభాషణలో భాగమే అన్నట్టుగా అనిపించింది.
‘మరికొన్ని రోజుల్లో నా పరిశోధన పూర్తవుతుంది. తర్వాత మా ప్రాంతానికి తిరిగి వెళ్తాను.’ అన్నాడు అరుణ్.
అతను తన నోట్‌బుక్ సిరికి చూపించాడు.
‘ఇందులో మా కొండల కథలు మాత్రమే కాదు... మీరు నాకు నేర్పిన తెలుగు పదాలు కూడా ఉన్నాయి.
అంతకంటే ముఖ్యంగా ఒక భాష వెనుక ఉన్న మనసును చదవడం నాకు నేర్పించారు.’ అన్నాడు. ఆ మాటలకు సిరి నవ్వింది.
‘నేను పదాలే నేర్పాను.’
అరుణ్ తల ఊపాడు.
‘కాదు... పదాల వెనుక మనుషులను చూడడం నేర్పించారు.’
ఆ మాటకు సిరి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ మౌనం ఆమె మనసులో చాలా దూరం ప్రయాణించింది.
∙∙
వీడ్కోలు చెప్పే రోజు రానే వచ్చింది
బస్సు కదలడం ప్రారంభమయ్యే ముందు అరుణ్ మెల్లగా అన్నాడు–
‘కొన్ని పరిచయాలు మన జీవితంలోకి వస్తాయి... మనల్ని మార్చి వెళ్తాయి.’
అతను చిరునవ్వుతో చేయి ఊపాడు.
బస్సు కనుచూపు మేర దాటిపోయే వరకు సిరి అలాగే నిలబడి చూస్తూ ఉంది.
తర్వాత మెల్లగా వెనక్కి తిరిగింది.
ఆమె మనసులో మాత్రం కొండల గాలి ఇంకా వీస్తూనే ఉంది.
కొద్దిసేపటికి సిరి మెల్లగా ఇంటికి చేరుకుంది. ఆ రోజు ఇంట్లో కూడా ఏదో తెలియని నిశ్శబ్దం ఉంది.
కానీ ఈసారి ఆ నిశ్శబ్దం ఆమెకు కొత్తగా అనిపించింది.
ఇంతకుముందు నాన్న మౌనం తనను దూరంగా ఉంచుతున్నట్టు అనిపించేది. ఇప్పుడు అదే మౌనంలో ఎన్నో చెప్పని మాటలు వినిపిస్తున్నాయి.
ప్రకాశ్ ఎప్పటిలాగే తన గదిలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. సిరి తలుపు దగ్గర కొద్దిసేపు నిలబడి చూసింది.
‘నాన్నా...’ అని పిలిచింది.
ప్రకాశ్ పుస్తకం నుంచి తలెత్తి చూశాడు.
‘అరుణ్ వాళ్ల ఊరికి వెళ్లిపోయాడు.’ అంది.
‘తెలుసు.’ అన్నాడు ప్రకాశ్.
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
‘ఎలా తెలుసు?’
ప్రకాశ్ చిన్నగా నవ్వాడు.
‘నీ ముఖంలో కనిపిస్తోంది.’
ఆ మాటకు సిరి మౌనంగా ఉండిపోయింది.
కొద్దిసేపటి తర్వాత ప్రకాశ్ మెల్లగా అన్నాడు.
‘కొంతమంది మన జీవితంలోకి వస్తారు సిరి... వాళ్లు ఎక్కువ రోజులు మనతో ఉండకపోవచ్చు. కానీ వాళ్లు మనకు చూపించిన కొత్త ప్రపంచాన్ని, ఆ ప్రపంచాన్ని చూసే కొత్త దృక్పథాన్ని మాత్రం ఎవరూ మన దగ్గర నుంచి తీసుకోలేరు.’
సిరి వాళ్ళ నాన్న వైపు చూసింది. అది తన నాన్న చెప్పిన మాటలా అనిపించలేదు. ఎన్నో సంవత్సరాలు తనలో దాచుకున్న ఒక మనిషి అనుభవం నుంచి వచ్చిన మాటలా అనిపించింది. ఆమె మొదటిసారి నాన్న పక్కన కూర్చుంది.
ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
కానీ ఆ రోజు ఆ ఇంట్లోని మౌనం భారంగా లేదు. అది ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించిన ఒక నిశ్శబ్ద సంభాషణలా అనిపించింది.
∙∙
కొన్ని నెలలు గడిచాయి.
విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి కొత్త పుస్తకాలు వచ్చాయి. సిబ్బంది వాటిని అలమారల్లో సర్దుతుంటే సిరి చూస్తూ వెళ్తోంది.
అప్పుడే ఒక పుస్తకం ఆమె దృష్టిని ఆకర్షించింది.
‘మిజోరాం జానపద కథలు.’
ఆమె చేతులు ఒక్క క్షణం ఆగిపోయాయి.
మెల్లగా ఆ పుస్తకాన్ని తీసుకుని మొదటి పేజీ తిప్పింది.
అంకితం పేజీ దగ్గర ఆమె వేళ్లు నిలిచిపోయాయి. అక్కడ ఇలా ఉంది–
‘ఈ పుస్తకం... తెలుగు భాషను నాకు కొత్త ప్రపంచంగా పరిచయం చేసిన నా స్నేహితురాలు సిరికి అంకితం. ఒక భాషలోని పదాలను నేర్పించినందుకు కాదు... ఆ భాష వెనుక ఉన్న మనుషుల హృదయాన్ని అర్థం చేసుకునే దారి చూపించినందుకు.
– అరుణ్’
ఆమె కాసేపు ఆ పేజీని చూస్తూ ఉండిపోయింది.
ఆ అక్షరాల్లో అరుణ్ జ్ఞాపకం మాత్రమే కాదు, ఒకప్పుడు తనకు అర్థం కాని తన తండ్రి మనసు కూడా కనిపించింది.
ప్రకాశ్ మౌనం వెనుక దాగిన బాధను, ప్రేమను, భయాన్ని ఇప్పుడు ఆమె కొత్త కళ్లతో చూడగలిగింది. ఆమెకు అర్థమైంది– అరుణ్ తనకు ఇచ్చిన గొప్ప బహుమతి ఒక పుస్తకం కాదు, ఒక భాష కాదు... మనుషుల హృదయాలను చదవగలిగే ఒక కొత్త చూపు.
ఆమె మెల్లగా పుస్తకాన్ని మూసి తన హృదయానికి హత్తుకుంది.
బయట కిటికీ దగ్గర గాలి మెల్లగా వీచింది.
ఎక్కడో దూరంగా కొండల మధ్య నుంచి వచ్చిన ఆ వసంతం... ఇప్పుడు ఆమె ఇంటి నిశ్శబ్దంలో కూడా పరిమళిస్తోంది.
అవును కొందరు మనుషులు మన జీవితంలోకి ఒక ఋతువులా వస్తారు...
కానీ వారు తెచ్చిన వసంతం మాత్రం ఎప్పటికీ మనలోనే నిలిచిపోతుంది...
- పులిపాక నంద కిషోర్
ఇదీ చదవండి: అమ్మే దుర్గమ్మ!


