ఈ వారం కథ: 'పెంపకం' | Funday Weekly Story On Mother Daughter Emotional Story Written By Vegi Ramachandra Rao | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: 'పెంపకం'

Nov 29 2026 8:31 AM | Updated on Nov 29 2026 8:31 AM

Funday Weekly Story On Mother Daughter Emotional Story Written By Vegi Ramachandra Rao

ఫండే

ఈ వారం కథ

హాసిని! ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వులో వెన్నెల చల్లదనం ఉంటుంది. ఆమె ఈ రోజు ఏడుస్తోంది!!
ఆ దుఃఖంలో చెప్పుకోలేనంత బాధుంది, చెప్పలేనంత భయం ఉంది, భరించలేనంత  బెంగుంది.
ఈ అవస్థంతా తన ఒక్కగానొక్క కూతురు శశి వల్లనే. దానికిప్పుడు పదేళ్లు. 
రతన్‌తో కోర్టు నుంచి విడాకులు మంజూరైన నాటికి శశి రెండేళ్ల పాపాయి.
శూన్యంలోకి చూస్తున్న హాసిని చూపులు టీపాయ్‌ మీదున్న ఫొటోఫ్రేమ్‌పై పడ్డాయి.

ఆ ఫొటోలో పైన నీలాకాశం. కింద మహా వృక్షాల పచ్చని తివాచీ. వెండి ప్రవాహంలా గోస్తనీ నది. బొర్రాగుహల రైలింగ్‌ నుంచి చూస్తే కనిపించే మనోహర దృశ్యం. ఆ అందాలను ఆదమరిచి చూస్తూ ఓ అమ్మాయి పడిపోబోతే ఓ అబ్బాయి పట్టుకున్న చిత్రం. పడిపోబోయింది హాసిని. పట్టుకున్నది రతన్‌.

ఫ్రెండ్స్‌తో అరకు వచ్చిన తనకు ఎదురైన అనుభవం. ఆ క్షణాన పక్కనే ఉన్న ఓ ఫారినర్‌ తీసిన ఫొటో అది. పడిపోబోయినప్పుడు ఒడిసిపట్టుకుంటూ సూటిగా చూసాయి రతన్‌ కళ్లు. మాటలు కల్సాయి. ఒకరికొకరి వివరాలు తెల్సాయి. 
హాసినిది హైద్రాబాద్‌. అబ్బాయిది అమెరికా. ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయినా కాంటాక్ట్‌లో ఉండేవారు. రతన్‌ది అమెరికా అయినా తెలుగువాళ్లే. ఎన్నో ఏళ్ల క్రితం అక్కడ స్థిరపడ్డారు. కంపెనీ పనిమీద రతన్‌ హైద్రాబాద్‌ వచ్చి సరదాగా అరకు వచ్చాడు. హాసిని పనిచేసే టీమ్‌ మధ్య సమన్వయం కోసం వాళ్లని తీసుకొని అక్కడికి వచ్చింది.

అలా పరిచయం ప్రేమై పిచ్చై మైకమై పెళ్లి తలపులైంది. పెద్దవాళ్ల దగ్గరకెళ్లింది.
హాసినికి తండ్రి లేడు. తల్లి, ఇద్దరన్నయ్యలు. కూతురి పెళ్లి చేయాలని కలవరిస్తూనే తండ్రి హఠాన్మరణం. తల్లి సహా తనకూ అన్నింటికీ అన్నయ్యలే ఆధారం. ఈ క్రమంలోనే ‘నా దగ్గర కూడా డబ్బులుంటే బాగుణ్ణు’ అనిపించింది హాసినికి.

‘చదివిన చదువెందుకు వృథా కావాలి’ అనుకుంది. ఇంటర్వ్యూలకు వెళ్లింది. వెళ్లగా వెళ్లగా ఒకటి తగిలింది. బెటర్మెంట్‌ కోసం సంస్థలు మారింది. ఇప్పుడు ఓ కంపెనీలో వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది. కంపెనీ పనులమీద ఒకట్రెండు విదేశాలు కూడా వెళ్లింది. కూతురింత బిజీగా ఉన్నా పెళ్లి చేసుకోమని తల్లి పోరేది. హాసిని ఎప్పటికప్పుడు వాయిదా వేసేది. ఇప్పుడు తన ప్రేమ విషయం అమ్మకు అన్నయ్యలకు చెప్పింది. ‘ఎన్నో ఏళ్ల కిందట అమెరికా వెళ్లిపోయినవాళ్లు అంటున్నావు. వాళ్ల గురించి వివరాలు తెల్సినవాళ్లు ఇక్కడెవరూ లేరు. బాగా ఆలోచించు’ అన్నాడు పెద్దన్నయ్య.‘ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి తల్లీ’ అంది తల్లి.

హాసిని ముందుకే వెళ్లింది. పెళ్లి హైద్రాబాద్లో జరిగింది. రతన్‌తో వచ్చినవాళ్లు అందరూ వెళ్లిపోయారు. హాసినితో కల్సి వెళ్దామని అతను ఓ నెల ఉన్నాడు. హాసిని పనిచేస్తున్న కంపెనీకి అమెరికాలోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి. అక్కడికి ట్రాన్స్‌ఫర్‌ కోసం ప్రయత్నించింది. నెల గడిచినా అది కొలిక్కిరాలేదు.

‘నేను జాబ్‌ చేస్తున్నాను కదా. నువ్వూ చేయడం అవసరమా?’ అన్నాడు రతన్‌.
హాసిని ఉలిక్కిపడింది. ప్రేమ మైకంలో ఉన్నా అనేక విషయాలపై క్లారిటీ తీసుకున్నాకే తను పెళ్లికి ఒప్పుకుంది. అందులో జాబ్‌ ఒకటి. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ నేను జాబ్‌ మానను’ అని స్పష్టం చేసింది. 
సూటిగా చూసిన హాసినితో ‘ఊరికే అన్నానులే’ అని నవ్వేశాడు రతన్‌. 
రతన్‌ వెళ్లిపోయాక మరో రెండు నెలలు గడిచాయి. తను అనుకున్నది సాధించింది. అందర్నీ ముఖ్యంగా అమ్మని వదల్లేక వదల్లేక అమెరికా వెళ్లిపోయింది. మొదటి ఆరునెలలు అమెరికా అందాలు, బంధాలు చక్కగా అనిపించాయి.

నెమ్మది నెమ్మదిగా రతన్‌ అంతర్ముఖం కనిపించసాగింది. ఓరోజు చిన్న విషయంపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. అంతే చెంప పగలకొట్టాడు. తనపై చేయిచేసుకోవడం అదే తొలిసారి. అందులోనూ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కొట్టాడు. భరించలేకపోయింది. అప్పుడు అత్త పక్కనే ఉంది.

‘ఏంటీ న్యూసెన్స్‌. వాడికి నువ్వు ఎదురు చెప్పడమేంటి. ఐ కాంట్‌ టాలరేట్‌’ అంది. హాసిని కంగు తింది.
రతన్‌ టార్చర్‌ పెరిగింది. ఓ రోజు డ్రింక్‌ చేసి వచ్చాడు. సరే ‘ఇక్కడది క్వైట్‌ కామన్‌’అనుకుంది. కానీ పక్కన పడుకొని రభస చేశాడు. అందుకు తనిష్టపడలేదు. రతన్‌ మండిపడ్డాడు. తన మీదపడ్డాడు. అడ్డుకోలేకపోయింది.‘‘మంచాలు కల్సుండడానికి వీళ్లేదు.సెపరేట్‌ చెయ్యి’’ అంది. రతన్‌ వినలేదు. ‘‘మార్చకపోతే నేను చస్తాను’’ అంది.‘‘ఛస్తే చావు’’ అన్నాడు. 
‘‘ఊరికే చస్తాననుకోకు. నా చావుకు నువ్వు, నీ అమ్మ కూడా కారకులని రాసి మరీ చస్తాను’’ అంది.

అంతే. అమ్మ పేరెత్తేసరికి దిగొచ్చాడు. రతన్‌కు అమ్మ మాటే వేదం. రెండు సింగిల్‌కాట్‌ మంచాల మధ్య దూరం పెరిగింది. 
‘ఈ కాపురం నేను చెయ్యలేను’ అని తల్లితో ఫోన్లో బోరుమంది. తల్లి చెడామడా తిట్టింది. ‘కొత్త కాపురం అన్నాక సర్దుకుపోవాలి. వట్టి మనిషివి కూడా కాదు.’ అంటూ తనూ బావురుమంది.

ఏదో పనిమీద గదిలోకి వచ్చిన అత్తయ్య మంచాలు వేరుగా ఉండటం చూసింది. ‘వాడికి ఆ సుఖం కూడా లేకుండా చేస్తున్నావా?’ అని తనమీద విరుచుకుపడింది. ఆ రోజు సాయంత్రం రతన్‌ ఒకావిడ్ని తీసుకొని ఇంటికొచ్చాడు. ఆమెతో ఇంట్లోవాళ్లంతా నవ్వుతూ మాట్లాడేరు. ఆమె ఎవరని అడిగే పని లేకుండా రతనే పరిచయం చేశాడు ‘నా గర్ల్‌ ఫ్రెండ్‌. ఇక్కడే ఉంటుంది’ అని. 
హాసినికి మతిపోయింది. ‘ఇక్కడే ఉండటమేంటి?’ అంది.

రతన్‌ జవాబిచ్చేలోపు ‘మరి నువ్వు మంచాలు జరిపేశావు కదా’ అని అత్తయ్య సమాధానం
షాక్‌ నుంచి తేరుకునేలోపు హాసినిపై మరో పిడుగు. ‘నీ పెళ్లికి ముందే ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను’ రతన్‌ అన్నాడు.
‘మరి నన్నెందుకు చేసుకున్నావు?’ 
‘కొడుకును కందామని’ 
‘ఏం అది కనదా?’ 
‘దానికి పిల్లలు పుట్టే చాన్స్‌ లేదు పాపం.’ 
మళ్లీ అత్తయ్య రంగంలోకి దిగింది. ‘మా వాడు చేసుకోడానికి కో అంటే కోటిమంది ఉన్నారిక్కడ. నీకు తోడు కావాలి. మాకు మనవడు కావాలి. మన మూలాలు ఉన్నవాడైతే మంచిదని  నిన్ను చేసుకోడానికి ఓకే అన్నాం’ అంది.

కొడుకు గాయం చేస్తే తల్లి కారం రాస్తుంది. కాస్సేపు శ్మశాన నిశ్శబ్దం. ఇంటికన్నా ఆఫీసు పదిలమని హాసిని బయటపడింది. ఆఫీసుకు వెళ్లింది కానీ పనిచేయలేకపోయింది. హాఫ్‌ డే సెలవు పెట్టింది. ఒకరిద్దరు ఫ్రెండ్స్‌ను కల్సింది. గర్భందాల్చిన స్త్రీకి అమెరికాలో సహాయాలు, ఉపశమనాలు ఎలా ఉంటాయో వారితో మాట్లాడి తెల్సుకుంది.
ఇంటికొచ్చిన హాసినితో ఎవరూ మాట్లాడలేదు. తను చేయాల్సిన పనులన్నీ చేసి తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకొని పడుకుంది. భవిష్యత్తుపై ఒక నిర్ణయానికి వచ్చి కళ్లు మూసుకుంది.

తెల్లవారింది. సమయం పదయింది. హాసిని ఆఫీసుకు ఆ రోజూ సెలవు పెట్టింది. కానీ ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. స్నేహితురాలు హితైషి సాయంతో దగ్గర్లోని గర్భిణుల వైద్య సహాయ కేంద్రానికి వెళ్లింది. 
‘చెప్పు. ఏం డిసైడయ్యావు?’ హితైషి అడిగింది. ‘మగబిడ్డ అయితే ఇప్పుడే అబార్షన్‌ చేయించుకుంటాను.’
‘ఇప్పటికిప్పుడు కాదు. కొన్ని ప్రొసీజర్స్‌ ఉన్నాయి. అందరూ మగబిడ్డ కోసం కలలు కంటారు. నువ్వేంటిలా?’
హాసినికి కళ్ల నీళ్లు తిరిగాయి. తనెంత నరకం అనుభవిస్తోందో వివరించింది.

‘ఆడపిల్లయితే మనూర్లో కంటాను. నా పాపను బాగా పెంచుకుంటాను. హైదరాబాద్‌ వెళ్లిపోతాను’ అంది.
‘సరే. బిడ్డ ఎవరన్నది తెల్సే ‘నిప్ట్‌’ పరీక్షకు వెళ్దాం. 
‘మరి అబార్షన్‌ అవసరం పడితే రతన్‌ అంగీకారం కావాలా?’ 
‘అక్కర్లేదు. ఇక్కడి చట్టాల ప్రకారం అబార్షన్‌ పూర్తిగా స్త్రీ వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించింది. భార్య అబార్షన్‌ విషయం ఆస్పత్రివారు భర్తకు కూడా చెప్పరు’
హాసినిలో కొండంత రిలీఫ్‌. సంతోషంగా టెస్ట్‌ చేయించుకుంది. రిపోర్ట్‌ కోసం నిరీక్షణ. ఒకటే ఉత్కంఠ. రిపోర్ట్‌ వచ్చింది. ఆడపిల్ల. హితైషిని గట్టిగా పట్టుకొని ఆనందబాష్పాలు రాల్చింది హాసిని.

ఓ వారం పోయాక ‘మా అమ్మకు బాగోలేదట. చూడాలని ఉంది. హైదరాబాద్‌ వెళ్తాను’ రతన్‌తో చెప్పింది. ఊ అనలేదు. ఉహూ అనలేదు. అత్తయ్య కలగచేసుకుంది.‘అయితే ఆ డెలివరీ అక్కడే కానిచ్చుకొని రా’ అంది.
తన ప్రయాణానికి ఇంత సులువుగా మార్గం దొరుకుతుందని హాసిని అస్సలు ఊహించలేదు. 
ఆ రోజు తను ఫ్లైట్‌ ఎక్కాల్సిన రోజు. ఎయిర్‌పోర్ట్‌కు రమ్మని రతన్‌ను అడగలేదు. వస్తానని తనూ అనలేదు. వెళ్తున్నానని అత్తయ్యకు కూడా చెప్పలేదు. లగేజి తీసుకొని కేబ్‌ ఎక్కడానికి తన మానాన తను బయటికొచ్చింది.

పెట్టెబేడాతో ఉన్నపళంగా ఇంటికొచ్చిన హాసినిని చూసి అంతా అవాక్కయ్యారు. తనొస్తున్నట్లు కనీసం అమ్మకి కూడా చెప్పలేదు. అమ్మ కళ్లల్లో తెలీని ఆదుర్దా. తను గ్రహించకపోలేదు. అమ్మను ఒడిసిపట్టుకొని ఆమెకు మాత్రమే వినిపించేలా ‘కంగారు పడకమ్మా. ఏం కాలేదు’ అంది. ఆ పూటంతా హాయిగా ఆనందంగా గడిచింది. ఆ మర్నాడు శంకించే కళ్లనుంచి తప్పించుకోలేకపోయింది. వదినల గుసగుసలకు తెరదించాలని అనుకుంది. పూసగుచ్చినట్టు అంతా చెప్పింది. తల్లి బావురుమంది. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. అన్నయ్యల ముఖాల్లో నెత్తురు చుక్కలేదు.

నెల గడిచింది. అమెరికా నుంచి ఒక్క ఫోన్‌ లేదు. అమెరికాకూ ఒక్క ఫోన్‌ పోలేదు. తల్లితో విడిగా ఉండటానికి అన్నయ్యలను కష్టంమీద ఒప్పించింది. ఇల్లు మారాక చేసిన మొదటి పని ఓ అడ్వకేట్‌తో భేటీ. విడాకులకు నోటీసు పంపించింది.
నెలలు నిండిన హాసినికి పౌర్ణమి రోజు పాప పుట్టింది. శశి అని పేరుపెట్టుకుంది. బిడ్డకు నాలుగైదు నెలలు వచ్చేదాకా అమ్మ సహ తనూ ఉండేది. తర్వాత జాబ్‌కి వెళ్లింది. ‘ఉద్యోగం ఉంటేనే ఆర్థిక పటుత్వం.అప్పుడే స్త్రీకి మనుగడ. ఈ పరిస్థితుల్లో తను జాబ్‌ అస్సలు మానకూడదు’ అనుకుంది. పాపను పూర్తిగా అమ్మ చేతుల్లో వదిలేసి బిజీ అయిపోయింది.

దాదాపు రెండేళ్ల పోరాటం. రతన్‌ ఇండియా రాకుండానే పవర్‌ ఆఫ్‌ అటార్నీలతో పనైపోయింది. వాళ్లు వదిలించుకోవాలని చూడ్డంతో విడాకులు సులువుగానే మంజూరయ్యాయి. విడాకులు పొందినప్పటికీ రతన్‌ను అంత సులువుగా వదలకూడదని అనుకుంది. తనను మానసికంగా శారీరకంగా హింసించినందుకు బుద్ధి చెప్పాలనుకుంది. ‘ఎన్‌ఆర్‌ఐ లీగల్‌ సర్వీస్‌’ను ఆశ్రయించింది. ఒక అడ్వకేట్‌ ద్వారా అతనిపై చర్యలకు ప్రయత్నాలు పెంచింది.

పాప అల్లారుముద్దుగా పెరుగుతోంది. డ్యూటీ నుంచి వచ్చేక ఓ గంటో ఘడియో పాపతో గడిపేది. ఒక్కోరోజు అదీ ఉండేది కాదు. తనొచ్చేసరికి నిద్రపోయేది. పాపకు అమ్మమ్మే అమ్మ నాన్న దైవం అన్నీని. పాపకు నెలలు గడుస్తున్నాయి. పాప పనులతో జానకమ్మకు అలసట కలిగేది.
అప్పటివరకు ఇంటిపనులు మాత్రమే చేయడానికి ఉన్న పనిమనిషిని హాసిని మార్చేసింది. అన్ని పనులూ చేసే మరో మనిషిని కుదిర్చింది. పనుల భారం తగ్గినప్పటికీ పాప చిన్నదానికి పెద్దదానికి పెట్టే నస ఎక్కువైంది. పాప దృష్టి మరల్చి అమ్మకు ప్రశాంతత కల్పించాలని మంచి టీవీ, పిల్లల ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేసింది. అవి బోర్‌ కొడితే చూడ్డానికి ఓ టాబ్‌ కొన్నాది.

అయితే టీవీ... లేదంటే టాబ్‌. మరో లోకం ఉండట్లేదు పాపకు. తెలీకుండానే వాటి ఊబిలో శశి కూరుకుపోయింది. అమ్మ కోసం ఆలోచిస్తే వాటికి పాప అంటుకుపోయింది. ఈ సంగతి గ్రహించేసరికే చేయి దాటిపోయింది. ‘తప్పు చేశానా?’హాసిని మథనపడింది.
పాప ప్లేస్కూల్‌ నుంచి రెగ్యులర్‌ స్కూల్‌కు ఎదిగింది. ఒక తరగతిలోంచి మరో తరగతిలోకి పాసైపోతోంది. జానకమ్మకు అదే ఆశ్చర్యంగా ఉండేది. ‘సరిగా చదవకపోయినా ఎలా పాస్‌ అయిపోతోంది?’ అనుకునేది. శశి సరిగా చదవడంలేదన్న సంగతి ఓ రోజు పాపను హాసిని గట్టిగా మందలిస్తున్నపుడు తెల్సింది. స్కూల్‌లో ఇప్పుడు పిల్లల్ని కొట్టడం, తిట్టడం లేదని తెల్సింది కానీ, చదవని పిల్లల్నీ పాస్‌ చేసేస్తారా!’ ఆమెకు అంతుపట్టలేదు.

పాఠశాలలన్నీ ఇప్పుడు ఉన్నత ప్రమాణాలతో నడుస్తున్నవే. ఒక క్లాస్‌ నుంచి మరో క్లాస్‌కు ప్రమోట్‌ అవడానికి కావల్సిన కనీస మార్కులు ప్రతి విద్యార్థికీ వస్తాయి. ప్రమోట్‌ అవుతున్నంత మాత్రాన తెలివితేటలతో వాళ్లు రాణిస్తున్నట్లు కాదు. ఈ విషయాలు అమ్మకు చెప్పినా పెద్దగా అర్థంకావని హాసిని ఎప్పుడూ చెప్పలేదు.
పాపకిప్పుడు పదేళ్లు. తను ఇంటికొచ్చేసరికి అమ్మ ఉండట్లేదు. శశికి అది నచ్చట్లేదు. స్కూల్‌కి లేదా ట్యూషన్‌కి వెళ్లడం, మిగతా టైమంతా కుదేసినట్లు టీవీ ముందో టాబ్‌ ముందో కూర్చోడం. ఇదీ శశి దినచర్య.

శశిలో వయసుకు మించిన ఒళ్లు. అవసరానికి మించిన తెగువ. కట్టడి చేయలేని దుడుకుతనం. విచక్షణ మరిచిన మాటలు అబ్బేశాయి. అమ్మమ్మంటే లెక్కలేదు. అమ్మన్నా భయం లేదు. ఓ రోజు ‘అస్తమానం టీవీ ఏంటి. కాస్సేపు చదువుకోవా’ అంటే ‘హె. చదువు చదువని బుర్ర తినేస్తావ్‌. నీకేమైనా పిచ్చా... కొవ్వా?’ అన్నాది.
జానకమ్మ నివ్వెరపోయింది. ‘పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు?’ తప్పమ్మా అంది. ‘మరి నా ఫ్రెండ్‌ నేను ఇలానే మాట్లాడుకుంటాం’ అన్నాది.

ఇంగ్లీషు మీడియం పిల్లల్లో కొందరు తెలుగుపదాల అర్థాలు ఔచిత్యాలు తెల్సుకోకుండానే వాడేస్తారు. ఆ సంగతి జానకమ్మకు తెలీలేదు పాపం. శశిలో వస్తున్న మార్పుని ముఖ్యంగా మాటల దురుసుతనాన్ని కూతురికి చెప్పాలనుకుంది.
ఆ రోజు ఆదివారం. హాసిని ఇంటిదగ్గరే ఉంది. కోపంగా ఉంది. ముందురోజు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఫోన్‌ చేస్తే వెళ్లింది. శశి స్టడీస్, ప్రవర్తన ఏం బాగుండటం లేదని చెప్పింది. మీరు యాక్షన్‌ తీసుకోవాలంది. ‘ఇంకేం తీసుకోవాలి. స్కూల్‌ మారిస్తే బాగుంటుందేమోనని ఇప్పటికే రెండు స్కూల్స్‌ మార్చాను. ట్యూషన్స్‌ మార్చాను. అయినా మారట్లేదు’ అనుకుంది. ప్రిన్సిపాల్‌ పిలిచి ఫిర్యాదు చేసేవరకూ పరిస్థితి అంత తీవ్రంగా ఉందనుకోలేదు. ఏం చేయాలో తోచక మనసంతా అలజడిగా ఉంది.

శశి ఉదయం పదయినా లేవలేదు. మిగతా రోజుల్లో కూడా తనని నిద్ర లేపడం చాలా కష్టం.
‘బారెడు పొద్దెక్కినా ఆడపిల్ల లేవకపోతే ఎలాగమ్మా. ఆ అలవాటు మంచిదికాదు’ జానకమ్మ యథాలాపంగా అంది.
హాసినికి ఛెళ్లున కొట్టినట్లనిపించింది. అమెరికాలో రతన్‌ అమ్మ తనను అన్నమాట కనెక్టయింది. లేపుతున్నా లేవని శశి మీద విరుచుకు పడిపోయింది.‘లేవవే... చచ్చావా... చంపుతున్నావా’ అంటూ ఒకటి కాదు రెండు దెబ్బలు వేసింది.
శశి ఒక్కసారి హడలిపోయింది. కళ్లు విప్పుతూనే ‘హె.. ఎందుకలా కొడుతున్నావ్‌. మెంటలా?’ అంది.
అంతే! పాపను అమాంతం కిందకు లాగీసింది. ‘ఔనే. మెంటలే. పిచ్చే ఎక్కింది నాకు’ అంటూ కాళ్లతో కుమ్మీసింది. పక్కనే స్కూల్‌బెల్ట్‌ ఉంటే దాంతో బాదీసింది.

‘అయ్యో అయ్యో... ఏవైందే తల్లీ. దానికన్నా నీ గురించే భయమేస్తోందే.’ అని జానకమ్మ వలవల ఏడ్చీసింది. ఇన్నేళ్ల జీవితంలో హాసినిని అలా చూడ్డం ఇదే మొదటిసారి.                         
బెల్టు విసిరేసి విసవిస తన గదిలోకి వెళ్లిపోయింది హాసిని.
ఏడుస్తున్న మనవరాలి దగ్గరకొచ్చి ఓదార్పుగా జానకమ్మ పట్టుకోబోయింది. ‘హే... రాక్షసీ! నన్ను ముట్టుకోకు. పోవే రాక్షసీ పో’’ అంటూ కీచు గొంతుతో పెద్ద నోరుపెట్టి అరుస్తూ అరచేతులతో ముఖాన్ని కప్పేసుకుంది.

రెండు గదుల్లో మూడు జీవచ్ఛవాలు. చాలాసేపు చలనం లేకుండా పడున్నాయి. ఆ తర్వాత మనవరాలి దగ్గరినుంచి కూతురి గదిలోకి వెళ్లింది జానకమ్మ. హాసిని ఏడుస్తోంది. కూతురిని పొదివి పట్టుకునేసరికి దుఃఖం ఎక్కువైంది.
‘ఏంటమ్మా నువ్వు చేసినపని? చిన్నపిల్ల. ఏదో వాళ్ల ఫ్రెండ్స్‌ని అన్నట్లు ఓమాట అనేసింది. దానికి అంతలా కొట్టాలా? లే. పాపని దగ్గరకి తీసుకో’ అని బలవంతాన లేపి మనవరాలి దగ్గరకు తీసుకొచ్చింది.
శశి తల్లిని దగ్గరకు రానివ్వలేదు. చాలసేపు పెనుగులాడిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్వసాగింది. కూతురిని ఒడిలోకి తీసుకొని చెమ్మగిల్లిన కళ్లతో ఓదార్చింది.

హాసినిలో అనంతమైన ఆలోచనలు. ఒకపట్టాన తెగక రవంత నిద్రలోకి జారిపోయింది. రతన్‌ సహా వాళ్లమ్మ తనను ఏవేవో దెప్పుతున్నట్లు అనిపించి తుళ్లిపడి లేచింది. ‘అమ్మ చేతుల్లో వదిలేయడం తప్ప తల్లిగా ఏం చేశాను? కనీసం ఐదేళ్లొచ్చే దాకా అయినా కంటికి రెప్పలా చూసుకున్నానా’ అని ప్రశ్నించుకుంది.

ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కొంగు బిగించింది. ఎప్పుడూ బిజీగా ఉండే ఉన్నతశ్రేణి దంపతులు తమ పిల్లల కోసం ఏయే ఏర్పాట్లు చేస్తారో ఆరా తీసింది. పెద్దవాళ్ల ఆసరా తీసుకోవడమే కాకుండా అన్నిరంగాల్లో తీర్చిదిద్దే కొన్ని కోచింగ్‌ సెంటర్లలో వేస్తారని తెల్సుకుంది. అలాటివాటిలో ఒకదాన్ని ఎంచుకుంది. స్కూల్‌ అయ్యాక అక్కడికి పంపించసాగింది.

‘బాల్యం ఎవరికైనా అమూల్యం. ఆ వయసులో సరిగా పెంచలేకపోయాను. కనీసం ఈ వయసులోనైనా తనకి మంచి అమ్మగా ఉంటాను’ అనుకుంది. శశి అవసరాలను చూసుకోడానికి వీలుగా ఉద్యోగం మానేసింది. ‘ఇన్నేళ్ల ఉద్యోగంలో కాస్తో కూస్తో సంపాందించింది చాలు. కూతురు కుదుట పడ్డాక జాబ్‌ సంగతి చూడొచ్చులే అనుకుంది.
భయపెట్టే నీడలా కాకుండా కాపాడే రెప్పలా మారింది. కూతురికి అమ్మలా కాదు స్నేహితురాలిగా తోడుగా నడవసాగింది.
శశి ఇప్పుడు శుక్లపక్షం జాబిలమ్మలా అలరిస్తోంది.
- వేగి రామచంద్ర రావ్‌

ఇదీ చదవండి: గతజన్మలో అబ్బాయి.. ఈ జన్మలో అమ్మాయి.. షాకైన తల్లిదండ్రులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement