లిటిల్ గెస్ట్
‘ఆడపిల్ల ఆనందంగా ఉండాలి...
సేఫ్‌గా ఉండాలి...
అనుకున్నది సాధించాలి...
ఆత్మవిశ్వాసంతో ఉండాలి...’
పన్నెండేళ్ల చిన్నారి నక్షత్ర అంటున్న మాటలివి. ఇంత చిన్న వయసులో పెద్ద మాటలే చెప్పింది. దానికి కారణం తల్లి రిజీనా చెప్పిన మాటలు తన మనసులో బలంగా నాటుకుపోవడమే. మామూలుగా అమ్మాయిలకు ‘నాన్న’ పక్కన ఉంటే ‘బలం’. కానీ నక్షత్ర తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ‘ఆ ప్లేస్‌ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. కానీ మా అమ్మ ఇచ్చే సపోర్ట్ అంతా ఇంతా కాదు... ఆ దుర్గా మాత మనందరికీ బలం... నాకు ఆ అమ్మ... మా అమ్మ ఇద్దరూ బలమే’’ అంటోంది నక్షత్ర. ‘ఇరుముడి’ సినిమాలో మెరిసిన ఈ బాల నటి ‘సాక్షి’తో ఇంకా చాలా విషయాలు పంచుకుంది.
లాస్ట్ ఇయర్ దసరాకి, ఈ ఇయర్‌కి నా లైఫ్‌లో చాలా మార్పొచ్చింది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆర్టిస్ట్‌గా నేను చాలామందికి దగ్గరయ్యాను. ఎంతోమంది అభిమానం దక్కడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక దసరా పండగ అంటే ఇక్కడ (తెలుగు) ఉన్నంతగా కేరళలో ఉండదు. కానీ ఆ ఫెస్టివల్ వైబ్ బాగుంటుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు.
అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి
నా లైఫ్‌లో నాకు మా అమ్మే ఇన్స్పిరేషన్. ‘డోంట్ గివ్ ఆప్ నక్షత్ర’ అంటుంది. స్ట్రాంగ్‌గా ఉండాలని, కాన్ఫిడెంట్‌గా ఉండాలని చెబుతుంది. ఆ మాటలు వింటే ఎంత కష్టమైనా పడాలనేంత ఎనర్జీ వచ్చేస్తుంది. స్కూల్, షూటింగ్స్‌తో మా అమ్మతో ఈ మధ్య ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడంలేదు. ఒక రోజంతా పూర్తిగా అమ్మతోనే ఉండాలని, మంచి మెమరీస్‌ని క్రియేట్ చేసుకోవాలని ఉంది. అలాగే నాకోసం అమ్మ చేసేదంతా చూస్తుంటే ‘థ్యాంక్స్’ చెప్పాలనిపిస్తుంది.
నాన్న స్థానం చాలా ప్రత్యేకం
మా నాన్న జ్ఞాపకాలను మరచిపోలేను. నా మనసులో ఆయన స్థానం చాలా ప్రత్యేకం. అయితే నాన్న చనిపోయాక అంతా తానే అయి, నన్ను, తనను చూసుకుంటోంది మా అమ్మ. నా కోసం తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటోంది. మా అమ్మని చూస్తే చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. నాకైతే అమ్మ పక్కన ఉంటే ఏ దిగులూ ఉండదు.. చాలా సేఫ్‌గా ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుంటుంది. ఎంత గారాభంగా చూసుకుంటుందో అంతే బాగా గైడ్ చేస్తుంది.
ఆర్మీలో చేరాలన్నది నా కల
నాకు సినిమాల్లో నటించడం ఇష్టం. అయితే వేరే కల కూడా ఉంది. వీలైతే పైలట్ అవ్వాలని, ఆర్మీలో చేరాలన్నది నా డ్రీమ్. ఎత్తుకు ఎగరడం, ప్రపంచాన్ని అన్వేషించడం వంటి ఆలోచనలు నాకు చాలా ఇష్టం. ఆర్మీ ఆఫీసర్స్ చాలా ధైర్యంగా, ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ల గురించి విన్నప్పుడల్లా పెద్దయ్యాక ఆర్మీ ఆఫీసర్ అయిపోవాలనిపిస్తుంది. ఆర్మీలో చేరి, మంచి పనులు చేయాలని, నా గురించి నా ఫ్యామిలీ, మన దేశం చాలా ప్రౌడ్‌గా ఫీలవ్వాలని అనుకుంటుంటాను.
ఎడ్యుకేషన్‌ని గిఫ్ట్‌గా ఇస్తా!
వేరే అమ్మాయిలకు గిఫ్ట్ ఇచ్చే చాన్స్ వస్తే... చదువుకోడానికి హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. అది బెస్ట్ గిఫ్ట్ అనుకుంటాను. అలాగే ‘నువ్వు అమ్మాయివి కాబట్టి నీ డ్రీమ్స్‌ని లిమిట్ చేసుకోనక్కర్లేదు’... అందరి అమ్మాయిలకు నేను చెప్పేది ఇదే. మా అమ్మ చెప్పినదే నేను మీకు చెబుతున్నాను. నాకు యాక్టింగ్, ఫ్లయింగ్, ఆర్మీ... ఇలా చాలా కలలు ఉన్నాయి. వేరే అమ్మాయిలకు వేరే ఉండొచ్చు. ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి వెనకాడకూడదు.
ప్రతి అమ్మాయీ చదువుకోవాలి...
అది వాళ్ల హక్కు. ఆ రైట్‌ని ఎవరూ కాదనకూడదు. అలాగే తన చైల్డ్‌హుడ్ చాలా హ్యాపీగా ఉండాలి. చిన్న వయసులోనే భయపెట్టేస్తే ఎప్పటికీ భయం వెంటాడుతుంది. తనన కలలను ఫాలో అయ్యే స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ వరల్డ్‌లో ప్రతి అమ్మాయికీ హ్యాపీగా, సేఫ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా, కాన్ఫిడెన్స్‌గా ఉండే హక్కు ఉంది.
అప్పుడు నేను సూపర్ గర్ల్‌ని!
ఎక్కడికైనా వెళ్లినప్పుడు నాకు చాలా భయం వేస్తుంటుంది. అలాగే ఆర్టిస్ట్‌గా చాలెంజెస్ ఉంటాయి. ఇంకా చాలా విషయాల్లో చాలా సవాళ్లు ఎదురవుతాయి. నేను కాన్ఫిడెంట్‌గా నా భయాలను ఓవర్‌కమ్ చేసిప్పుడు నాకు నేనుగా ‘సూపర్ గర్ల్’లా ఫీలవుతాను.
– డి.జి. భవాని


